Politics

మీ విధానాలు, అరాచకాలు నచ్చకనే ఎమ్మెల్యేలు తిరగబడ్డారు

మీ విధానాలు, అరాచకాలు నచ్చకనే ఎమ్మెల్యేలు  తిరగబడ్డారు

మా పార్టీలో చేరిన నలుగు ఎమ్మెల్యే లను ఓ ముష్కరుడు తిట్టినందుకు పార్టీ సభ్యుడిగా సారీ చెబుతున్న

అత్యంత బలవంతుడిని చెప్పుకునే సింహానికి క్యాంప్ లు నిర్వహించాల్సిన దుస్థితి వచ్చింది

అయినా నిజమైన తెలుగు బిడ్డలు తిరగబడ్డారు

ఏ నిమిషానికి ఏమీ జరుగునో… అన్నట్టు ఉంది మా పార్టీ లో పరిస్థితి

కాలేశ్వరం నిర్మాణం వల్ల తెలంగాణకు ఒక్క టన్ను లబ్ది చేకూరితే, పోలవరం వల్ల పది టన్నుల లబ్ది ఏపీకి చేకూరుతుంది

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

మంత్రి పదవి ఇవ్వనందుకు శాసనసభ్యులు ఎవరు కూడా బాధపడరు. కానీ మర్యాద ఇవ్వకపోతే బాధపడతారు. శాసనసభ్యులకు ఎందుకు మర్యాద ఇవ్వవు?, అందర్నీ నువ్వు, నువ్వు అంటూ పిలుస్తావు… నిన్ను మాత్రం ఎమ్మెల్యే లు, సార్…మీరు
అని పిలువాలా?, ఇదేమి పద్ధతి. అవకాశం దొరికితే ఎవరైనా గూబ గుయ్యి మనిపిస్తారు… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే చేశారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మీ విధానాలు, అరాచకాలు నచ్చకనే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వారు నిజమైన తెలుగు బిడ్డలు. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఇన్చార్జిలను వేయడం, బుద్ధున్న వారు చేసే పనేనా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను మనుషులుగా ట్రీట్ చేస్తే some తృప్తి ఉంటుంది. మర్యాదగా ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కనీసం గౌరవించక పోతే, ఇటువంటి పరిస్థితులే పునరావృత్తం అవుతాయని రఘురామకృష్ణం రాజు అన్నారు.

అమ్మ బాబుకు పుట్టిన వారు పార్టీ మారరన్న ఓ ముష్కరుడు

తెలుగుదేశం పార్టీ వీడి, ఓ నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో చేరారు. అమ్మ, బాబుకు పుట్టిన వారెవరు ఇలాగా పార్టీ మారరు అంటూ దిక్కుమాలిన ఓ దరిద్రుడు ఒకప్పటి ప్రముఖ ఛానల్ లో కూర్చొని మాట్లాడాడు. ఎవరి ఆముష్కరుడు అన్నట్లు. టిడిపి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, దాచేపల్లి గణేష్, కరుణం బలరాం లలో ఎవరిని అంత మాట అన్నది. పార్టీలోకి వారిని సిగ్గు లేని వెధవలు తీసుకున్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే లాక్కొని, ఇప్పుడు వెధవ వ్యాఖ్యలు చేస్తారా?. ఈ వ్యాఖ్యలకు అర్థం పర్థం ఏమైనా ఉందా?, ఒకవేళ బాధపడితే సొంత పార్టీ వాళ్లు బాధపడాలి. టిడిపి నాయకులు ఎప్పుడు కూడా ఆ నలుగురు ఎమ్మెల్యేల గురించి ఇంత అసహ్యంగా మాట్లాడలేదు. జనసేన పార్టీ నుంచి ఎన్నిక గెలిచినా రాపాక వరప్రసాద్ గురించి కూడా, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అసభ్యంగా మాట్లాడలేదు. ఒకవైపు శ్రీరంగనీతులు చెబుతూనే, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కొని వెధవ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఆ పార్టీకి చెందిన సభ్యుడిగా నలుగురు ఎమ్మెల్యేలకు తాను క్షమాపణలు చెబుతున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని, ఆ ముష్కరుడితో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సారీ చెప్పించాలి అని రఘు రామకృష్ణం రాజు అన్నారు.

ఏ నిమిషానికి ఏమి జరుగునో…

తెలుగులో ఆల్ టైం రికార్డ్ సృష్టించిన లవకుశ చిత్రంలోని ఏ నిమిషానికి ఏమి జరుగునో… అనే పాట తరహాలో, తమ పార్టీలో పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అత్యంత బలవంతుడిని, సింహాన్ని అని చెప్పుకునే వ్యక్తికి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలకు క్యాంపులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొనడం దురదృష్టకరం. ప్రజలు 151 స్థానాలలో గెలిపించిన తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా, ప్రస్తుతం తమ పార్టీ పెద్దలకు టిడిపి చెప్పు దెబ్బ తగిలినట్లు అయిందని రఘురామ కృష్ణం రాజు అన్నారు. ఇతర పార్టీల నుంచి లాక్కొన్న ఐదు మంది ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీ
ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించడం సిగ్గుచేటు. ఎమ్మెల్యే లు
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లను తాము పరిగణలోకి తీసుకోలేదని, టిడిపి, జనసేన నుంచి తమ పార్టీలో చేరిన వారిని ఏ ప్రాతిపదికన తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించారో అర్థం కావడం లేదు. ఇతర పార్టీల శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకోమని చెప్పి, ఇప్పుడు చేర్చుకోవడానికి సిగ్గుండాలి. తనకు తానే శ్రీరామచంద్రునిగా చెప్పుకునే వ్యక్తి, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బాహాటంగా చేర్చుకోవడాన్ని బహిరంగ వ్యభిచారం చేయడమని అనరా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి 5 మందిని చేర్చుకున్నామని, వారిని తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించామని ప్రభుత్వ సలహాదారు సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి బాహాటంగానే మీడియా ముందు చెప్పినప్పటికీ, స్పీకర్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అనర్హులు గా ఎందుకు ప్రకటించడం లేదని ఆయన నిలదీశారు.

ఉండి, భీమవరంలో నిలబడితే జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తారు

పులివెందులలో పులి అయిన జగన్మోహన్ రెడ్డి, తమ ఊరు ఉండి, భీమవరం లలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే స్థానికులు చిత్తుచిత్తుగా ఓడిస్తారని రఘురామకృష్ణం రాజు అన్నారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే చులకనగా చూస్తే ఎలా?, మీ చేత తిట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజకీయాలలోకి రాలేదు. ఎమ్మెల్యే లకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. వారిని గౌరవించడం ఇకనైనా నేర్చుకోవాలి. లేకపోతే పరిస్థితులు తిరగబడతాయి అని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీ లు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఢిల్లీ లో విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పి ఎ రెడ్డిలు మాత్రమే ఉంటారు. వారంతా లోపల ఉంటే, ఎస్సీ బీసీ ఎంపీలు మాత్రం షేడు వంటి చోట కూర్చోవలసిన పరిస్థితిని కల్పించారు. తాను వెళ్ళాక, సహచర ఎంపీలను చూసి ఇక్కడ కూర్చున్నారు ఏమిటని ప్రశ్నించగా, లోపల వారంతా ఉన్నారని… ముఖ్యమంత్రి పిలుపు కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారన్నారు. తాను లోపలికి దూసుకు వెళ్ళగా లోపల సీఎంతో పాటు ఇతర రెడ్డి ప్రజా ప్రతినిధులు జీడిపప్పు తింటూ కూర్చున్నారని తెలిపారు. ఎవరైనా బీసీ, ఎస్సి నేతలు తాము కూడా ముఖ్యమంత్రితో కలిసి జీడిపప్పు తిన్నామని చెబితే అదంతా ఉత్తి అబద్ధమే. అదే నిజమైతే ఒక ఫోటోను విడుదల చేయాలి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రతి ఒక్కరూ గౌరవం ఇచ్చి పుచ్చుకోమనే మూడ్ లో ఉన్నారు. ఒక ఎమ్మెల్యేకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని, ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెబితే అలిగి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేశారని అంటున్నారు. అంటే మా పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేలు నేరుగా కలిసే పరిస్థితి రావాలి. ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ ఉంటే తప్పితే, సచివాలయానికి రారు. ఇక ఆయన ఇంట్లోకి ఎంపీలను, ఎమ్మెల్యేలను అనుమతించరు. ఇంటి పక్కనే ఉన్న క్యాంపు కార్యాలయంలోకి కూడా ఎమ్మెల్యేలను రానివ్వకపోవడం సిగ్గుచేటు. గతంలో పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తారని ఎంపీలతో మీటింగు ఏర్పాటు చేశారు. తాము మీటింగుకు హాజరైనప్పుడు, ముందస్తు అపాయింట్మెంటు లేదన్న కారణంగా ఎమ్మెల్యేలను వెనక్కి తిప్పి పంపించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కూడా ఆయన్ని కలవాలి అంటే సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిఏ, పిఎస్ లను ప్రసన్నం చేసుకుంటే, వారు విజిటర్స్ జాబితాలో పేరు చెరిస్తే తప్పితే ఎమ్మెల్యేలకు ప్రవేశం లేదు. ఈ విషయంలో తాను బహిరంగ సవాల్ చేస్తున్నాను. ఇప్పటివరకు సీఎం క్యాంప్ కార్యాలయానికి నేరుగా ఎమ్మెల్యేలను అనుమతించలేదు. ఇకపై అనుమతించే పరిస్థితి రావచ్చు అని రఘురామకృష్ణంరాజు అన్నారు.

నలుగురు… 40 మంది కావొచ్చు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగుబాటు చేసిన నలుగురు ఎమ్మెల్యేలే, రేపు 40 మంది కావచ్చు. ఎవరా నలుగురు అన్నది సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. పరిస్థితిని చక్క దిద్దుకోకపోతే యువరాజు చిత్రంలో ఏరా నలుగురు అనే పాటను ముఖ్యమంత్రి పాడుకుంటూ గడపాల్సి వస్తుంది. ఇంకా అవమానాలను భరించే, సహించే శక్తి ఒక్కరిద్దరు జాకోగాళ్ళకు మాత్రమే ఉంటుంది. సిగ్గు ఉన్న ప్రతి ఒక్కరూ తిరగబడతారు. కొడితే కొడుతారు . తిడితే తిడతారు. గతంలో చాలామంది ఎమ్మెల్యేలను కొట్టి ఉంటారు. మళ్లీ కొడుతామంటే వారు ఊరుకునే పరిస్థితి లేదు. మీరు మీ పరిమితుల్లో ఉండడం మంచిదని జగన్మోహన్ రెడ్డి ని పరోక్షంగా రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. రెడ్డి సామాజిక వర్గంలో ఎంతోమంది ఉద్దండులైన నాయకులు ఉన్నారు. గతం లో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి వంటి లబ్ద ప్రతిష్టులైన నాయకులు ఉండగా, ఇటీవల కొంతమందిని చూస్తే బాధ అనిపిస్తుంది. తానేమీ రెడ్డి వ్యతిరేకిని కాను. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంతో మందితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ తనని తిట్టిన దరిద్రులను మాత్రమే తాను తిట్టానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

చిల్లు పడ్డ నావ వైకాపా పార్టీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెల్లుపడ్డ నావ మాదిరిగా తయారయింది. చిల్లుపడిన నావలో ఎవరు ప్రయాణం చేయాలని అనుకోరు. ఇప్పటికైనా పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తే పార్టీ పరిస్థితి బాగుపడవచ్చు. అయినా తన వైఖరిని మార్చుకోను అంటే ప్రతిపక్షాలకు మరిన్ని విజయాలు దక్కవచ్చు. ఇప్పటివరకు కొద్దిమంది మాత్రమే నోరు విప్పారు. నోరు విప్పలేని ఎంతోమంది తరపున తాను ముఖ్యమంత్రిని కోరేది ఏమిటంటే… ఎమ్మెల్యేలకు నేరుగా కలిసే అవకాశాన్ని కల్పించండి. కేంద్ర మంత్రులను ఎవరైనా ఎంపీలు కలిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించడం మానండి. ఎవరైనా కేంద్రమంత్రిని కలవాలి అంటే, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిని వెంటబెట్టుకోని వెళ్లాలని నిబంధనలు ఇకపై విధించకండి. గతంలో ఇదే తరహా నిబంధనలను పెట్టారు. తమ పార్టీ ఎంపీలలో అందరికంటే ఎక్కువగా కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు తనకు ఉన్నాయి. మంత్రులతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న తాను విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏముంది?, వారి కంటే ఎక్కువగానే కేంద్ర మంత్రులతో తాను భేటీ అయ్యాను. ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యులకు గౌరవం ఇవ్వండి. వారేమి మీ దొడ్లో పశువులు కాదు. కట్టివేయాలని చూడకండి. ఇప్పటికైనా మీరు మారాలి. మారకపోతే ప్రజలే మిమ్మల్ని మారుస్తారని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయం సాధించిన టిడిపి ఎమ్మెల్సీ అనురాధను రఘురామకృష్ణం రాజు అభినందించారు. ఆమె ఇంకా మరిన్ని ఉన్నత స్థానాలకుఎదగాలని ఆకాంక్షించారు.

బిల్లులో పెట్టిన పోలవరాన్ని సాధించలేక పోతే… ఇంకా ఏమి సాధిస్తారు?

రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా అన్నది చేర్చలేదు. ప్రత్యేక హోదా అన్నది కేవలం హామీ మాత్రమే. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణాన్ని చేపడుతానని చెప్పింది. పోలవరాన్ని సాధించలేక పోతే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏమి సాధించగలరని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. పార్లమెంట్లో పోలవరం గురించి సమాధానం చెప్పిన కేంద్ర మంత్రి పటేల్ తో తాను వ్యక్తిగతంగా మాట్లాడాను. ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. పోలవరం ఎత్తు కేవలం 141.5 కు కుదిస్తే బ్యారేజ్ అవుతుందని చెప్పాను. పోలవరం పెద్ద డ్యాం గా 147 అడుగుల ఎత్తుతో నిర్మిస్తే 180 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఉంటుందని చెప్పాను. 141.7 అడుగుల ఎత్తుకు పరిమితం చేస్తే, కేవలం 95 టిఎంసిల నీటి నిల్వ కు పరిమితం అవుతుందని పేర్కొనగా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే చేస్తుందని ఆయన బదులిచ్చారు. డయాఫ్రం వాల్ పాడయిందో దానికి కేంద్ర ప్రభుత్వమే నిధులను భరిస్తుంది. రివర్స్ టెండర్రింగ్ వల్ల 1900 కోట్ల రూపాయలు పాడు చేశారు. ఇప్పటికే భూసేకరణ జరిగింది. మరో 10 నుంచి 15 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది. రిహాబిలిటేషన్ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇతర కేసులు, బాబాయి హత్య కేసు లేకపోయి ఉంటే, పోలవరం పైనే ప్రత్యేక దృష్టి సారించి ఉండేవారని రఘురామకృష్ణం రాజు అన్నారు. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి ఓ శాపం. మా తండ్రి ప్రారంభించారు.. నేను పూర్తి చేస్తానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి అయినా, ఆయన అయినా సొంత నిధులతో ప్రారంభించలేదు… పూర్తి చేయడం లేదని గుర్తించాలి. పోలవరం నిర్మాణ పనులను తాను టిడిపిలో ఉండగా బస్సులను ఏర్పాటు చేసి ప్రజలు తిలకించే విధంగా చర్యలు తీసుకున్నాను. ఎంతోమంది ప్రజలు పోలవరం నిర్మాణ పనులను ప్రత్యక్షంగా వీక్షించారు. లేకపోతే, తమ పార్టీ నాయకులు చెప్పిన అబద్ధాలే నిజమని అనుకునే ప్రమాదం ఉండేది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారాన్ని పోలవరం వరంగా మార్చుకొని నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని నాశనం చేశారు. ఏడాదిన్నరలోగా పోలవరం పూర్తి చేసి ప్రారంభిస్తానని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఏడాదిలోపు ఎన్నికలు పెట్టుకొని, ఏడాదిన్నరలో ఎలా పూర్తి చేస్తారు. తిరిగి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు. నిజంగానే పోలవరాన్ని పూర్తిచేయాలని చిత్తశుద్ధి ఉంటే, ఏప్రిల్ మాసంలోగా పూర్తి చేయాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం… పోలవరాన్ని పూర్తి చేస్తామని మాటలతో ప్రజల్లో భయాందోళనలు కలిగించకండి. పోలవరం పూర్తి చేయగలిగితే చేయండి. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. వెలిగొండ, హంద్రీనీవా ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించండి. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అదనంగా ఒక్కటన్ను లబ్ధి చేకూరితే, పోలవరం పూర్తి చేస్తే ఆంధ్ర ప్రదేశ్కు 10 టన్నుల లబ్ధి చేకూరుతుంది. పోలవరం ప్రాజెక్టును 40 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయగలిగితే రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుంది. కృష్ణా జలాలను శ్రీశైలం వద్ద నుంచే రాయలసీమకు మళ్లించవచ్చు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల డెల్టా ఆయకట్టును స్థిరీకరించవచ్చు. కృష్ణా సాగునీటి కాలువలకు ఇబ్బంది తలెత్తే అవకాశమే ఉండదు. ఏలేరు రిజర్వాయర్ ద్వారా, విశాఖ కు నీరు అందించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుదుర్చుకున్న మామిడి తాండ్ర, మసాలా పరిశ్రమలకు కూడా నీరు అవసరమే. ఇప్పటివరకు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఓ 20 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చి, పోలవరం పూర్తిచేయాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పెరుగనున్న జిడిపి చూపించి అప్పు చేయవచ్చు. బటన్ నొక్కాను అని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేశావు. ఎవరైనా ఓటు వేశారా?, చివరకు పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయలేదు. అభివృద్ధి చేస్తే ఎవరైనా ఓటు వేస్తారు. బటన్ నొక్కాను అంటే ఎవ్వరు ఓటు వేయరు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే, ప్రతిపక్షాలతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. తనని ఆహ్వానిస్తే తాను కూడా వస్తాను. పార్లమెంట్ సభ్యుడిగా తనపై అనర్హత వేటు వేయించాలని చూశారు. అది కుదర లేదు. అధికార పార్టీ సభ్యుడిగా కాకపోయినా, ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా భావించి పిలిస్తే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటాను. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల నేతలతో కలిసి వెళ్లి ప్రధానిని కలుద్దాం. ఆయనకు ఒక వినతి పత్రాన్ని అందజేద్దాం. వడ్డీ లేకుండా అప్పు ఇవ్వమని కోరుదాం. ప్రతి ఏటా, రాష్ట్రానికి ఇచ్చే డబ్బులలో వాటిని జమ చేసుకోమని అభ్యర్థిద్దాం. ఒకటి రెండు ప్రతిపక్ష పార్టీలను మేనేజ్ చేసి పొగిడించుకుంటే ప్రయోజనం ఉండదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ప్రజలు కలిశారు… నేతలు కలవడం ఖాయం

రాష్ట్రంలో ప్రజలు కలిసిపోయారని, ఇక ప్రతిపక్ష పార్టీల నేతలు కలవడం ఖాయం అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలవనున్నారనే వార్త పాలక పక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వీరిద్దరూ కలవకూడదని ఉద్దేశంతో టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు చెందిన 99 టీవీ లో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన నేతలను కూర్చోబెట్టి రెచ్చగొట్టే విధంగా, ఆ పార్టీ శ్రేణులలో గ్యాప్ సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కుట్రలు చేస్తే చానల్ ని చూడడం మానేస్తారు. ముఖ్యమంత్రి ఎవరో కావాలని చెప్పడం ఎందుకు… తోట చంద్రశేఖరే ముఖ్యమంత్రి కావాలని అడగవచ్చు కదా. ఈ ఛానలే కాకుండా ఇంకా కొన్ని చానల్స్ కూడా ఇదే రకమైన దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు.