Fashion

బంగారానికి బదులుగా.. బంగారాన్ని తలదన్నేలా..

బంగారానికి బదులుగా.. బంగారాన్ని తలదన్నేలా..

బంగారం అంటే ఈ మధ్య పెరుగుతున్న ధరే గుర్తొస్తోంది. అందుకే బంగారాన్ని నగలకోసం కన్నా పెట్టుబడి మార్గంగానే ఎక్కువ వాడుతున్నారు. ఎందుకంటే పదే పదే ఆభరణాలు చేయించుకోవాలన్నా, ఉన్న వాటిని మార్చుకోవాలన్నా ప్రతిసారి తరుగు, వివిధ అదనపు ఖర్చులు. మరి దానికి ప్రత్యామ్నాయాలేంటంటే
ఖర్చులు, ధరలు కారణమనే కాకుండా నేటి తరం ప్రతి ప్రత్యేక సందర్భంలో వినూత్నంగా ఉండాలనుకుంటోంది. బంగారు నగల వల్ల అది పూర్తిగా సాధ్యం కాదు. మరి ప్రతిసారి ప్రత్యేకంగా కనిపించేలా చేసే బంగారు నగల ప్రత్యామ్నాయాలు ఏంటంటే..

టెర్రకోటా జువెల్లరీ:
టెర్రాకోట మట్టితో ఈ ఆభరణాలు తయారు చేస్తారు. మట్టితో చేసిన నగలు ఏం బాగుంటాయిలే అనుకోకండి. పెళ్లి కూతురు పెళ్లికి వేసుకునేంత భారీ నగలు కూడా ఇపుడు టెర్రాకోట మట్టితో తయారు చేస్తున్నారు. చిన్న చెవి దుద్దుల నుంచి మొదలు పెట్టి భారీ హారాలు, వడ్డాణాలు కూడా ఉంటున్నాయి. ధర కూడా మనం పెట్టే అంతే ఉంటుంది. ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, అన్ని సామాజిక మాధ్యమాల్లో వీటిని తయారుచేసే వాళ్లే నేరుగా అమ్ముతున్నారు. మట్టితో చేసినవి కాబట్టి నీళ్లు పడితే పాడవుతాయి అనుకోకండి.. ఇవి నీళ్లు పడ్డా కూడా మెత్త్త బడవు. కాకపోతే కింద పడకుండా చూసుకుంటే మెరుపు తగ్గే వరకు వేసుకోవచ్చూ.

సిల్వర్ – గోల్డ్ ప్లేటెడ్ జువెల్లరీ:
వెండి నగలు అనగానే చూడగానే తెలిసిపోయేట్టు ఉండవివి. చాలా వాటికి బంగారు పూత గానీ , బంగారంతో చేసిన ప్లేటింగ్ గానీ ఉంటుంది. చూడడానికి బంగారాన్ని మించి ఉంటాయి. చెప్పాలంటే బంగారు నగలు కొనేటప్పుడు బరువు గురించి ఆలోచిస్తాం. ఇవైతే చాల తక్కువ ధరలోనే పెద్ద పెద్ద ఆభరణాలు వచ్చ్చేస్తాయి. చూడటానికి బంగారంలా ఉండే నగలు కావాలనుకునే వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం. ఈ మధ్య కేవలం వెండి జువెల్లరీ అమ్మే షాపులు వచ్చ్చాయ్, ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. బంగారు దుకాణాలలో కూడా ఈ పసిడి పూత ఉన్న వెండి నగలు చాలానే దొరుకుతున్నాయి

సిల్క్ జువెల్లరీ:
ఇవి చాలా రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చ్చాయి. అయితే ఈ మధ్య మన డ్రెస్ కి తగ్గట్టుగా చేసే కస్టమైజ్డ్ గాజులు, చెవి పోగులు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఉదహరణకి పెళ్లి చీరకు తగ్గట్టుగా అన్ని రంగులతో కూడిన సిల్క్ త్రెడ్ గాజులు చేయించుకోవచ్చు. దాదాపు 20 నుంచి 30 రకాల రంగులతో కూడిన గాజుల సెట్లు ఈ మద్య చాలా ట్రెండింగ్ . సిల్క్ వస్త్రం మీద వధూవరుల పేర్లు రాసి మగ్గం వర్క్ చేసిన గాజులు కూడా ప్రత్యేకమే.