Politics

రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది

రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది

ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ను ఆహ్వానించకపోవడం ఇందుకు కారణమైంది.రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ప్రభుత్వం ఇవ్వడం లేదని రాజ్‌భవన్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపై గవర్నర్, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ ప్రారంభానికి తనకు ఆహ్వానం రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ప్రభుత్వం ఎప్పుడూ ప్రొటోకాల్ పాటించలేదని తప్పుబట్టారు. తాను తెలంగాణ కు సేవ చేయడానికే వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి తనపై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోందని తమిళిసై విమర్శించారు.ప్రభుత్వం కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ఏప్రిల్‌ 30న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు గవర్నర్‌ను, ప్రతిపక్షాల నేతలను, పాత్రికేయులను ఆహ్వానించాల్సి ఉండగా.. ప్రభుత్వం కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కా ప్రభుత్వ, ప్రజా కార్యక్రమమైనా సర్కారు ప్రొటోకాల్‌ పాటించలేదు. రాష్ట్ర గవర్నర్‌ను ఆహ్వానించలేదు. కొన్ని మీడియా సంస్థలపైనా ఆంక్షలు విధించింది. ప్రతిపక్షాల నేతలకూ ప్రభుత్వం సరైన విధానంలో ఆహ్వానం పంపలేదు. ఇంటి గోడకు లేదా తలుపులకు కోర్టు నోటీసులు అంటించినట్లు.. ప్రతిపక్షాల నేతల ఇళ్ల ముందు ఆహ్వాన పత్రాలను పడేసి వెళ్లారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రానికి పెద్ద దిక్కు అయిన గవర్నర్‌కు కూడా ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానం పంపలేదు. ఈ విషయాన్ని గవర్నరే మంగళవారం స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.