Movies

సినిమాని తలపించేలా విజయ్‌ ఆంటోనీ లైఫ్‌

సినిమాని తలపించేలా విజయ్‌ ఆంటోనీ లైఫ్‌

సంగీతంలో ఓనమాలు దిద్దకుండానే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మంచి హిట్స్‌ అందుకుని మనసు మాట మేరకు నటుడిగా రాణిస్తున్నారాయన. అయితే, విజయ్‌ ఆంటోనీ జీవితంలో సక్సెస్‌లే కాదు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఆకలి కేకలు ఉన్నాయి.

తమిళనాడులోని నాగర్‌కోయిల్‌ మా ఊరు. నాన్న ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థలో క్లర్క్‌. దాంతో చిన్నప్పుడు మా జీవితం సాఫీగా సాగింది. నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. అంతే, ఒక్కసారిగా మా కుటుంబం తలకిందులైంది. బరువు బాధ్యతలన్నీ అమ్మే చూసుకోవాల్సి వచ్చింది. మాకంటూ సొంత ఇల్లు లేదు. ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు. దాంతో అమ్మా, నేనూ, చెల్లి బంధువుల ఇళ్లల్లో ఉన్నాం. కొంతకాలానికి నాన్న ఉద్యోగం అమ్మకు ఇచ్చారు.

ఉద్యోగ నిమిత్తం అమ్మతో కలిసి తిరునల్వేలికి వెళ్లినప్పుడు.. అక్కడ మాకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదు. ఏం చేయాలో తెలియక అమ్మ ఎంతో బాధపడింది. అదే ప్రాంతంలో ఉన్న హాస్టల్స్‌లో మేము ముగ్గురం జాయిన్‌ అయ్యాం. ప్రతిరోజూ మా ఇద్దర్నీ కలవడానికి అమ్మ వచ్చేది. అయితే, ప్రతిరోజూ మమ్మల్ని కలవడానికి వస్తే మిగతా పిల్లలు బాధపడతారని చెప్పి అమ్మను హాస్టల్‌కు రావొద్దని అక్కడి సిబ్బంది కోరారు. దాంతో ఆమె వారానికొకసారి వచ్చి కలిసేవారు. ఉద్యోగంలో భాగంగా ఓసారి అమ్మ వేరే ఊరు వెళ్లారు. చెల్లిని కూడా తనతోపాటు తీసుకువెళ్లారు. కొన్నిరోజులకే నా హాస్టల్‌కు అనుకోకుండా సెలవులు ఇచ్చారు. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో, అమ్మను ఎలా కలవాలో నాకు తెలియదు. మాకంటూ ఇల్లు కూడా లేదు. అలాంటి సమయంలో శ్రీలంక శరణార్థ విద్యార్థులతో కలిసి బస చేశాను. చేతిలో రూపాయి లేదు. అరటిపళ్లతో కాలం గడిపా. అలా, ‘ఆకలి కేకలు’ చూశా.