Kids

పిల్లలు అతిగా ఫోన్‌ వాడితే ఎన్నో సమస్యలు…

పిల్లలు అతిగా ఫోన్‌ వాడితే ఎన్నో సమస్యలు…

స్మార్ట్‌ ఫోన్‌లు ఇప్పుడు మానవ జీవితాల్లో భాగం అయిపోయాయి. ఫోన్ పక్కన లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఈ రోజుల్లో పెద్దవాళ్లతో పాటు చిన్న పిల్లలు సైతం ఫోన్లకు అతుక్కుపోతున్నాడు. స్నేహితులతో ఆటలాడుతూ, పుస్తకాలతో కాలక్షేపం చేయాల్సిన చిన్నారులు మొబైల్ గేమ్స్ లో మునిగిపోతున్నారు. వివిధ షోలు చూస్తున్నారు. సోషల్ మీడియాలోనూ మితిమీరిన ప్రమేయం తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

అయితే, ఇలా చిన్నారులు స్మార్ట్ ఫోన్లను అతిగా వాడటం వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ ఇండియా మాజీ హెడ్ మను కుమార్ జైన్ దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కంపెనీకి మాజీ అధిపతి అయిన ఆయనే స్వయంగా ‘మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వడం ఆపండి’ అంటూ తన లింక్‌డిన్ లో సందేశం రాశారు. ఒక ప్రయోగశాల చేసిన అధ్యయనం సమాచారాన్ని పంచుకుంటూ స్మార్ట్ ఫోన్ల వాడకం విషయంలో తల్లిదండ్రులను హెచ్చరించారు.

1 నుంచి 3 సంవత్సరాల పిల్లలు రోజుకి 2 నుంచి 3 గంటలు మాత్రమే ఫోన్ వాడాలి. 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలు రోజుకి 3 నుంచి 5 గంటలు స్మార్ట్ ఫోన్ వాడాలని, టీనేజర్స్ 5 నుంచి 6 గంటలు మాత్రమే వాడాలంటున్నారు పిడియాట్రిక్ డాక్టర్స్.

ఒక స్నేహితుడు సపియోన్ ల్యాబ్స్ నుంచి ఈ నివేదికను నాతో పంచుకున్నాడు. ఇది చిన్నప్పుడు స్మార్ట్‌ఫోన్లు (టాబ్లెట్లు కూడా) అతిగా వాడే వారు పెద్దయ్యాక మానసిక రుగ్మతలతో బాధపడుతారని తెలిపింది. ఈ అధ్యయనం ద్వారా వచ్చిన సమాచారం నిజంగా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్లకు బానిసలైన 10 ఏళ్లలోపు వారిలో 60-70 శాతం మంది బాలికలు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇక అబ్బాయిల్లో సుమారు 45-50 శాతం మంది తర్వాతి జీవితంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కాబట్టి పిల్లలు ఏడుస్తున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, కారులో ప్రయాణిస్తున్నప్పుడు అల్లరి చేస్తే బుజ్జగించడానికి స్మార్ట్ ఫోన్లను ఇచ్చే అలవాటును తల్లిదండ్రులు మానుకోవాలి. దీనికి బదులుగా వారితో ఎక్కువగా మాట్లాడుతూ, బయట ఆటలాడేలా ప్రోత్సహించాలి. పిల్లలను వారి అభిరుచులలో నిమగ్నం చేయడం మంచిది’ అని జైన్ చెప్పుకొచ్చారు.