అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న కూరశావు దేశంలో ఏర్పాటు చేసిన St.Martinus వైద్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని మంగళవారం నాడు గుర్‌గావ్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. St.Martinusలో వైద్య విద్యను పూర్తి చేసిన 30మందికి పైగా భారతీయ విద్యార్థినీ విద్యార్థులకు ఈ సందర్భంగా పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం వైద్య వృత్తిని నిబద్ధతతో నిజాయితీగా నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మారెంగో ఏషియా ఆసుపత్రి ట్రామా/ఆర్థో విభాగాధిపతి డా.హేమంత్ శర్మ, DAMS సంస్థ CEO డా. సమర్ సేఠీ, కూరశావు పార్లమెంట్ మాజీ సభ్యుడు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డా.యీవెస్ స్కూప్, బేసిక్ సైన్సెస్ విభాగాధిపతి డా.వింతా రవికిషోర్ రెడ్డి, St.Martinus CEO డెట్రాయిట్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు సజ్జా శ్రీనివాస్‌లు హజరయ్యారు.
* చిత్తశుద్ధి-సానుభూతి కీలకం: డా.హేమంత్ శర్మ
వైద్యులుగా పట్టాలు స్వీకరించిన వారు రోగుల పట్ల చిత్తశుద్ధి, సానుభూతితో వ్యవహరించాలని, తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోవల్సిన బాధ్యత వైద్యులపై కూడా ఉందని డా. హేమంత్ శర్మ అన్నారు. తప్పులను సరిదిద్దుకోవడానికి వెనుకడకుండా, ఓ జట్టుగా వైద్యవృత్తిలో రాణించాలని సూచించారు.
* వైద్య వృత్తి ఓ విశేషాధికారం: డా. సేఠీ
వైద్య వృత్తి ఓ విశేషాధికారమని, దానికి ఉత్సాహంతో కూడిన నమ్మకాన్ని జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని డా. సేఠీ పేర్కొన్నారు.
* మాతృభూమికి సేవ చేయండి: డా. స్కూప్
ప్రొఫెసర్ స్కూప్ మాట్లాడుతూ నిజాయితీగా, గౌరవంగా వైద్య వృత్తిలో కొనసాగలని పిలుపునిచ్చారు. మాతృభూమిలో స్వదేశీయులకు చేసే సేవ గొప్ప సంతృప్తిని ఇస్తుందని, లక్షన్నర జనాభా కలిగిన కూరశావులో వైద్యుడిగా పనిచేసిన తన అనుభవంతో ఈ మాట చెప్తున్నాని ఆయన అన్నారు. వైద్య విద్య పూర్తి అయ్యాక స్వదేశంలో సేవ చేయాలని కోరారు.
* 90% సఫలత: సజ్జా శ్రీనివాస్
St.Martinus CEO సజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు USMLE పరీక్షల్లో 90% సఫలత సాధించారని అన్నారు. తమ విద్యార్థులు UK, Canada వంటి దేశాల్లో మంచి వైద్య అవకాశాలను అందిపుచ్చుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలోని ఆసుపత్రుల్లో రోటేషన్ అవకాశాలతో పాటు వసతి తదితర ఏర్పాట్లను తమ యూనివర్శిటీలో చదివే విద్యార్థినీ విద్యార్థులకు తమ ఆధ్వర్యంలో అందిస్తున్నామని ఆయన అన్నారు. భారతీయ కళాశాలలతో పోలిస్తే తమ పాఠ్యాంశాల ప్రణాళిక, భవిష్యత్ మార్గనిర్దేశకత్వం, పరిశోధన అవకాశాలు వంటివి మరింత నాణ్యతతో కూడుకున్నవని ఆయన వెల్లడించారు. తమ యూనివర్శిటీలో భారత్, కెనడా, అమెరికా దేశాలకు చెందిన ఎందరో విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, రానున్న రోజుల్లో భారతదేశంలోని మరిన్ని ప్రాంతాల్లో తమ సంస్థకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా St.Martinus విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డా.గింజుపల్లి మురళీకి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
డా. వింతా రవికిషోర్ రెడ్డి పట్టభద్రులను పరిచయం చేశి వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థినీ తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో విందు భోజనం ఏర్పాటు చేశారు.
గుర్‌గావ్/ఢిల్లీ: ఘనంగా St.Martinus స్నాతకోత్సవం
Related tags :