Editorials

క్షీరసాగర మథనం.. అంతరార్థం….

క్షీరసాగర మథనం.. అంతరార్థం….

పురాణాల్లో క్షీరసాగర మథనం, గజేంద్రమోక్షంలాంటి ప్రతీకాత్మక గాథలు మానవ జీవన మూలాలు, లక్ష్యాలు ఏమిటో అవగాహన చేసుకునేందుకు, అటువైపు నడిచేందుకు బోధింపబడినవే. వీటిలో లోతైన ఆధ్యాత్మిక అంశాలతో పాటు సామాజిక ప్రేయస్సూ బోధింపబడింది.
తమ అసమర్థతలో జనించిన స్వార్థపరత్వం ‘ఆశ’గా మారడంతో, మరణంలేని జీవితాన్ని కోరుకున్న దేవదానవులు అమృతాన్ని సాధించాలనుకున్నారు. ఆశలో స్వార్థం ఉంటుంది. ఇరువర్గాలకూ దానిని సాధించే విధానమూ తెలియదు, సాధించగలిగిన సామర్థ్యమూ లేదు. దీంతో విష్ణువును ఆశ్రయించారు. విష్ణువుకది ‘ఆశయ’మైంది. ఆశయంలో తపన ఉంటుంది, సమష్టి భావన ఉంటుంది. విష్ణువు ఆశయ సాధనకు అవసరమైన పరిశ్రమ చేశాడు. దేవదానవుల బలాబలాలను గుర్తించి అర్హత ప్రాతిపదికగా బాధ్యతలను అప్పగించాడు. అమృత సాధనలో ఎదురయ్యే అవరోధాలను ఊహించాడు. వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలతో సన్నద్ధుడయ్యాడు. అవసరమైన వనరులు సమీకరించాడు. దానవుల ప్రతిభను గుర్తించి వారి సామర్థ్యాన్నీ ఉపయోగించుకున్నాడు.

తాను ముందుండి మిత్రులనూ శత్రువులనూ ఒక్క తాటిపై నడిపాడు. సాధనలో ఎదురైన ప్రతి అడ్డంకినీ తప్పించాడు. ఫలితం సాధించాడు. కానీ ఆ ఫలితాన్ని తాను ఆశించలేదు. దేవదానవులు ధైర్యసాహసాలతో ఉద్యమించారు. నారాయణుని ఆశ్రయించి విజయాన్ని సాధించారు. సముద్ర మథనంలో కల్పవృక్షం, కామధేనువు లాంటివి ఎన్నో వచ్చాయి. వాటన్నింటినీ ఇంద్రుడు తీసుకున్నాడు. అయినా ఆశ చావక.. లక్ష్మినీ ఆశించాడు. కానీ ఇంద్రునిలో వ్యగ్రత, చాంచల్యం, అసంతృప్తి ఉండడం కారణంగా లక్ష్మీదేవి అతనికి దక్కలేదు… నిరీహుడై, నిర్వికారుడైన విష్ణువును వరించింది ఆ తల్లి.

అమృత సాధనలో మరొక ముఖ్యభూమిక పోషించిన వాడు బలి చక్రవర్తి. అతనిలో వరస విజయాలతో పెరిగిన అహంకారం వల్ల విజ్ఞత కరవైంది. మరణం లేని జీవనాన్ని కోరుకోవడం వెనుక ఉండే అనర్థాలు, ప్రమాదాలు తెలిసినా శాశ్వతంగా జీవించాలనుకునే ఆశ, అతిగా పెరిగిన ఆత్మవిశ్వాసం విచక్షణను మింగేసింది. అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన తరుణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తానూ తన వారూ నష్టపోవడమే కాక, సాధించిన విజయమూ నిరర్ధకమయింది.

నిజానికి ఇంద్రుడు వైదిక పరిభాషలో సమున్నతమైన చైతన్య స్థితి కలిగిన వాడు. అతడే ఇంద్రియాలకు అధిపతి. ఆధిపత్యం ప్రత్యేకతను కోరుకుంటుంది. దానితో అహంకారం ఆవేశిస్తుంది. ఫలితంగా కామక్రోధాలు క్రమ్ముకుంటాయి. అవే అసురీ శక్తులు. ఆ అసురీశక్తుల విజృంభణతో ప్రజ్ఞ తేజోహీనమౌతుంది. మళ్లీ గురు ప్రబోధతో (బుద్ధి ప్రచోదనతో) నారాయణుని (నారము అనగా జ్ఞానము. జ్ఞానము నడకగా కలవాడు నారాయణుడు) శరణు వేడటంతో ఎరుక జాగృతమవుతుంది. అది దానవత్వాన్ని జయిస్తుంది.