Business

ఆయుష్మాన్ భారత్ ద్వారా దవాఖానాలలో వైద్యం నిరాకరిస్తే ఇలా కూడా చేయొచ్చు

ఆయుష్మాన్ భారత్ ద్వారా దవాఖానాలలో వైద్యం నిరాకరిస్తే ఇలా కూడా చేయొచ్చు

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యక చర్యలు తీసుకుంటోంది. ప్రజల చికిత్సకయ్యే ఖర్చును భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని పేద, నిరుపేద వర్గాల ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలన్న లక్ష్యంతో ఈ హెల్త్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఖరీదైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనలేని వారు ఈ పథకంలో చేరి అనూహ్య ఖర్చుల నుంచి రక్షణ పొందవచ్చు. అయితే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఉన్న వారికి కవరేజీ ఎంత లభిస్తుంది..? ఏయే ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చు.. ? ఒకవేళ ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తే ఏం చేయాలో మీకు తెలుసా.? ఈ వివరాలు తెలసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ప్రజలకు ఆర్థికపరమైన రక్షణను కల్పిస్తోంది. 2018 సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం లాంఛ్ చేసింది. దేశంలోని 50 కోట్ల మందికి పైగా ప్రజలను ఈ పథకం కిందకి తీసుకు రావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఆయుష్మాన్ భారత్ యోజన కింద దాదాపు రూ.5 లక్షల వరకు కవరేజీ లభిస్తోంది. ఈ పథకంలో చేరిన ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు విలువ చేసే వైద్యాన్ని లబ్ధిదారులు ఉచితంగా పొందే వీలుంది. మెడికల్ ఖర్చులు, డయాగ్నొస్టిక్ ఖర్చులు, హాస్పిటల్‌లో చేరే ముందు అయ్యే ఖర్చులను కూడా ఈ స్కీమ్ భరిస్తుంది. ఇ-కార్డ్‌తో క్యాష్‌లెస్ సేవలను కూడా ఆఫర్ చేస్తోంది..

కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రులు చేరాయి. ఈ స్కీమ్ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఈ ఆసుపత్రులు నడుచుకోవాల్సి ఉంటుంది. పథకం కింద పేర్కొన్న వైద్య సేవలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. అయితే, ఏ కారణం చేతనైనా వైద్యం నిరాకరిస్తే కార్డు హోల్డర్ సంబంధిత హాస్పిటల్‌పై ఫిర్యాదు చేయొచ్చు. ముందుగా.. వైద్యం తిరస్కరించడానికి ఆసుపత్రి చూపుతున్న ప్రధాన కారణమేంటో తెలుసుకోవాలి. సదరు ఆసుపత్రిలో సంబంధిత చికిత్సకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉండి నిరాకరిస్తే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.

హాస్పిటల్‌పై ఫిర్యాదు చేయడానికి లబ్ధిదారులు టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేయవచ్చు. ఆయుష్మాన్ భారత్ యోజన పథకానికి చెందిన నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ 14555కి కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వవచ్చు. వివిధ రాష్ట్రాలకు కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్లు ప్రత్యేకంగా కేటాయించారు. ఆయుష్మాన్ భారత్ యోజన పథకం విషయంలో ఆసుపత్రులపై అన్ని సందర్భాల్లోనూ ఫిర్యాదు చేయడానికి వీలులేదు. వైద్యం అందించడానికి సదరు ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు లేకపోతే కార్డ్ హోల్డర్ హాస్పిటల్‌పై ఫిర్యాదు చేయలేరు. ఈ కారణంతో ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తే ఫిర్యాదు చేయలేమన్న విషయాన్ని లబ్ధి దారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒకవేళ అన్ని సదుపాయాలు ఉండి కూడా వైద్యం చేయని హాస్పిటల్స్‌పై ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకుంటుంది.