Politics

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న జగన్-TNI నేటి తాజా వార్తలు

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న జగన్-TNI నేటి తాజా వార్తలు

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న జగన్

బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఆమె వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది.  తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా.. బ్రెయిన్‌ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు.చికిత్సకు రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పారు. బిడ్డకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో తండ్రి రాంబాబు తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ దృష్టికి తన బిడ్డ సమస్యను రాంబాబు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ద్వారా తీసుకువెళ్లారు.ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్‌ రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్‌ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ సోమవారం ఆ  కుటుంబానికి అందజేశారు.

* తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ… ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు అని తెలిపారు. తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువచేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానన్నారు.    విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయివుండాలని ఆయన ఆశించారు. గిడుగు వారి ఆశయ స్ఫూర్తిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తికి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశమే అని చెప్పుకొచ్చారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పాటుపడాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌పై ఖర్గే రాహుల్‌ తడబాటు

కాంగ్రెస్‌లో ఎవరి పెత్తనం వారిదేనని, ఏకాభిప్రాయం ఉండబోదని మరోసారి నిరూపితమైంది. ఇండియా కూటమి సమావేశాలకు బీఆర్‌ఎస్‌ హాజరుకాకపోవడంపై కాంగ్రె స్‌ నేత రాహుల్‌గాంధీ ఒక రకంగా, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే మరోరకంగా మా ట్లాడారు. ఆదివారం చేవెళ్లలో నిర్వహించిన సభలో ఖర్గే మాట్లాడుతూ.. ఇండియా కూట మి సమావేశాలకు బీఆర్‌ఎస్‌ కావాలనే హాజరుకావడం లేదని, బీజేపీకి దగ్గరగా ఉంటున్నదని అసత్య ఆరోపణలు చేశారు. ఇదే అంశం పై జూలై 2న ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రె స్‌ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ‘బెంగళూరులో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో బీఆర్‌ఎస్‌కు ఆహ్వానంపై చర్చ వచ్చింది. అప్పుడు కూటమి పార్టీలకు ఒకటే విషయం చెప్పాను. మీటింగ్‌కు బీఆర్‌ఎస్‌ వస్తే మేము రాబోమని, సమావేశంలో బీఆర్‌ఎస్‌తో కలిసి కూర్చునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన’ అని పేర్కొన్నారు.ఇలా ఒకే అంశంపై ఆ పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు నెల వ్యవధిలోనే తలోరకంగా మాట్లాడటం గమనార్హం. దీనిపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి ఓ సిద్ధాం తం, పాలసీ అంటూ ఉన్నదా? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పబ్బం కోసం బీఆర్‌ఎస్‌పై విమర్శలు, ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఇండియా కూటమిలో బీఆర్‌ఎస్‌ చేరకపోవడంపై పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ గతంలోనే స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం దేశ ప్రజలకు కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కాదని, ప్రత్యామ్నాయ రాజకీయ విధానమని ప్రకటించారు. అందుకే బీఆర్‌ఎస్‌ ఇటు ఇండియా, అటు ఎన్డీఏ కూటమికి దూరంగా ఉన్నదని స్పష్టంచేశారు. రాజకీయ పెత్తనం కోసం అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన ఇద్దరు కాంగ్రెస్‌ అగ్రనేతలు వాళ్ల పరువు వాళ్లే పోగొట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

*  తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: పవన్

తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. మాట్లాడే భాష… రాసే భాష ఒకటి కావాలని తపించి.. ఆ దిశగా వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపిన గిడుగు వెంకట రామమూర్తి (Gidugu Venkata Ramamurthy)ని తెలుగు జాతి ఎన్నడూ మరువకూడదని అన్నారు.  ఇవాళ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారికి సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల భాషలోకి తీసుకువచ్చి మన మాతృభాషకు జీవంపోశారని జనసేనాని ప్రశంసించారు.ఆంధ్ర ప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదనీ, కాబట్టి ప్రజలే తెలుగు భాషను కాపాడుకొనే బాధ్యతను స్వీకరించాలని సూచించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పని తీరును గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిదనీ, వారు విడుదల చేసే ప్రకటనల్లోనూ, విద్యా శాఖ నుంచి వచ్చే ప్రకటనల్లో ఎన్ని అక్షర దోషాలు ఉంటున్నాయో చూస్తేనే తెలుస్తోందని విమర్శించారు.అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేమనీ, వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడైన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి స్ఫూర్తిని తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు అందిపుచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.చిన్నారులు ఓనమాలు నేర్చుకొనే దశ నుంచే మాతృ భాషను దూరం చేసే విధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని జనసేనాని పేర్కొన్నారు. 

స్నాతకోత్సవంలో పాల్గొన్న అబ్దుల్ నజీర్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40 స్నాతకోత్సవాలు మంగళవారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రోఫిసర్ హేమచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీహెచ్‌డీ స్కాలర్స్‌కు డాక్టరేట్ పట్టాలు, బంగారు పథకాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందించారు. అలాగే.. ప్రముఖ రచయిత, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌కు గౌరవ డాక్టరేట్ ను  గవర్నర్ నజీర్‌ ప్రదానం చేశారు.

 బెంగుళూరు బ‌స్ డిపోలో ర‌జినీకాంత్

 సూప‌ర్‌స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) ఇవాళ బెంగుళూరులోని బీఎంటీసీ బ‌స్ డిపోను ఆక‌స్మికంగా విజిట్ చేశారు. బెంగుళూరు మెట్రోపాలిట‌న్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేష‌న్ డిపో నెంబ‌ర్ 4లో ఆయ‌న కాసేపు అక్క‌డి ఉద్యోగుల‌తో క‌లిసి మాట్లాడారు. సినీ ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు ర‌జినీకాంత్ బెంగుళూరులో బ‌స్ కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ర‌జినీ నటించిన జైల‌ర్ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. అన్ని భాష‌ల్లోనూ ఆ ఫిల్మ్ క్రేజ్‌ ఇంకా కొన‌సాగుతోంది. బాక్సాఫీసు వ‌ద్ద జైల‌ర్ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ర‌జినీ కొన్ని రోజుల క్రితం ఉత్త‌రాఖండ్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ప‌ర్య‌టించారు.

కాంగ్రెస్ లో తుమ్మల చేరిక

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేవంత్ తో కలిసి ఢిల్లీలో రాహుల్ సమక్షంలో పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారంటూ ఆయన అనుచరవర్గం కూడా కోడై కూస్తుంది.వాస్తవానికి పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. కానీ భంగపాటు తప్పలేదు. సీఎం కేసీఆర్ .. తుమ్మలను దూరం పెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన తన ప్రధాన అనుచరులతో సమావేశామయ్యారు. ఈ క్రమంలో తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే.. తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది.ఆ తరువాత కాషాయం పార్టీలోకి చేరే అవకాశముందని, బీజేపీ సీనియర్ నేతలతో సంప్రదింపు జరిపినట్టు కూడా ప్రచారం జోరుగా సాగింది. కానీ, తాజాగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలోనే రేవంత్ తో కలిసి ఢిల్లీలో రాహుల్ సమక్షంలో పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారంటూ ఆయన అనుచర వర్గం కూడా భావిస్తోంది.దీంతో తుమ్మల ఏ పార్టీలో అడుగుపెడుతారు? ఆయన రాజకీయ భవిష్యత్‌ ఏమిటనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందిన తుమ్మలను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ  తరుణంలో  భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి పెద్దలు కాంగ్రెస్‌లోకి వస్తే అందరం స్వాగతిస్తామని తెలిపారు. భద్రాచలం అభివ్రుద్ది కోసం  తుమ్మల ఎనలేని సేవచేశారని, ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తే.. పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని అన్నారు.తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీలోకి రావాలని తాను కోరుతున్నట్లు తెలిపారు.

 దొంగ ఓట్లపై చంద్రబాబు ఫిర్యాదు హాస్యాస్పదం

 ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. ఏకంగా ఢిల్లీ వరకు చేరింది.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అధికార, ప్రతిపక్ష నేతలు పోటీపోటీగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఫిర్యాదు చేశారు.. దొంగ ఓట్లు ఎలా చేర్చుతున్నారు.. విపక్షాల ఓట్లు ఎలా తొలగించారో ఆధారాలతో సహా ఈసీకి ఇచ్చామని చంద్రబాబు చెబితే.. అసలు చంద్రబాబు హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారు.. వాటితోనే ఆయన విజయం సాధించారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఉషాశ్రీ చరణ్‌.. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లను నమోదు చెయ్యించింది చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే అని ఆరోపించారు. దొంగ ఓట్లుపై చంద్రబాబు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు.ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో చంద్రబాబు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు ఉషాశ్రీ చరణ్‌.. రాబోవు ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే.. జగనన్న మళ్లీ సీఎం కాబోతున్నారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఉషాశ్రీ చరణ్‌. మరోవైపు మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు దొంగ ఓట్లతో విజయం సాధించారని ఆరోపించారు.. దొంగ ఓట్లను తొలగించాల్సిందే.. అర్హత ఉన్నవారి ఓట్లను కొనసాగించాల్సిందే అన్నారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడడం అంటే.. సమయం వృథా చేసుకోవడమే అని ఎద్దేవా చేశారు మంత్రి నాగార్జున. కాగా, ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర ఆరోపణలకు దారి తీసింది.. మీ హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారంటే.. మీ హయాంలోనే మాకు అనుకూలంగా ఓట్లను తొలగిస్తున్నారంటూ పరస్పర విమర్శలకు దిగుతున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు.

ఎన్టీఆర్ మనవడిగా గర్వపడుతున్నా

నంద‌మూరి తార‌క రామారావు (ఎన్టీఆర్) మనవడిగా గర్వపడుతున్నాన‌ని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయ‌కుడు  నారా లోకేష్ అన్నారు. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 28న న్యూఢిల్లీలో రూ.100 నాణేన్ని ఆవిష్కరించారు. దివంగత లెజెండ్ శతజయంతి సందర్భంగా ఆయనకు గౌరవంగా నాణేలు విడుద‌ల చేశారు. ఈ  కార్యక్రమానికి ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ నేప‌థ్యంలోనే స‌ర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ స్మారక నాణేన్ని ఆవిష్కరించడం తెలుగు జాతికి దక్కిన గొప్ప గౌరవం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. తాను తెలుగువాడిగా, తెలుగుదేశం వ్యక్తిగా, ఎన్టీఆర్ మనవడిగా గర్వపడుతున్నానని చెప్పారు. తెలుగుజాతిని ఏకతాటిపై నడిపించిన నాయకుడిగా, ప్రజాసేవకుడిగా, మహానేతగా ఎన్టీఆర్ ను కొనియాడారు. “కోట్లాది మంది హృదయాల్లో దేవుడిగా భావించే ఎన్టీఆర్ వారికి స్ఫూర్తి. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని లోకేష్ పేర్కొన్నారు.ఇదిలావుండ‌గా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగ‌ళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని పెంచినప్పటికీ కొన్ని సమాధానం లేని ప్రశ్నలను మిగిల్చింది. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటిస్తున్నప్పటికీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ పాదయాత్రలో పాల్గొనలేదు. ఇతర జిల్లాలకు భిన్నంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్ర కేవలం ఎనిమిది రోజుల్లోనే ముగిసింది. విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు. పాదయాత్ర పశ్చిమ కృష్ణా జిల్లాలోకి వెళ్లకపోయినా ఎ.కొండూరు కిడ్నీ వ్యాధి, చింతలపూడి ఎత్తిపోతల పథకం, తిరువూరు నియోజకవర్గంలోని సుబాబుల్, పిట్టలవారిగూడెం ప్రాజెక్టులకు మద్దతు ధర వంటి ఈ ప్రాంతంలోని కీలక అంశాలను లోకేష్ ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణీత గడువులోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

కవితకు జీవన్‌రెడ్డి కౌంటర్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Congress MLC Jeevan Reddy) విమర్శలు గుప్పించారు. జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘‘ఫాల్స్ హామీలు మావి కాదు.. మీవే. దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చింది మీరే. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరులో మేము ఓట్లు అడగం. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు (Double bedroom house) లేని ఊర్లో మీరు ఓట్లు అడగద్దు. మీ కేబినెట్‌లో కూర్పు ఎలా ఉంది కవిత?. దళితులకు మీరు ఒక్క ఇల్లు అయినా కట్టించారా?, వాస్తవాలు చెబితే వినే ఓపిక లేదా?, మీ వైఫల్యాలను ఎత్తిచూపుతే ఎందుకు భయం. బీఆర్ఎస్, కేసీఆరే (Cm kcr) అసలైన దళిత ద్రోహి. ఎన్నికల ముందు నీకు బీసీలు గుర్తొచ్చారా?.’’ అంటూ జీవన్‌రెడ్డి నిలదీశారు.