ScienceAndTech

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి57

నింగిలోకి దూసుకెళ్లిన  పీఎస్‌ఎల్‌వీ-సి57

చంద్రయాన్‌-3 విజయం అనంతరం సూర్యుడి దిశగా ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక శనివారం నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) తాజాగా ప్రయోగానికి వేదికైంది.

ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్‌1’ (లగ్రాంజ్‌) పాయింట్‌ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. వీటి వల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షంలోని ఆస్తులను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రయాణం ఇలా..

తొలుత ఆదిత్య-ఎల్‌1ను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌.. భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత దాన్ని మరింత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పంపుతారు. ఆదిత్య-ఎల్‌1లోని రాకెట్లను ఇందుకు ఉపయోగిస్తారు.

ఆ తర్వాత ఎల్‌1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్‌వోఐ)ను దాటి వెళుతుంది.

అనంతరం క్రూజ్‌ దశ ప్రారంభమవుతుంది. ఇలా నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఉపగ్రహం.. ఎల్‌1 బిందువును చేరుకుంటుంది.

ఆదిత్య-ఎల్‌1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. అందులోని ప్రధాన సాధనమైన విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ).. రోజుకు 1,440 చిత్రాలను పంపుతుంది. అంటే.. నిమిషానికి ఒక ఫొటో అన్నమాట! ఇది ఆదిత్య-ఎల్‌1లో సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన సాధనం. వీఈఎల్‌సీ బరువు 190 కిలోలు. అది ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఇంధన వినియోగ తీరునుబట్టి అది మరింత ఎక్కువకాలం పనిచేసే అవకాశం కూడా ఉంది.

మరో ఆరు పరికరాలు..

సోలార్‌ అల్ట్రావయలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌: ఇది సూర్యుడిలోని ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ ప్రాంతాలను అతి నీలలోహిత తరంగ దైర్ఘ్యంలో చిత్రీకరిస్తుంది. తద్వారా సౌర రేడియోధార్మికతను కొలుస్తుంది.

సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ (సొలెక్సెస్‌), హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ (హెచ్‌ఈఎల్‌1ఓఎస్‌): ఈ రెండు సాధనాలూ సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్‌రే జ్వాలలను అధ్యయనం చేస్తాయి.

ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ఆస్పెక్స్‌), ప్లాస్మా ఎనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య (పాపా): ఈ రెండు పరికరాలు సౌర గాలులు, ఆవేశిత అయాన్లు, వాటిలో శక్తి విస్తరణ తీరును శోధిస్తాయి.

మ్యాగ్నెటోమీటర్‌: ఎల్‌1 బిందువు వద్ద గ్రహాంతర అయస్కాంత క్షేత్రాలను పరిశీలిస్తుంది.