Politics

బీసీలకు సంచలన హామీ: చంద్రబాబు

బీసీలకు సంచలన హామీ: చంద్రబాబు

బీసీలపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డిది కపట ప్రేమ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో “బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..నాలుగు సంవత్సరాలల్లో 26 వేల మందిపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. రిజర్వేషన్లూ 24 శాతం తగ్గించి ద్రోహం చేశారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

మాట్లాడితే నా బీసీలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్‌.. ఆ వర్గాలకు చేసిందేమీ లేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. రిజర్వేషన్ల నుంచి అన్నింటిలోనూ వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. అక్రమ కేసులతో వారిని వేధించారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు.

తాము అధికారంలోకి వస్తే పాత పథకాలన్ని పునరుద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం వర్షాభావంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని, ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా సాయం చేసిందా అని ప్రశ్నించారు. పంట నష్ట పరిహారం, పంటల బీమా, రాయితీ సూక్ష్మ బిందు సేద్య పరికరాలు, బీసీలకు ఆదరణ పరికరాలు, దళితులకు సంబంధించిన పథకాలను అమలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.చదువు చెప్పే గురువుల స్థాయిని దిగజార్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. గురువుల కంటే గూగుల్‌ గొప్పదని చెప్పడం వారి అహంకారానికి నిదర్శనమని ఆక్షేపించారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో తమకు ఉద్యోగాలు లేవని యువత ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వస్తే.. జగన్‌ మాత్రం యువతను మత్తులో ముంచే కంపెనీలు తెచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.

నేను చదివిస్తా : తనకు అమ్మఒడి రాలేదని బహిరంగ సభలో చంద్రబాబు ఎదుట విజయ భార్గవ్‌ అనే బాలుడు వాపోయారు. తమ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వచ్చిందని వివరించారు. వెంటనే స్పందించిన చంద్రబాబు ఆ బాలుడిని చదివిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని విజయ భార్గవ్‌ చంద్రబాబుకు చెప్పారు. చికిత్స పొందడానికి 25 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని బాలుడికి హామీ ఇచ్చారు.

కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ అవినీతి పెరిగిపోయిందని చంద్రబాబు విమర్శించారు. కనగానపల్లి, కంబదూరు పరిధిలో సుజలాన్‌ కంపెనీకి కేటాయించిన 160 ఎకరాల భూములను కారు చౌకగా కొట్టేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే మంత్రి అక్రమంగా లాక్కున్న భూములను వెనక్కి తెచ్చి రైతులకు పంచుతానని హామీ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు ప్రసంగం ముగింపులో కళ్యాణదుర్గానికి అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ కార్యకర్తలు ఆయన్ని కోరారు. అందరితో మాట్లాడి, ఆలోచించి సరైన సమయంలో అభ్యర్థిని ప్రకటిస్తానని ఆయన తెలిపారు.