Politics

ఇండియా-భారత్ వివాదంపై స్పందించిన రాహుల్

ఇండియా-భారత్ వివాదంపై స్పందించిన రాహుల్

యూరప్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇండియా-భారత్ వివాదంపై స్పందించారు. బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి భయంతోనే ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆయన ఆరోపించారు. బెల్జియంలోని బ్రస్సెల్స్ లో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, భయపడుతోందని, ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహాలుగా రాహుల్ గాంధీ అన్నారు.జీ20 విందు ఆహ్వానంలో ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ బదులుగా ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’అని కనిపించడంతో కేంద్రం ఇండియా పేరును భారత్ గా మారుస్తుందనే ఊహాగానాలు వెల్లవెత్తాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అదానీ వ్యవహారం బయటకు రావడంతో దీనిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోడీ ఆడుతున్న నాటకం అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పేరు బీజేపీలో భయం నింపిందని అన్నారు.

రాజ్యాంగం ప్రకారం ఇండియా, రాష్ట్రాల యూనియన్ అని ఆయన అన్నారు. దేశభవిష్యత్తును మార్చే ప్రయత్నం జరుగుతోందని బీజేపీపై విరుచుకుపడ్డారు. అధికారం కేంద్రీకృతమై ఉండాలని, దేశ ప్రజల మధ్య సంబంధాలను అణిచివేయాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. ఇది మహత్మా గాంధీ, గాడ్సేల భావజాలానికి మధ్య వైరం అని రాహుల్ గాంధీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుందని, దీంట్లో ఇతరుల ప్రమేయం ఉండదని ఆయన అన్నారు.