Business

ఢిల్లీ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

ఢిల్లీ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

దేశ రాజధాని ఢిల్లీలో భారత్‌ అధ్యక్షతన జీ20 (G20 Summit) శిఖరాగ్ర సదస్సు జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి బయలుదేరే 200కుపైగా రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. పలు రెళ్లను రీషెడ్యూల్‌ చేసింది. రద్దు చేసిన రైళ్లలో ఢిల్లీ, పంజాబ్ మధ్య నడిచే సుమారు 21 రైళ్లు కూడా ఉన్నాయని ఉత్తర రైల్వే తెలిపింది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో దేశ రాజధానిలో జరుగనున్న జీ20 సమ్మిట్ కారణంగా 200కు పైగా రైళ్ల సర్వీసులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. అలాగే సెప్టెంబర్ 8న ఓఖా- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు పలు రైళ్లను ఢిల్లీ జంక్షన్ మీదుగా మళ్లించినట్లు తెలిపింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో అమృత్‌సర్ – సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢిల్లీ మీదుగా మళ్లించినట్లు వెల్లడించింది.కాగా, జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చే విదేశీ అతిథుల రాకపోకలను సజావుగా సాగించేందుకు పలు రైళ్ల రద్దు, కొన్నింటిని మళ్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు భారతీయ రైల్వే తెలిపింది. అలాగే ఈ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి వాపసు లభిస్తుందని తెలిపింది. ప్రయాణికుల హెల్ప్‌లైన్ నంబర్ 139 ద్వారా రైళ్ల రాకపోకలు, రద్దైన రైళ్ల గురించి తెలుసుకోవాలని, ఆ మేరకు తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని ఉత్తర రైల్వే సూచించింది.