Devotional

గణేష్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

గణేష్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్‌లో పీవోపీ వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని.. కృతిమంగా ఏర్పాటు చేసిన కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని కోర్టు ఆదేశించింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై గతేడాది జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులే అమల్లో ఉంటాయని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కాగా, హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంపై నిషేదం విధిస్తూ గతేడాది తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీంతో హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేదం ఎత్తివేయాలని ఆ విగ్రహా తయారీదారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర పీసీబీ నిబంధనలు కొట్టివేయాలని తయారీదారులు పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. నిమజ్జనాలపై పై ఆదేశాలను వ్యాఖ్యలు చేసింది. హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని.. గత ఏడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులే అమల్లో ఉంటాయని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. గతేడాది హైకోర్టు నిబంధనలు ఉల్లఘించి ట్యాంక్ బండ్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేశారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. ఆధారాలుతో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేస్తే చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది.