Business

భారత స్టాక్ మార్కెట్ పతనం…డాలరుకు ₹84.16-BusinessNews-May 09 2024

భారత స్టాక్ మార్కెట్ పతనం…డాలరుకు ₹84.16-BusinessNews-May 09 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్ల (Stock market) పతనం కొనసాగుతోంది. గురువారం సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. సార్వత్రిక ఎన్నికలు, మెప్పించని క్యూ4 ఫలితాలు వంటి మార్కెట్‌ సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌లో వెయ్యి పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 22 వేల స్థాయిని కోల్పోయింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.393 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 73,499.49 పాయింట్ల (క్రితం ముగింపు 73,466.39) వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,334.18 కనిష్ఠానికి చేరిన సూచీ.. చివరికి 1062.22 పాయింట్ల నష్టంతో 72,404.17 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345 పాయింట్లు కోల్పోయి 21,957 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర కాస్త పెరిగి 84.16 డాలర్లకు చేరింది.

* ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.21,384 కోట్లు ఆర్జించగా.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ లాభం మూడింతలు పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.21,384.15 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,093.84 కోట్లతో పోలిస్తే 18.18 శాతం వృద్ధి నమోదైంది. స్టాండలోన్‌ పద్ధతిలో నికర లాభం 16,694.51 కోట్ల నుంచి రూ.20,698.35 కోట్లకు పెరిగింది. పూర్తి ఆదాయం రూ.1.06 లక్షల కోట్ల నుంచి రూ.1.28 లక్షల కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.55,648.17 కోట్ల నుంచి రూ.67,084.67 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ తెలిపింది.

* భారత్‌లో అత్యధిక ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ ఒకటి. దీని 2024 అప్‌డేటెడ్ వెర్షన్‌ గురువారం విడుదలైంది. ఫీచర్ల విషయంలో కొన్ని మార్పులు చేశారు. డిజైన్‌ను మాత్రం పెద్దగా మార్చలేదు. స్విఫ్ట్‌లో కొత్తగా 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ జెడ్‌ సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను మారుతీ తీసుకొచ్చింది. 5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 5-స్పీడ్‌ ఏఎంటీ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు అనుసంధానించింది. 80 బీహెచ్‌పీ గరిష్ఠ శక్తితో పాటు 112 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. లీటర్‌కు 25.72 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. లోపలిభాగంలో ఫ్రాంక్స్‌, బ్రెజా, బాలెనో తరహాలో ప్రీమియం లుక్ వచ్చేలా క్యాబిన్‌ను తీర్చిదిద్దారు. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో కనెక్టివిటీతో 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అందిస్తోంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌లో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌, 360 డిగ్రీ కెమెరా, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్, వెనక భాగంలో ఏసీ వెంట్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. కొత్త స్విఫ్ట్‌ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను మారుతీ ప్రామాణికం చేసింది. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, రివర్స్‌ పార్కింగ్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ధరల శ్రేణి రూ.6.50 లక్షల నుంచి రూ.9.65 లక్షల వరకు ఉంది. మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యమవుతోంది. డిజైన్‌ పరంగా చూస్తే బంపర్‌ను మార్చారు. కొత్త గ్రిల్‌ను అమర్చారు. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో హెడ్‌ల్యాంప్‌లను ఇచ్చారు. వెనకభాగంలోనూ స్కిడ్‌ ప్లేట్‌తో కూడిన కొత్త బంపర్‌ను ఇచ్చారు. సి-ఆకారపు డీఆర్‌ఎల్‌లతో ప్రత్యేకమైన లైట్లను పొందుపర్చారు.

* బఠానీలను ఉచితంగా దిగుమతి చేసుకునే గడువును ప్రభుత్వం అక్టోబర్ 2024 వరకు పొడిగించింది. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతేడాది డిసెంబరులో ప్రభుత్వం బఠానీల దిగుమతిపై ఎలాంటి సుంకం విధించకూడదని నిర్ణయించింది. దాంతో కొన్ని నిబంధనలు తయారుచేసి మార్చి 2024 వరకు అవి అమలులో ఉంటాయని పేర్కొంది. తర్వాత వాటిని జూన్ వరకు పొడిగించారు. తాజాగా ఈ నిబంధనలు అక్టోబర్‌ వరకు అమలవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్‌ ప్రకారం.. బఠానీల ఇంపోర్ట్స్‌కు సంబంధించి కనీస దిగుమతి ధర (ఎంఐపీ) షరతులు వర్తించవు. ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్‌కు లోబడి ఎంతైనా దిగుమతి చేసుకోవచ్చు. ఎలాంటి సుంకం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 235.92 మిలియన్‌ డాలర్ల విలువైన బఠానీలను దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది.

* పసిడి ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అక్షయ తృతీయ వచ్చేస్తోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఈరోజు (మే 8) కూడా కాస్త దిగొచ్చాయి. క్రితం రోజున కాస్తంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో అక్షయ తృతీయ పర్వదినం వేళ బంగారం కొనాలనుకుంటున్నవారికి కాస్త ఉపశమనం కలిగించాయి. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదేనా విలువైన వస్తువులు కొంటే అక్షయం అవుతుందని భారతీయుల నమ్మకం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 తగ్గి రూ. 72,160 లకు దిగొచ్చింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z