* పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని, అధికారులు తీరు చూస్తే అర్థమవుతుందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆరోపించారు. విజయనగరంలో అధికారుల తీరును మీడియాకు వివరించారు. అధికారులు అడ్డంగా దొరికిపోయి పొంతనలేని సమాధానాలు ఇస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనెల 16న ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్ కౌశిక్, ఎంపీపీ మామిడి అప్పల నాయుడు ఆధ్వర్యలో పోస్టల్ బ్యాలెట్‌లను తరలించడంపై పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు కనీస సమాచారం ఇవ్వకుండా, వైకాపా నాయకుల ఆధ్వర్యంలో తరలించడంపై అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. జనరల్ ఏజెంట్, అభ్యర్థి కానప్పుడు వారి ఆధ్వర్యంలో బ్యాలెట్‌లను ఎలా తరలిస్తారని మండిపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత వైకాపా జనరల్ ఎజెంట్ అని అధికారులు ఉత్తరం పంపించారని తెలిపారు. అధికారుల తీరు చూస్తుంటే వైకాపాకి కొమ్ముకాస్తున్నట్టు ఉందని విమర్శించారు. ఆ రోజే ఈ విషయం మీడియా ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మార్వో, ఎమ్మెల్యేకి ఉన్న వ్యవహరాలు రోజూ మీడియాలో చూస్తున్నామన్నారు. అధికారుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.
* మైదానంలో ఆటగాళ్ల మధ్య ఏ చిన్న విషయం చోటుచేసుకున్నా.. కెమెరాలు రికార్డు చేస్తున్నాయి. ఈ విషయం లైవ్‌లో బయటకి వస్తుండటంతో ఆటగాళ్లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని ఎక్స్(ట్విటర్)లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు ఈ విషయం వివరించినా.. రికార్డ్ చేసి ప్రసారం చేసిందని రోహిత్ మండిపడ్డాడు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ఇవ్వాలని చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు.. అభిమానులు, క్రికెటర్ల మధ్య బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని పేర్కొన్నాడు. లఖ్‌నవూతో ఇటీవల జరిగిన మ్యాచ్ సందర్భంగా కెమెరామెన్‌కు ఈ విషయాన్ని తెలిపినట్లు రోహిత్ వెల్లడించాడు. మైదానంలో కోల్‌కతా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ జరిపిన సంభాషణ ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అందులో ముంబయి జట్టుతో తన రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ ‘‘భాయ్ నాదేముంది.. ఇదే చివరిది’’ అన్నట్లు వినిపించింది. దీంతో రోహిత్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి ఆ వీడియోను కేకేఆర్ సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటీవల లఖ్‌నవూతో ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆటగాడు ధవళ్ కులకర్ణితో మాట్లాడుతూ రోహిత్ కనిపించాడు. ఈ క్రమంలో కెమెరామెన్ వీడియో తీయడాన్ని గమనించాడు. ఇప్పటికే కోల్‌కతా కోచ్ అభిషేక్ నాయర్‌తో సంభాషణ వైరల్‌గా మారిన సంగతి గుర్తుకొచ్చి.. సదరు కెమెరామన్‌కు రోహిత్ ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘బ్రదర్ ప్లీజ్ ఆడియోను క్లోజ్ చేయి. ఇప్పటికే ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి’’ అని అన్నాడు.
* బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak), ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. వీరి ఆస్తులు బ్రిటన్ రాజు చార్లెస్ III కంటే ఎక్కువని తేలింది. రెండేళ్ల క్రితం సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న సునాక్ దంపతులు.. గతేడాది 275వ స్థానంలో నిలిచారు. తాజా జాబితాలో వీరు 245వ స్థానంలో నిలవగా.. కింగ్ చార్లెస్ (King Charles III) మాత్రం 258వ స్థానంలో ఉండటం గమనార్హం. బ్రిటన్‌లో నివసిస్తోన్న తొలి వెయ్యి మంది సంపన్నులు/కుటుంబాల సంపదను అంచనా వేస్తూ సండే టైమ్స్ తాజా జాబితా విడుదల చేసింది. ఇందులో కింగ్ చార్లెస్ సంపద గత ఏడాది కాలంలో 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. సునాక్ దంపతుల సంపద మాత్రం 529 మిలియన్ పౌండ్ల నుంచి 651 మిలియన్ పౌండ్లకు పెరిగింది. అయితే, రాజ కుటుంబ సంపదను కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని తాజా నివేదిక వెల్లడించింది. వారికి ఎన్నో ఎస్టేట్‌లు, ప్యాలెస్‌లు ఉన్నాయని.. వాటి విలువ కొన్ని బిలియన్ పౌండ్లుగా ఉంటుందని అంచనా.
* శ్రీశైలం మహా క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. విరామ సమయంలో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీశైలంలోని టోల్ గేట్ మలుపు వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దేవస్థానం సెక్యూరిటీ హోంగార్డులు ట్రాఫిక్ సమస్యను పట్టించుకోకపోవడంతో భక్తులే సమన్వయంతో స్వయంగా తమ వాహనాలను ముందుకు కదిలించారు. రద్దీ రోజుల్లో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దడంతో పాటు, సమస్యలు తలెత్తకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
* పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ (Pakistan) దిగుమతులపై భారత్ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ తెలిపారు. అందుకే ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ దేశ నేషనల్ అసెంబ్లీకి శనివారం ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘‘పుల్వామా ఘటన తర్వాత పాక్ (Pakistan) నుంచి వచ్చే దిగుమతులుపై 200 శాతం సుంకం విధించాలని భారత్ నిర్ణయించింది. కశ్మీర్ బస్సు సేవలను నిలిపివేసింది. సరిహద్దు వెంట వాణిజ్య కార్యకలాపాలను ఆపేసింది’’ అని ఇషాక్ పేర్కొన్నారు. భారత్ సహా పొరుగు దేశాలతో పాక్ ఎదుర్కొంటున్న సవాళ్లేంటని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరణ విషయంలో పాక్ (Pakistan) వ్యాపార వర్గాలు ఆతృతగా ఉన్నాయని మార్చిలో లండన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఇషాక్ అన్నారు. అనంతరం భారత్‌తో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రణాళికలేవీ లేవని ఆయన కార్యాలయం మరో ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
* తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు మాల్దీవులులో కొంత వరకు, కోమరిన్ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఈరోజు బలహీన పడిందని పేర్కొన్నారు.
* తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారమే మంత్రివర్గ భేటీ నిర్వహించాల్సి ఉండగా.. ఈసీ అనుమతి ఇవ్వలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఆదివారం మధ్యాహ్నం షరతులతో కూడిన అనుమతి లభించింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని.. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని ఈసీ పేర్కొంది. ఈ మేరకు సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
* రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. జంటుపల్లిలో పిడుగుపడి శ్రీనివాస్, లక్ష్మమ్మ మృతి చెందారు. బెన్నూరులో వెంకప్ప ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, జవహర్‌నగర్, సుచిత్ర, జీడీమెట్ల, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు నరసరావుపేట రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విచారణ కొనసాగగా.. ఇవాళ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అడిషినల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో సిట్ అధికారులు ముమ్మర విచారణ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అల్లర్లు జరిగిన సమయంలో వీడియోలను అధికారులు పరిశీలించారు. ఇదే సమయంలో కారంపూడి పోలీస్‌స్టేషన్‌లోనూ దర్యాప్తు చేశారు. దాడులు, ఘర్షణలకు సంబంధించిన కేసుల రికార్డులను పరిశీలించారు. స్థానిక సీఐ నుంచి సిట్ డీఎస్పీ రామ్మూర్తి వివరాలు సేకరించారు. మరోవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్న నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు మంత్రి అంబటి రాంబాబు రావడం చర్చనీయాంశమైంది. నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై ఫిర్యాదు చేసేందుకు అంబటి వచ్చినట్టు సమాచారం.
* తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని.. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలో శనివారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే.
* ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో పలుచోట్ల సిట్ బృందం విచారణ చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎస్వీయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు చంద్రగిరి మండలం కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లెలో సిట్ అధికారులు పలువురిని విచారించారు. కూచువారిపల్లెలో వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్‌మెన్ ఈశ్వర్, గ్రామస్థులను అధికారులు విచారించి పలు విషయాలపై ఆరా తీశారు.
* ఆర్సీబీ తరఫున 13 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు యశ్ దయాళ్. మరీ ముఖ్యంగా ప్లేఆఫ్స్‌కు కీలకమైన చెన్నైతో మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి డేంజరస్ బ్యాటర్ ధోనీని ఔట్ చేసి హీరోగా మారిపోయాడు. ఈ మ్యాచ్ అనంతరం సిరాజ్‌తో యశ్ మాట్లాడుతూ.. చివరి ఓవర్ వేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా స్కోరు బోర్డు వైపు చూడలేదని తెలిపాడు.
* ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధిస్తే సినిమాలకు దూరంగా ఉంటారా? అనే ప్రశ్నకు ఆమె అవుననే సమాధానమిచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
* భాజపా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలపై ఆమ్‌ఆద్మీపార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా భాజపా ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో బయలుదేరిన వేళ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z