Editorials

ఇజ్రాయెల్‌కు బాంబుల సరఫరా బంద్

ఇజ్రాయెల్‌కు బాంబుల సరఫరా బంద్

దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇందులో 2000 పౌండ్ల బరువైన 1800, 500 పౌండ్ల బరువైన 1700 బాంబులు ఉన్నాయి. భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే ఈ బాంబులను సరఫరా చేస్తే రఫాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా వీటి సరఫరాను ఆపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కూడా ధ్రువీకరించారు. తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేస్తామని.. అయితే రఫాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గత వారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దాదాపు 13 నుంచి 14 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకుంటున్నారు. ఈ నగరంపై దాడి చేస్తే భారీ మానవ సంక్షోభం తప్పదని అమెరికా భావిస్తోంది. ఈ విషయాన్ని అనేక సార్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. అయినా ఇజ్రాయెల్‌ ఖాతరు చేయడంలేదు. అమెరికా సహా ఎవరూ తమను ఆపలేరని నెతన్యాహు బహిరంగంగానే ప్రకటనలిస్తున్నారు. అమెరికా ఎంతగా నచ్చచెబుతున్నా… రఫాపై వెనక్కి తగ్గేదే లేదంటోంది ఇజ్రాయెల్‌. ఒక వేళ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. రఫాలోని హమాస్‌ను నాశనం చేస్తామంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా బాంబుల సరఫరా నిలిపివేయడం గమనార్హం. అయితే ఇది అంత పెద్ద విషయం కాదని, అమెరికాతో మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ఇజ్రాయెల్‌ చెబుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z