Business

రైల్వే రీఫండ్లు వేగవంతం-BusinessNews-May 10 2024

రైల్వే రీఫండ్లు వేగవంతం-BusinessNews-May 10 2024

* ఏదైనా కారణంతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన ట్రైన్‌ టికెట్‌ను క్యాన్సిల్‌ చేస్తే ఆ సొమ్ము వెనక్కి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒకవేళ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండీ చివరి నిమిషంలో ఇ-టికెట్‌ రద్దయిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి. సాధారణంగా రైల్వే టికెట్లు బుక్‌ చేసేవారికి తరచూ ఎదురయ్యే సమస్యే ఇది. దీని పరిష్కారానికి రైల్వే (Indian Railways) కొంతకాలం క్రితమే నడుం బిగించింది. తాజాగా ఆ రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసింది. క్యాన్సిల్‌ చేసుకుంటున్న ఇ- టికెట్లకు సంబంధించి దాదాపు 50 శాతం రిఫండ్లను కేవలం ఆరు గంటల్లోనే సెటిల్ చేస్తున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రద్దు చేసుకున్న ఇ-టికెట్లతో పాటు టీడీఆర్‌ ఫైలింగ్‌ విషయంలోనూ 98 శాతం క్లెయిమ్‌లను ఒకరోజులోనే పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రైల్వే టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నప్పుడు, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న సందర్భంలో క్యాన్సిల్‌ అయినప్పుడు రిఫండ్లకు కనీసం 3-4 రోజుల గడువు పడుతోంది. టికెట్‌ డిపాజిట్‌ రిసీట్‌ (TDR) విషయంలో మరింత ఎక్కువ సమయం పడుతోంది. మానవ సంబంధం లేకుండా అన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతున్న వేళ.. రిఫండ్ల జారీకి మాత్రం ఎందుకింత ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్న ప్రయాణికుల నుంచి ఉత్పన్నం అవుతోంది. దీంతో రిఫండ్ల జారీని రైల్వే వేగవంతం చేసింది. వేసవి రద్దీ నేపథ్యంలో రైల్వే తాజా నిర్ణయం ప్రయణికులకు ఊరట కల్పించేదే.

* అందినకాడికి ఏది దొరికితే అది అమ్ముకొని సొమ్ము చేసుకోవాలన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు దురాశకు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) బలిపశువులుగా మారాయి. గడిచిన పదేండ్ల మోదీ హయాంలో పీఎస్‌యూల్లోని వాటాల విక్రయంతో ఖజానాకు రూ.5 లక్షల కోట్లు సమకూరాయి. దీని కోసం చట్టంలోని నిబంధనల్ని ప్రభుత్వం ఏకపక్షంగా మార్చేసింది. ఏటికేడూ అంచనాలకు మించి లాభాలను గడిస్తున్న కంపెనీలు.. నష్టాల ఊబిలోకి కూరుకుపోయినట్టు కట్టుకథలు ప్రచారం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పీఎస్‌యూలు చెల్లిస్తున్న డివిడెండ్ల లెక్కలను విశ్లేషిస్తే ఈ విషయం అర్థమవుతున్నది. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడానికే కేంద్రం ఈ విధంగా చేసిందని హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు.

* మొబైల్‌ గేమ్స్‌ విషయంలో గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌దే హవా. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే ఈ రెండు స్టోర్లే దిక్కు. అతిపెద్ద గేమింగ్‌ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్‌.. మొబైల్‌ గేమింగ్‌ మార్కెట్‌లో మాత్రం వెనుకంజే. ఇప్పుడీ కంపెనీ సొంత మొబైల్‌ గేమింగ్‌ స్టోర్‌ను ప్రారంభించబోతోంది. ఎక్స్‌బాక్స్‌ మొబైల్‌ గేమింగ్‌ స్టోర్‌ ద్వారా గూగుల్‌, యాపిల్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. బ్లూమ్‌బెర్గ్‌ టెక్నాలజీ సమ్మిట్‌లో మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎక్స్‌బాక్స్‌ ప్రెసిడెంట్‌ సారా బాండ్‌ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని పంచకున్నారు. మైక్రోసాఫ్ట్‌కే చెందిన క్యాండీ క్రష్, మైన్‌ క్రాఫ్ట్‌ వంటి గేమింగ్‌ యాప్స్‌తో తొలుత వెబ్‌ ఆధారిత గేమింగ్‌ స్టోర్‌ను లాంచ్‌ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది జులైలో ఈ యాప్‌ స్టోర్‌ అందుబాటులోకి రానుందని చెప్పారు. తరవాత ఇతర పబ్లిషర్లకు చెందిన గేమ్స్‌ను కూడా వేదిక పైకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

* దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్‌, ఐటీసీ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. నిఫ్టీ 22 వేల స్థాయి ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 72,475.45 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,366.29- 72,946.54 మధ్య సూచీ కదలాడింది. చివరికి 260.30 పాయింట్ల లాభంతో 72,664.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 97.70 పాయింట్ల లాభతో 22,055 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 84.35 డాలర్లుగా కొనసాగుతోంది.

* బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కురిసిన వర్షం కారణంగా 17 విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించిన వివరాలను విమానయాన సంస్థల ద్వారా తెలుసుకోవాలని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. బెంగళూరులో గురువారం కురిసిన భారీ వర్షానికి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2(టీ2) వద్ద భారీగా నీరు చేరింది. టీ2 లగేజీ తీసుకునే ప్రాంతం సమీపంలో పైకప్పు నుంచి నీరు లీకవ్వడం గుర్తించారు. క్షణాల్లో వర్షం పెరగడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది. భారీ వర్షాల కారణంగా బెంగళూరుకు రావాల్సిన విమానాలను చెన్నైకి మళ్లించారు. మొత్తం 13 దేశీయ విమానాలు, మూడు అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలు, ఒక అంతర్జాతీయ కార్గో విమానాన్ని దారి మళ్లించారు. బలమైన గాలుల కారణంగా రాత్రి 9:35 నుంచి 10:30 గంటల వరకు విమానాల ల్యాండింగ్‌ వీలుకాలేదని ఎయిర్‌పోర్ట్‌ ప్రతినిధి ఒకరు మీడియాతో తెలిపారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించి విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z