Health

జపాన్‌లో భారీగా తగ్గిన జనాభా

జపాన్‌లో భారీగా తగ్గిన జనాభా

జపాన్‌(Japan)లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో 90 లక్షలకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిని ప్రతీ ఒక్కరికీ ఇచ్చుకొంటూ వెళితే న్యూయార్క్‌లో నగర జనాభాకు సరిపోతాయి. జపాన్‌లో జనాభా తరుగుదల సమస్యకు ఇది అద్దం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఆ దేశంలో ఇలా వదిలేసిన ఇళ్లను ‘అకియా’ అంటారు. పూర్వం గ్రామీణప్రాంతాల్లో దూరంగా ఉంచిన ఇళ్లను కూడా ఇలానే పిలిచేవారు. అక్కడి ప్రధాన పట్టణాలైన టోక్యో, క్యోటోల్లో కూడా చాలా ‘అకియా’లు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా మారింది. దీనిపై కాండా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జెఫ్రీ హాల్‌ మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ఇళ్లను నిర్మించడం వల్ల తలెత్తిన సమస్య కాదు ఇది.. తగ్గుతున్న జనాభా పరిస్థితికి నిదర్శనమన్నారు.

దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం.. అదే సమయంలో జననాలు పడిపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. కొన్ని గణాంకాల ప్రకారం జపాన్‌లో మొత్తం 14శాతం ఇళ్లు ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తులకు ఉన్న రెండో ఇల్లు, ఇటీవల ఖాళీ అయిన గృహాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో ప్రకృతి విపత్తులు వంటివి వచ్చిన వేళ ఇలాంటి ఖాళీ ఇళ్లు సహాయక చర్యలు చేపట్టేవారికి అడ్డంకిగా మారుతున్నాయి. ఇక అక్కడి ప్రజలు ఈ ఖాళీ ఇళ్లను తమ వారసులకు ఇస్తుంటారు. కానీ, ఆ దేశంలో జనాభా లేకపోవడం, ఉన్న యువతరం పట్టణాల్లో స్థిరపడటంతో వీటిని చూసేవారు లేరు. ఈనేపథ్యంలో రికార్డుల్లో లేని ఇళ్లను స్థానిక అధికారులు స్వాధీనం చేసుకొంటున్నారు. పాత ఇంటిని కూలగొట్టి కొత్తది నిర్మించుకొనే బదులు.. వాటిని అలాగే ఉంచేయడం చౌక అని ప్రజలు భావించడం కూడా వీటి సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. ఈ ఇళ్లు ఎక్కువగా ఉన్న కాలనీలకు బస్సులు, ఇతర రవాణా సదుపాయాలను రద్దు చేయడంతో కొనుగోలుదారులు కూడా వెనకాడుతున్నారు.

జపాన్‌లో ఇలా నిరుపయోగంగా ఉన్న ఇళ్లను విదేశీయులు కొనుగోలు చేస్తున్నారు. వాటిల్లో మార్పులు చేసి గెస్ట్‌హౌస్‌ల్లా తయారుచేస్తున్నారు. ఇలా చేసిన వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుండగా.. భారీ సంఖ్యలో ఫాలోవర్లు వస్తున్నారు. అయితే ఇలాంటివి కేవలం పరిమిత సంఖ్యలోనే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జపాన్‌ గ్రామీణ ప్రాంతాల్లో విదేశీయులు నివాసం ఉండటం చాలా క్లిష్టమైన పని అని పేర్కొంటున్నారు. వాస్తవానికి జనావాసం ఉండని ఈ ఇళ్లను కొనుగోలు చేయడం.. వాటిని తిరిగి విక్రయించడం దాదాపు అసాధ్యమని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సమస్య ఒక్క జపాన్‌కే పరిమితం కాదని.. అమెరికా, కొన్ని ఐరోపా దేశాల్లో కూడా ఇలాగే ఉందంటున్నారు. జపాన్‌లో 2023లో అంతకుముందు ఏడాది కన్నా జనాభా 8 లక్షలు తగ్గింది. గత ఎనిమిదేళ్లుగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ దేశంలో మొత్తం 12.5 కోట్ల మంది నివాసం ఉంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z