Movies

నాకు జ్వరమొచ్చింది. విచారణకు రాలేను-CrimeNews-May 27 2024

నాకు జ్వరమొచ్చింది. విచారణకు రాలేను-CrimeNews-May 27 2024

* తనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, విచారణకు హాజరుకాలేనని సినీ నటి హేమ (హెమ) బెంగళూరు పోలీసులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో తాను జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. విచారణకు హాజరుకావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోనట్లు తెలుస్తోంది. విచారణకు గైర్హాజరైన హేమకు కొత్తగా నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

* నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసులు సోమవారం 62 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్‌కు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయిని సీజ్‌ చేసి.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

* సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ల్యాబ్‌లో నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 4 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

* పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 17 మంది గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘాట్ రోడ్డు ఎక్కుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఆటో నుజ్జునుజ్జయింది. బాధితులంతా సీతంపేట సంత పూర్తి చేసుకొని తిరిగి ఇంటికివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన విషయం తెలుసుకున్న స్ధానికులు లోయలోకి దిగి క్షతగాత్రులను బయటకు తీసి, సీతంపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

* లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతదేహం గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో తెలియకుండా లోన్‌ యాప్‌లో రూ.10వేల రుణ తీసుకున్నాడు. అయితే యాప్‌ నిర్వాహకులు రూ.లక్ష కట్టాలంటూ వంశీని వేధించారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడిన విద్యార్థి.. ఈనెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తాను చనిపోతున్నానంటూ కుటుంసభ్యులకు మెసేజ్‌ పెట్టాడు. ఆ తర్వాత నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రెండు రోజులుగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తాడేపల్లిలో కృష్ణా నది వద్ద మొబైల్‌ ఫోన్‌, చెప్పులు, బైక్‌ కనిపించాయి. నదిలో గాలింపు చేపట్టగా వంశీ మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి పిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z