DailyDose

సంచలనంగా మారిన లెక్కల టీచర్ లైంగిక దాడి-CrimeNews-May 08 2024

సంచలనంగా మారిన లెక్కల టీచర్ లైంగిక దాడి-CrimeNews-May 08 2024

* ఆమె ఓ లెక్కల టీచర్‌.. బుద్ధిగా విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఆమె దారితప్పింది. తన వద్ద పాఠాలు నేర్చుకొంటున్న బాలురిపైనే కన్నేసింది. తనకంటే వయస్సులో చాలా చిన్నవాడైన ఒక విద్యార్థిని లొంగదీసుకొంది. లైంగిక వాంఛలు తీర్చుకొంది. అది వివాదాస్పదమై కోర్టుకు చేరింది. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె మరో బాలుడిపై కన్నేసి అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లింది.. వీరి బంధం ముదిరి ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు అది బయటపడటంతో సదరు టీచర్‌ వ్యవహారం యూకేలో సంచలనంగా మారింది. బ్రిటన్‌కు చెందిన రెబక్కా జాయ్‌నెస్‌ (30) వ్యవహారం సంచలనంగా మారింది. 2021లో ఓ బాలుడికి లెక్కల్లో అదనపు తరగతులు తీసుకొంది. ఆ సమయంలో 11 అంకెల ఫోన్‌ నెంబర్లో ఒక్కటి తప్ప మిగిలినవి చెప్పింది. తన మొబైల్‌ నెంబర్‌ కనుక్కోవాలని ఛాలెంజ్‌ చేసింది. ఆ తరవాత వారిద్దరి మధ్య సందేశాలతో మొదలైన బంధం బలపడింది. ఒక రోజు ఆ బాలుడిని షాపింగ్‌కు తీసుకెళ్లిన ఆమె.. 345 పౌండ్లు ఖరీదైన గూచీ బెల్ట్‌ కొనిచ్చింది. సీసీటీవీలో ఈ దృశ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని అతడు తన మిత్రుడికి చెప్పడంతో అది పోలీసులకు చేరింది. దీంతో జాయ్‌నెస్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. ఆ తర్వాత విచారణ సమయంలో జాయ్‌నెస్‌ మరో బాలుడికి దగ్గరైంది. స్నాప్‌ ఛాట్‌లో పరిచయమైన అతడికి తన ఫొటోలు పంపి మెల్లగా ముగ్గులోకి లాగింది. అతడితో కూడా కోర్కెలు తీర్చుకొని గర్భం దాల్చినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. మరోవైపు జాయ్‌నెస్‌ మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదని.. ఆ రెండో బాలుడికి 16 ఏళ్లు నిండిన తర్వాతనే సంబంధం పెట్టుకొన్నట్లు చెబుతోంది. బ్రిటన్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

* హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఏడు మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను తిరుపతిరావు (20), శంకర్‌ (22), రాజు (25), రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4), ఖుషిగా గుర్తించారు.

* హోం ఓటింగ్‌ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. 85 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం గ్రామంలో ఎన్నికల అధికారులు హోం ఓటింగ్‌ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పోలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైకాపాకి చెందిన వారు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో తెదేపాకు చెందిన కానాల పుల్లారెడ్డి, రావిపాటి నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను తొలుత సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఆయన సూచన మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

* ఓ కోచింగ్‌ సెంటర్‌లోని సీనియర్లు జూనియర్‌ విద్యార్థిని చిత్రహంసలకు గురి చేసిన ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత యువకుడు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి ఇటావా నుంచి కాన్పూర్‌కు వచ్చాడు. కోచింగ్‌ సెంటర్లో కొందరు సీనియర్లతో పరిచయం ఏర్పడింది. వారితో పాటు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లకు అలవాటు పడిన యువకుడు గేమ్‌ ఆడేందుకు సీనియర్ల నుంచి రూ.20వేలు అప్పుగా తీసుకొని బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. అనంతరం రూ.20 వేల అప్పుకు తమకు రూ.2లక్షలు ఇవ్వాలని సీనియర్లు అతడిని వేధించసాగారు. విద్యార్థి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గదిలోకి లాక్కెళ్లి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తూ వికృతంగా ప్రవర్తించారు. ఇదే విధంగా సీనియర్లు పలు మార్లు దాడి చేయడంతో విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపాడు. వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో కాన్పూర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను తనయ్ చౌరాసియా, అభిషేక్ కుమార్ వర్మ, యోగేష్ విశ్వకర్మ, సంజీవ్ కుమార్ యాదవ్, హరగోవింద్ తివారీ, శివ త్రిపాఠిలుగా గుర్తించారు. వీరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్ఎస్ గౌతమ్ తెలిపారు. వీరు ఓ ముఠాగా ఏర్పడి అమాయక విద్యార్థులను ట్రాప్‌ చేసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతుంటారని ప్రాథమిక విచారణలో వెల్లడయింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z