Politics

వైకాపా మేనిఫెస్టో విడుదల-NewsRoundup-Apr 27 2024

వైకాపా మేనిఫెస్టో విడుదల-NewsRoundup-Apr 27 2024

* సార్వత్రిక ఎన్నికల్లో శుక్రవారం పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు రిటర్నింగ్‌ అధికారులు రెండ్రోజుల సమయం తీసుకున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్‌ అధికారులు ఆమోదం తెలిపారు. మొత్తం 183 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి 47, శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి అత్యల్పంగా 16 దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 3,644 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటీలో 2,705 నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు పరిశీలన అనంతరం ఆమోదించారు. 939 నామినేషన్లు తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి 52 దాఖలైతే అత్యల్పంగా చోడవరం నియోజవర్గంలో 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏప్రిల్‌ 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటించనుంది.

* కూటమి ప్రభుత్వం రాగానే అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌ నవరత్నాలు.. నవమోసాలు అయ్యాయని దుయ్యబట్టారు. ‘‘గులకరాయితో హత్యాయత్నం చేశానని నాపై నింద వేశారు. కోడి కత్తి కేసులోనూ ఇలాంటి ఆరోపణలే చేశారు. బ్యాండేజ్‌ తీయకుండా డ్రామాలు చేద్దామని జగన్‌ అనుకున్నారు. అందరూ హేళన చేయడంతో ఇవాళ బ్యాండేజ్‌ తీసేశారు. గాయం కపడిందా?’’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

* లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) భాగంగా శుక్రవారం రెండోవిడత పోలింగ్‌ జరిగింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో పలు రంగాల ప్రముఖులతో పాటు సామాన్య పౌరులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekhar) ఓటు వేయకపోవడం విమర్శలకు దారితీసింది. రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేరళలోని తిరువనంతపురం (Thiruvananthapuram) స్థానం నుంచి భాజపా (BJP) అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, అతని ఓటు మాత్రం బెంగళూరులో ఉంది. ఈ రెండు స్థానాలకు ఏప్రిల్‌ 26నే పోలింగ్‌ జరిగింది. దీంతో తాను బరిలో ఉన్న స్థానంలో ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘‘ఎన్నికల వేళ తిరువనంతపురంలో ఉండటానికే నేను అధిక ప్రాధాన్యమిచ్చా. ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించబోతున్నాయని విశ్వసిస్తున్నా. అందుకే పోలింగ్‌ రోజున ఈప్రాంత ప్రజలకు ప్రతినిధిగా ఇక్కడ ఉండటం నా కర్తవ్యంగా భావించా. అయితే గత కొన్నేళ్లుగా బెంగళూరులో ఓటుహక్కు వినియోగించుకుంటున్న నేను ఈసారి ఓటు వేయకపోవడం బాధనిపించింది. దీనికి ఎంతగానో చింతిస్తున్నా. సరైన సమయంలో నా ఓటును ఇక్కడికి బదిలీ చేసుకోవడం సాధ్యపడలేదు. అందుకే, ఈసారి ఎన్నికల్లో ఓటు వేయలేకపోయా’’ అని రాజీవ్‌ వెల్లడించారు.

* తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌ వైకాపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి కేవలం రెండు పేజీలతో, 9 ముఖ్యాంశాలతో కూడిన మేనిఫెస్టోని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాం. ఏటా ప్రోగ్రెస్‌ రిపోర్టుతో ప్రజలకు వివరించాం. 58 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశాం. ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే చేరేలా చేశాం. ఇచ్చినమాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నా. చెప్పినవన్నీ అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా’ అని అన్నారు. అమ్మ ఒడి రూ.15వేల నుంచి రూ.17 వేలకు పెంపు; వైఎస్‌ఆర్‌ చేయూత కొనసాగింపు; వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కొనసాగింపు; మహిళలకు రూ.3లక్షల వరకూ సున్నా వడ్డీ; సామాజిక పింఛన్లను రెండు విడతల్లో రూ.3500 పెంపు; కల్యాణమస్తు, షాదీతోఫా కొనసాగింపు; అర్హులందరికీ ఇళ్ల పథకం కొనసాగింపు; రూ.2000 కోట్లతో పట్టణాల్లో ఎంఐజీ ఇళ్లు; రైతుభరోసా సొమ్ము రూ.13,500 నుంచి రూ.16వేలకు పెంపు; వైద్యం ఆరోగ్యశ్రీ విస్తరణ.

* అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్‌ పార్టీ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలు 50శాతానికి పైగా ఉన్నారని, జనగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ‘‘ఈ దేశ రాజకీయాలను, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అంశంపై విస్పష్టంగా మాట్లాడాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. అక్రమంగానో.. దౌర్జన్యంగానో.. 400 సీట్లు సాధించి రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలపైనే దాడి చేయాలని మోదీ, అమిత్‌ షా కంకణ బద్దులై ఉన్నారు. ఇందులో భాగంగానే దేశం నలుమూలలా తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థలు, సంస్థల్ని ఉపయోగించుకొని ముప్పేట దాడి చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత భాజపాపై .. కాంగ్రెస్‌ స్పష్టమైన ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రశ్నలకు ఇప్పటి వరకు నరేంద్రమోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా సమాధానం చెప్పలేదు. ప్రజాస్వామ్య విలువలు, విధానాలకు విరుద్ధంగా వారు వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాద విధానాన్ని అమలు చేయాలని వారిద్దరూ ప్రయత్నిస్తున్నారు. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువులు ఏకతాటి మీదకురారు అనేది భాజపా కుట్ర. రిజర్వేషన్లు రద్దు చేస్తే.. వేర్వేరు కులాలు, వర్గాల ప్రస్తావన లేకుండా పోతుందనేది ఆ పార్టీ ఆలోచన. వచ్చే ఏడాదికి ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించి వందేళ్లు అవుతుంది. 2025 నాటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అందుకే 400 సీట్లలో గెలిపించాలని మోదీ పదే పదే కోరుతున్నారు. భారత్‌ను రిజర్వేషన్‌ రహిత దేశంగా మార్చాలని మోదీ, అమిత్‌ షా భావిస్తున్నారు’’ అని రేవంత్‌ ఆరోపించారు.

* ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్‌.భాస్కర్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌ పాల్గొన్నారు.

* లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనను అరెస్ట్‌ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈడీని కేంద్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తుందనడానికి తనను అరెస్టు చేసిన సందర్భమే పెద్ద ఉదాహరణ అని అరోపించారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు సమాన పోరాట స్థాయి కల్పించాలన్నారు. కానీ తనను అరెస్టు చేసి ఆమ్‌ఆద్మీపార్టీకి ఎన్నికల వేళ తీరని నష్టం చేశారని తెలిపారు. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో అక్రమ పద్ధతిలో పైచేయి సాధించిందన్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయంటూ ట్వీట్‌ చేశారు మాజీ సీఎం కేసీఆర్‌. ‘‘నేను గంట క్రితం మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది. ప్రతి రోజు సీఎం, డిప్యూటీ సీఎం కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు’’ అంటూ కేసీఆర్‌ దుయ్యబట్టారు. ‘‘నాతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది?. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి’’ అంటూ కేసీఆర్‌ ఎక్స్(ట్విటర్) వేదికగా విజ్ఞప్తి చేశారు.

* మ‌ల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వ‌బోతున్నార‌ని ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మ‌ల్లారెడ్డి త‌న రాజ‌కీయం అనుభవంతోనే ఈట‌ల‌పై ఆ కామెంట్స్ చేశార‌ని పేర్కొన్నారు. మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి అని, ఈట‌ల రాజేంద‌ర్‌ను మున‌గ చెట్టు ఎక్కించి కింద ప‌డేయాల‌నేది ఆయన వ్యూహ‌మ‌ని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈటలపై చేసిన వ్యాఖ్యల విష‌యంలో మ‌ల్లారెడ్డి త‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని చాటుకున్నార‌ని తెలిపారు. మల్లారెడ్డి మాటల అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగ‌మ‌వుతున్నార‌ని, ఆయన వ్యాక్యాలు సీరియస్‌గా తీసుకోవద్దని తెలిపారు. మ‌ల్కాజ్‌గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. అది ఈటల రాజేందర్‌కు కూడా తెలుసన్నారు.

* మైలవరంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ముస్లింలపై దాడికి తెగబడ్డారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్ సతీమణి శిరీష ఎన్నికల ప్రచారంలో ఘటన జరిగింది. కొండపల్లి మున్సిపాల్టీలోని 20వ వార్డులో వసంత కృష్ణప్రసాద్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తుండగా, తమ వార్డులోకి కౌన్సిలర్ భర్త ఫణి రావడానికి వీల్లేదంటూ ముస్లింలు అడ్డుకున్నారు. ముస్లింలకు చెందిన షాదిఖానా స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తికి ఫణి అండగా నిలవడంతో.. అలాంటి వ్యక్తి తమ వార్డులోకి రావడానికి వీల్లేదంటూ ముస్లింలు తిరగబడ్డారు. ముస్లిం మహిళలను సైతం తోసుకుంటూ కౌన్సిలర్ భర్త రావి ఫణి ముందుకు చొచ్చుకుపోయారు. తోపులాటలో ముస్లిం మహిళలు కిందపడిపోయారు. మహిళలను కిందకు తోసేయడంతో ముస్లింలు తీవ్రంగా ప్రతిఘటించారు. వసంత కృష్ణప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో వసంత కృష్ణప్రసాద్ సతీమణి శిరీష అక్కడ నుంచి వెళ్లిపోయారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z