Business

టైటాన్ దెబ్బకు ₹800కోట్లు హాంఫట్-BusinessNews-May 07 2024

టైటాన్ దెబ్బకు ₹800కోట్లు హాంఫట్-BusinessNews-May 07 2024

* భారత మార్కెట్‌లో బిగ్‌బుల్‌గా పేరున్న దివంగత రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా(Rakesh Jhunjhunwala)ను సంపన్నుడిగా మార్చిన షేర్లలో టైటాన్‌ కూడా ఒకటని పరిశీలకులు చెబుతారు. అదే షేరు సోమవారం ఆ కుటుంబానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ కంపెనీ సోమవారం మార్చి త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చాయి. షేరు ఒక దశలో 7.87% నష్టపోయి రూ.3,257.05కు చేరింది. చివరకు 7.18% కోల్పోయి రూ.3,281.65 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.22,527.56 కోట్లు పతనమై రూ.2.91 లక్షల కోట్లకు చేరింది. ఈ కంపెనీలో రాకేశ్‌ సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలాకు దాదాపు 5.35 శాతం వాటాలున్నాయి. వీటి విలువ రూ.16,792 కోట్లు. తాజాగా విలువ పతనంతో వీటి విలువ రూ.15,986 కోట్లకు చేరింది. దీంతో వీరి కుటుంబం రూ.806 కోట్ల నష్టాన్ని మూటగట్టుకొన్నట్లైంది. 2002-2003లో రాకేశ్‌ ఒక్కో షేరును సగటున రూ.3 దగ్గర కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ షేరు విలువ ఎక్కడా తగ్గలేదు. కొన్ని వందల రెట్లు పెరిగింది. ఆయన మరణం వేళకు ఈ కంపెనీలో ఆయన కుటుంబ వాటా దాదాపు 5శాతం పైగానే ఉంది. చాలా ఇంటర్వ్యూల్లో కూడా టైటాన్‌ షేర్‌పై ఆయన తనకు ఉన్న ప్రేమను దాచుకొనేవారు కాదు. తనకు బాగా కలిసొచ్చిన స్టాక్‌గా దానిని అభివర్ణించేవారు. ఇక రాకేశ్‌ సతీమణి రేఖా ఈ ఏడాది మార్చిలో వార్తల్లో నిలిచారు. తమ బంగ్లా నుంచి సముద్రాన్ని వీక్షించేందుకు అడ్డం రావచ్చనే అనుమానంతో ఏకంగా తొమ్మిది ప్లాట్లను రూ.118 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఫలితంగా ఆ ఫ్లాట్ల పునర్నిర్మాణ ప్రక్రియను షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

* దేశంలో పవన విద్యుత్‌ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు భారత బిలియనర్‌ గౌతమ్‌ అదానీకి చెందిన పునరుత్పాదక ఇంధన విభాగం అదానీ గ్రీన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు శ్రీలంక కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. రెండు పార్టీల మధ్య 20 ఏళ్ల పాటు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం జరగనుంది. ఉత్తర శ్రీలంకలో ఉన్న రెండు ప్రాంతాల్లో 484 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్లాంట్ల అభివృద్ధికి 442 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి పునరుత్పాదక ఇంధన సంస్థ గతేడాది ఆమోదం పొందింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న శ్రీలంక 2022లో ఆర్థిక మాంద్యం మధ్య తీవ్రమైన విద్యుత్తు అంతరాయాలు, ఇంధన కొరతను ఎదుర్కొంది.

* Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నా.. సూచీలు గరిష్ఠ స్థాయిలకు చేరడంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. ఓ దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌.. తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ 22,300 స్థాయికి చేరింది.

* యూపీఐ లావాదేవీల విషయంలో ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం (Paytm) వాటా నానాటికీ తగ్గుతోంది. ఈ యాప్‌ వేదికగా చేసే యూపీఐ లావాదేవీలు వరుసగా మూడో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌ నెలకు గానూ ఎన్‌పీసీఐ (NPCI) విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పేటీఎం వేదికగా మార్చిలో 1230.04 మిలియన్‌ లావాదేవీలు జరగ్గా.. ఏప్రిల్‌ నెలకొచ్చేసరికి 9 శాతం క్షీణించి 1117.13 మిలియన్‌ లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం యూపీఐ లావాదేవీల్లో కంపెనీ వాటా సైతం 8.4 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఈ వాటా 10.8 శాతంగానూ, మార్చిలో 9.13 శాతం గానూ ఉంది.

* ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న ఆంద్రప్రదేశ్ ‘బ్లూ ఎకానమీ’ (ఓషన్ ఎకానమీ)లో కూడా ఓ కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కోస్తాంధ్రలోని ప్రతి 50 కిలోమీటర్లకు ఓడరేవు, ఫిష్ ల్యాండర్లు, ఫిషింగ్ హోరోబర్‌లలో ఏదో ఒకదాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీపై దృష్టి సారించింది. ఇప్పటికే వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం 4 కొత్త ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z