DailyDose

అనకాపల్లిలో ఘోర ప్రమాదం-CrimeNews-Apr 27 2024

అనకాపల్లిలో ఘోర ప్రమాదం-CrimeNews-Apr 27 2024

* లోన్‌ యాప్‌లో అప్పుతీసుకొని.. తిరిగి చెల్లించలేక, వారి వేధింపులు తట్టుకోలేక వినీత్‌ అనే బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటు చేసుకుంది. రూ.25 లక్షలు అప్పుతీసుకున్న వినీత్‌.. క్రికెట్‌ బెట్టింగ్‌లో నష్టపోయాడు. అప్పు చెల్లించాలని యాప్‌ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి తుని వైపు వెళ్తోన్న కారు వెదులపాలెం జంక్షన్‌ వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో నక్కపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను విశాఖ నగరంలోని గోపాలపట్నం వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్‌ హెర్బల్‌ పరిశ్రమలో మళ్లీ మంటలు వ్యాపించాయి. మరోసారి భారీ శబ్దాలతో రసాయన డ్రమ్ములు పేలాయి. దీంతో మంటలు చెలరేగాయి. రెండు అగ్నిమాపక యంత్రాలతో వాటిని ఆర్పుతున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాలకు సిబ్బంది ఎవరినీ అనుమతించడం లేదు. శుక్రవారం సాయంత్రం వెల్డింగ్ చేస్తుండగా ఈ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వరకూ ఈ మంటలను ఆర్పగా.. తాజాగా మళ్లీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

* మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్‌ హరీశ్‌, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. ఇడుమయ్య 2011లో మిలీషియా సభ్యుడిగా చేరి ఆ తర్వాత కమాండర్‌ అయ్యారు. ముత్యాలక్క దండకారణ్య ఆదివాసీ కిసాన్‌ మజ్జూర్‌ సంఘ్‌ సభ్యురాలిగా చేరి ఆ తర్వాత దీనికి అధ్యక్షురాలయ్యారు. మావోయిస్టు పార్టీని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వారు పోలీసులను సంప్రదించవచ్చని ఏఎస్పీ తెలిపారు.

* మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ భగాయత్ విలేజీలోని శాంతి నగర్‌లో వాణిజ్య భవనం నిర్మాణం కోసం ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)’ కోసం రూ.5 లక్షల లంచం అడిగిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ యాతా పవన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు గోపగాని రమణమూర్తి నుంచి తీసుకున్న రూ.4 లక్షల నగదును జప్తు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z