Politics

ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరతా

ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరతా

పంట రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవుతుందని, కాళేశ్వరంలో భారాస నేతలు దోచుకున్న రూ.లక్ష కోట్ల కన్నా, హైదరాబాద్‌ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో కాంగ్రెస్‌ మీడియా విభాగం ఛైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సోషల్‌ మీడియా వారియర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ ప్రసంగించారు. ‘‘ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, రాజీనామా చిట్టీ జేబులో పెట్టుకొమ్మని హరీశ్‌రావుకు చెప్పా. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు అమరవీరుల స్తూపం గుర్తుకొస్తుంది. గతంలో ఎప్పుడైనా అక్కడికి వెళ్లారా? ఈ రోజు స్తూపం వద్దకు వెళ్లి అబద్ధాలు చెప్పారు. రాజీనామా లేఖ స్పీకర్‌ ఫార్మాట్‌లో ఉండాలి. సీస పద్యంలా రాస్తే చెల్లుతుందా? హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరిస్తున్నాం. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతాం. మోదీ, కేసీఆర్‌లకు మూడోసారి పదవులు కావాలట. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్లోని ఐదు హామీలు అమలు చేసిన కాంగ్రెస్‌ దిగిపోవాలని అంటున్నారు. రాష్ట్రంలో కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. రేవంత్‌రెడ్డి దిగిపోతే చాలు.. ఎవరున్నా ఓకే అని భారాస నేతలు భావిస్తున్నారు. నన్ను చూస్తేనే ఒంటిపై జెర్రులు పాకినట్లుగా కేసీఆర్‌, కేటీఆర్‌ భావిస్తున్నారు. అందుకే ఎవరితోనైనా కలుస్తామంటున్నారు. ఈ ఎన్నికల్లో 12 సీట్లు గెలిస్తే ఏడాదిలో రాష్ట్రంలో భారాస ప్రభుత్వం వస్తుందని కేటీఆర్‌ అంటున్నారు. ఎలా వస్తుంది? తండ్రి పేరు చెప్పుకొని నేనేమైనా అమెరికా నుంచి వచ్చి కూర్చున్నానా? ఎన్నికల్లో భాజపా, భారాస కుట్రలను తిప్పికొట్టాలి. ఈ ఎన్నికల్లో భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి. అవి కొనసాగాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలి. ఈ విషయాన్ని ప్రజలకు పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలు వివరించాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z