Politics

విజయవాడ దుర్గమ్మను దర్శించకున్న చంద్రబాబు సతీమణి

విజయవాడ దుర్గమ్మను దర్శించకున్న చంద్రబాబు సతీమణి

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘నా భర్తను రక్షించాలని, ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని దుర్గమ్మను కోరా. చంద్రబాబు రాష్ట్ర ప్రజల బాగు కోసం పోరాటం చేస్తున్నారు. ఒక బిడ్డకు మనసు బాగాలేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తారు. అందుకే నా బాధ చెప్పుకోవడానికే అమ్మవారి దగ్గరకు వచ్చా. చంద్రబాబు పోరాటం ప్రజల స్వేచ్ఛ కోసం. చేయి చేయి కలిపి ప్రజలంతా ఏకమవ్వాలి’’ అని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

ఆమెతో పాటు కనకదుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అందరి ఆశీస్సులు మా కుటుంబానికి కావాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాత్రికి రాత్రే చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయం. చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం శ్రమిస్తున్నారు. ఏపీని వదిలేసి ముఖ్యమంత్రి విదేశాల్లో తిరుగుతున్నాడు. అది మన దౌర్భాగ్యం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలుపుదాం’’ అని అన్నారు.