Health

కేరళను వణికిస్తున్న నిఫా. కర్ణాటకలో అప్రమత్తత.

కేరళను వణికిస్తున్న నిఫా. కర్ణాటకలో అప్రమత్తత.

కేరళలో నిఫా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులు పోలీసులను కోరారు. రాష్ట్రంలోకి ప్రవేశించే గూడ్సు వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని సూచించారు. ముఖ్యంగా కేరళ నుంచి వచ్చే పండ్ల వాహనాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సుదర్శన్‌ మాట్లాడుతూ.. మంగళూరు పరిధిలోని 8 వైద్య కళాశాలల్లో పనిచేసే సిబ్బంది నిరంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. బ్రెయిన్‌ ఫీవర్‌ అనుమానిత కేసులపై దృష్టి సారించాలని చెప్పారు. జిల్లాలోని తాలుకా ఆస్పత్రులు, ప్రాథమిక ఆస్పత్రుల పరిధిలో ఫీవర్‌ సర్వే చేపట్టాల్సిందిగా వైద్యులను ఆదేశించామని ఆయన విలేకరులతో అన్నారు. వెన్‌లాక్‌ ఆస్పత్రితో సహా వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేశామని పేర్కొన్నారు. నిఫా, బ్రెయిన్‌ ఫీవర్‌ కేసులు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలను ఆదేశించామన్నారు. దక్షిణ కన్నడలో ఇంతవరకు నిఫా కేసులు వెలుగుచూడలేదు. కేరళలో ఈ ప్రమాదకర వైరస్‌ బారినపడి ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. వైరస్‌ కట్టడి చర్యలకు అధికారులు ఉపక్రమించారు.