DailyDose

స్వరనిధి ఎం ఎస్ సుబ్బలక్ష్మి 107వ జయంతి

స్వరనిధి ఎం ఎస్ సుబ్బలక్ష్మి 107వ జయంతి

సెప్టెంబర్ 16 – 2023.. స్వరనిధి ఎం ఎస్ సుబ్బలక్ష్మి — శాస్త్రీయ సంగీత రంగంలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన గాన విదుషీమణి ఎం ఎస్ సుబ్బలక్ష్మి. జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన ఈమె పూర్తి పేరు మధురై సుబ్రమణ్య అయ్యర్ సుబ్బలక్ష్మి. తమిళనాడు మధురై లో 1916లో ఈరోజే ఓ సంగీత వంశంలో జన్మించారు‌. ఈమె తల్లిగారు ప్రముఖ వీణా విద్వాంసురాలు. ఎం ఎస్ కర్ణాటక, హిందుస్తానీ సంగీతాన్ని క్షుణ్ణంగా అభ్యసించి 17వ ఏట మద్రాసు మ్యూజిక్ అకాడమీలో తొలి సంగీత కచేరి చేసి ప్రశంసలు అందుకున్నారు. ఈమె గానం చేసిన అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య పదాలు, విష్ణు సహస్రనామాలు, భజగోవిందం వంటి భక్తిగీతాలు ఈమెను సుమధుర గాయకురాలుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఇక శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం గురించి వేరే చెప్పనక్కరలేదు. రేడియో కార్యక్రమాలు ఈ సుప్రభాతం తోనే ప్రారంభం అయ్యేవి. ఒక్క తెలుగులోనే కాకుండా పలు భారతీయ భాషల్లో కూడా స్పష్టంగా పాడేవారు. దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న సంగీత విద్వాంసురాలు ఎం ఎస్ సుబ్బలక్ష్మి. నైటింగేల్ గా పేరొందిన సరోజినీ నాయుడు ఈమె మీరా భజనలు పాటలు విని .. అసలైన నైటింగేల్ సుబ్బలక్ష్మి గారేనని కితాబిచ్చారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజాజీ వంటి వారు ఈమె గానామృతానికి ప్రవేశించి పోయారు. అంతటి అసాధారణ ప్రజ్ఞాశాలి ఎం ఎస్ సుబ్బలక్ష్మి. ఈమె సంగీత ప్రతిభ గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ లతో పాటు అత్యంత ప్రతిష్టాత్మక భారత రత్న కూడా ప్రదానం చేసింది. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం రామన్ మెగాసెస్ అవార్డును ప్రదానం చేసింది. లండన్ లో ఎలిజబెత్ మహారాణి సమక్షంలో సంగీత కచేరి చేశారు. పలు దేశాల్లో పర్యటించి కచేరీలు చేసి ప్రశంసలందు కున్నారు. సంగీత కళానిధి, స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డు వంటి పురస్కారాలు అందుకున్నారు. ఇక సన్మానాలు సత్కారాలు అసంఖ్యాకం. భారత ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. భారతీయ సంగీతానికి విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టిన స్వర విదుషీమణి ఎం ఎస్ సుబ్బలక్ష్మి. రస హృదయాలను రంజింప జేసే దివ్య గాత్రం ఈమె సొంతం. ఈమె గొప్ప సహృదయరాలు కూడా. పలు ధార్మిక సంస్థలకు మూడు కోట్ల రూపాయలు విరాళంగా అందించిన దాత ఈమె. సంగీతానికి మారుపేరు ఎం ఎస్ సుబ్బలక్ష్మి అనేలా గొప్ప ఖ్యాతి పొందారు. ఈరోజు 107వ జయంతి సందర్భంగా స్వరసామ్రాజ్జి ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం.