ScienceAndTech

చిట్టి సూర్యుడిని కనుగొన్న నాసా

చిట్టి సూర్యుడిని కనుగొన్న నాసా

విశ్వంలో ఎన్నో నిగూఢ రహస్యాలున్నాయి. విశ్వం, గ్రహాల ఆవిర్భావం తదితర రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమిస్తున్నారు. వీరికి జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ ఎంతో సహాయం అందిస్తున్నది. ఇప్పటికే ఎన్నో ఖగోళానికి చెందిన ఎన్నో ఫొటోలను తీసి పంపిన ఈ భారీ టెలీస్కోప్‌ తాజాగా మరో అద్భుతమైన చిత్రాన్ని క్లిక్‌ మనిపించింది. భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి వంటి కొత్తగా నక్షత్రం ఏర్పడుతున్న చిత్రాన్ని తీసి భూమిపైకి పంపింది.

ఇది మన సూర్యుడు పుట్టిన సమయంలో ఎలా ఉండేదో తెలుపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంది. ప్రస్తుతం నక్షత్రం ఇప్పటికీ ఏర్పడే తొలి దశలోనే ఉందని.. కాంతి సూపర్‌సోనిక్‌ వేగంతో చీలిపోతున్న దృశాన్ని బంధించింది. దీంతో నక్షత్రాలు ఏర్పడే ప్రక్రియ తెలుసుకోవచ్చని.. అలాగే సూర్యుడి గురించి తెలుసుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఫొటోను ట్విట్టర్‌లో నాసా పోస్ట్‌ చేసింది. కొత్తగా ఏర్పడే నక్షత్రం చుట్టూ కనిపించే కాంతిని హెర్బీస్‌ హాలో అంటారని, ఈ నక్షత్రం భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తెలిపింది. ‘మన సూర్యుడు పుట్టిన సమయంలో చిత్రాన్ని తీయగలిగితే.. అది ఇలాగే ఉండేదని’ అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ పేర్కొంది. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తీసిన ఈ ఫొటోలో కొత్తగా జన్మించిన నక్షత్రం కనిపిస్తుండగా.. దాని నుంచి పోల్‌ గ్యాస్‌ సూపర్‌ సోనిక్‌ వేగంతో దూరంగా విసిరివేస్తున్నట్లుగా ఉన్నది. ఈ నక్షత్రానికి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుందని.. కాలం గడిచే కొద్ది సూర్యుడిలా మారుతుందని పేర్కొంది.

నక్షత్రం నుంచి రెండువైపులా దూసుకెళ్లిన గ్యాస్‌ చుట్టూ ఉండే వాయువులు, ధూళితో ఢీకొని హెర్బీస్‌ హాలోగా ఏర్పడుతుందని నాసా పేర్కొంది. ఈ నక్షత్రం బరువు మన సూర్యుడి బరువులో ఎనిమిది శాతం మాత్రమే ఉంటుందని.. క్రమక్రమంగా సూర్యుడి ఆకృతిలోకి మారుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. నాసా 2021 సంవత్సరంలో జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ను నింగిలోకి పంపింది. 2022లో ఈ టెలిస్కోప్‌ తన పనిని మొదలుపెట్టింది. ఇప్పటికే ఎన్నో గెలాక్సీలకు సంబంధించిన చిత్రాలను తీసి భూమిపైకి పంపింది.