NRI-NRT

అమెరికా-ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల్లో చంద్రబాబుకు మద్దతుగా సమావేశాలు

అమెరికా-ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల్లో చంద్రబాబుకు మద్దతుగా సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లోని ప్రవాసీయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 78 లారెన్స్‌ స్ట్రీట్‌, హాఫ్‌వే హౌస్‌, మిడ్రాండ్‌లలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం దక్షిణాఫ్రికా సభ్యులతో పాటు పలువురు పార్టీ సానుభూతిపరులు నిరసనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వచ్చేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసీయులు ఆశాభావం వ్యక్తం చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆదివారం ఆస్ట్రేలియాలోని ప్రెసిడెంట్ పార్కు, వింధంవేల్‌ మెల్‌బోర్న్‌లో తెదేపా భారీ ర్యాలీ నిర్వహించింది. చంద్రబాబును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని నినదిస్తూ సుమారు 400 మంది అభిమానులు, కార్యకర్తలు ధర్నా చేశారు. తొలుత దాదాపు 400 కార్లతో.. తెలుగుదేశం, జనసేన జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడారు. అక్రమ అరెస్టులను ఏమాత్రం సహించేది లేదని చెప్పారు. ఈ అరెస్టుల వెనుక ఉన్న వ్యక్తులకు ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. ఈ ధర్నాలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు కలిసి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్ల ర్యాలీ అనంతరం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో తెదేపా నాయకులు ఆలపాటి రాజా, జీవీ ఆంజనేయులు, నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇలాగే పోరాటాలను ఉద్ధృతం చేసి రాబోయే ఎన్నికల్లో తెదేపాను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో ప్రవాస తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు. జగన్ సర్కార్ కక్షపూరిత విధానాలపై మండిపడ్డారు. “జై బాబు” నినాదాలతో కార్యక్రమం ముగించారు.