DailyDose

తెలంగాణాకు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన సోనియా-తాజావార్తలు

ఆసియా కప్‌ గెలిచిన టీమ్‌ ఇండియా

* చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సభలో మాట్లాడిన సోనియాగాంధీ.. తెలంగాణ ప్రజలకు ఆరు వాగ్దానాలను ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500. పేద మహిళలకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రైతు భరోసా కింద ఏటా రైతుకు రూ.15 వేలు. కౌలు రైతులకు ఇది వర్తింపు. భూమి లేని నిరుపేదలు, కూలీలకు ఏటా రూ.12 వేలు. వరి పండించే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌.

* ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం (Parliament Special Session) కానుంది. ఇందులో భాగంగా పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్‌లో ఆదివారం సాయంత్రం అఖిలపక్షం భేటీ (All Party Meet) జరిగింది. ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులపై అన్ని పార్టీలకు ప్రభుత్వం తెలియజేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరనుంది. మరోవైపు సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రాంతీయ పార్టీలు డిమాండు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లులను ప్రవేశపెట్టి, వాటికి ఆమోదం తెలపాలని బిజు జనతాదళ్‌ (BJD), భారత్‌ రాష్ట్ర సమితి (BRS) పట్టుబడుతున్నాయి. అఖిలపక్ష సమావేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక ఘర్షణలతోపాటు మణిపుర్‌లో పరిస్థితి వంటి అంశాలను లేవనెత్తుతామని కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ పేర్కొన్నారు. అఖిలపక్ష భేటీ ప్రారంభానికి ముందు పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని వెల్లడించారు.

* కర్ణాటకలో (Karnataka) మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను (deputy chief ministers) నియమించాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. ఆ అంశంపై నిర్ణయం హై కమాండ్‌పైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. హై కమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. మంత్రి రాజన్న శనివారం మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘మంత్రి రాజన్న ఆయన మనసులోని మాట చెప్పారు. ఏదేమైనా దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది హై కమాండ్‌ మాత్రమే. ఒక ఉప ముఖ్యమంత్రి సరిపోతారని హై కమాండ్‌ భావించింది కాబట్టే ఒకరిని నియమించింది. మరో మగ్గురిని నియమించే అంశం పరిశీలించాలని హై కమాండ్‌తో మాట్లాడతానని రాజన్న అంటున్నారు. ఆయనను మాట్లాడనివ్వండి’ అని చెప్పారు.

* ఖైరతాబాద్ గణేశుడి వద్ద సందడి మొదలైంది. చవితికి ఒక రోజు ముందే ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది శ్రీదశ మహా విద్యాగణపతిగా భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు. 11 రోజులపాటు ఘనంగా జరిగే ఉత్సవాల్లో సోమవారం ఉదయం 9.30 గంటలకు తొలిపూజ ప్రారంభం కానుంది. 11 గంటలకు ఖైరతాబాద్ గణేశుడిని గవర్నర్ తమిళిసై దర్శించుకోనున్నారు. మరోవైపు, గణేశుడి పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

* రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu)తో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) ములాఖత్‌ అవుతారనే వార్తలు ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై రజనీకాంత్‌ తాజాగా స్పందించారు. చంద్రబాబును తాను కలవాలనుకున్నానని, ఫ్యామిలీ ఫంక్షన్‌ వల్ల వెళ్లలేకపోయానని తెలిపారు. కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్‌ చెన్నై నుంచి కోయంబత్తూరు బయలు దేరారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయం చేరుకోగానే.. చంద్రబాబుతో ములాఖత్‌ గురించి మీడియా ప్రశ్నించగా రజనీకాంత్‌ సమాధానమిచ్చారు.

* దేశ ప్రజలంతా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో పార్టీ విజయాలే దీనికి స్పష్టమైన రుజువని అన్నారు. హైదరాబాద్‌ వేదికగా సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్లమెంటు సభ్యులు, ముఖ్య నేతలతో జరుగుతున్న సమావేశాన్ని (Extended CWC meeting) ఉద్దేశించి ఖర్గే ఆదివారం ప్రసంగించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, విభేదాలను పక్కన పెట్టి.. పార్టీ విజయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా సంస్థాగత ఐక్యత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ ద్వారా మాత్రమే ఎదుటి పార్టీలను ఓడించగలమని స్పష్టం చేశారు.

* టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ తనను నమ్మిన అభిమానులని మోసం చేశారని మండిపడ్డారు మంత్రి ఆర్‌కే రోజా. జైలులో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్న వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అంటూ ధ్వజమెత్తారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి పవన్‌ అని విమర్శించారు మంత్రి రోజా. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పవన్‌.. సీఎం జగన్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సోనియానే ఢీకొన్న దమ్మున్న నాయకుడు సీఎం జగన్‌ అని మరోసారి గుర్తుచేశారు రోజా.

* ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ విస్త‌ర‌ణ ప్రారంభోత్స‌వానికి ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించలేద‌ని ఆప్ (AAP) వెల్లడించింది. ఈ వ్య‌వ‌హారంలో కేంద్రం తీరుపై ఆప్ ఘాటుగా రియాక్ట‌యింది. ఎయిర్‌పోర్ట్ లైన్‌ను రెండు కిలోమీట‌ర్ల మేర విస్త‌రించారు. ఢిల్లీ మెట్రో ఎయిర్‌పోర్ట్ లైన్ విస్త‌ర‌ణ‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. నూత‌న స్టేష‌న్ శిలాఫ‌ల‌కాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు.

* తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తామ‌ని కాంగ్రెస్ నాయ‌కులు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణ ప్రజలు విశ్వసించర‌ని ఓ ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం చేసింద‌ని తెలిపారు. ఉమ్మ‌డి పాల‌న‌లో సాగునీటి ప్రాజెక్ట్ ల‌ను నిర్ల‌క్ష్యం చేసి తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏనాడో తిర‌స్కరించార‌ని, మ‌ళ్లీ ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతార‌ని నిల‌దీశారు.

* తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest)ను గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Rajasingh) ఖండించారు. చంద్రబాబు అరెస్టు తప్పుడు విధానంలో జరిగిందని ఆరోపించారు. ‘‘చంద్రబాబును చూసి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ భయపడుతున్నారు. కేసుతో సంబంధం లేకపోయినా అరెస్టు చేశారు. చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే ఆయన అంతగా ఎదుగుతారు’’ అని అన్నారు.

* కేంద్రమంత్రి అమిత్‌షాతో భాజపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ మరోసారి భేటీ అయ్యారు. శనివారం రాత్రి అమిత్‌షాతో సంజయ్‌ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఆదివారం భాజపా ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం కావాల్సినప్పటికీ భేటీ జరగలేదు. ఇంతలో మధ్యాహ్నం మళ్లీ బండి సంజయ్‌తోనే ఆయన సమావేశం కావడంపై భాజపా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నిరాధారమైందని సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు నూరుశాతం విజయవంతమైందని.. దీనిలో ఏమాత్రం అవినీతి జరగలేదని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తదితర పరిణామాల నేపథ్యంలో దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

* దేశంలో తృతీయ ఫ్రంట్‌కు బలమైన అవకాశాలున్నాయని ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దానికి నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మీటింగ్‌పై ఆయన్ను ఓ ఆంగ్ల ఛానల్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు

* సీడబ్ల్యూసీ(CWC) సమావేశాల ముగింపు వేళ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) కీలక విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో చరిత్ర సృష్టించేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరింది. 2014లో తెలంగాణ ఆవిర్భావంతో తెలంగాణ(Telangana) ప్రజల పోరాటం ఫలించిందని తెలిపింది.

* ఇటలీ (Italy)లో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ట్యూరిన్‌ (Turin)లో మిలిటరీ శిక్షణా విన్యాసాల్లో పాల్గొన్న ఓ యుద్ధవిమానం (Fighter Jet) ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ క్రమంలోనే రోడ్డుపై దూసుకెళ్లిన ఆ జెట్‌.. అక్కడున్న ఓ కారుని ఢీకొనడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఐదేళ్ల బాలిక మృతి చెందింది.