Politics

చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై తీర్పు రిజర్వ్-తాజావార్తలు

చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై తీర్పు రిజర్వ్-తాజావార్తలు

* ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం మధ్యాహ్నం 12గంటల నుంచి దాదాపు ఐదు గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఐదుగురు న్యాయవాదులు ఈ కేసులో వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పలు కీలక అంశాలను న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ, అసలు ఈ కేసులో అవకతవకలు జరిగాయా? లేదా? డబ్బులు పోయాయని ఒకవైపు సీఐడీ ఆరోపిస్తున్నప్పటికీ.. అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఆధారాలు చూకపపోవడం, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఇప్పటికీ తెరిచే ఉండటం, వాటిలో యువతకు శిక్షణ సైతం కొనసాగుతున్న పరిస్థితులను కోర్టుకు వివరించింది. ఎన్నికల వేళ కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఫిర్యాదే ఓ అభూత కల్పన అని, ఎఫ్‌ఐఆర్‌ చట్టవిరుద్ధంగా ఉందంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ్‌ లూథ్రా హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. మరోవైపు, అటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ప్రధానంగా షెల్‌ కంపెనీల ద్వారా నగదు వెళ్లిందని.. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉందని బెంచ్‌ ముందు వాదనలు వినిపించారు. ఈ దశలో కోర్టులు కలుగజేసుకోరాదన్నారు. కార్పొరేషన్‌ సంబంధించి న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయాలని.. వాళ్లను సైతం చేర్చుకొనేందుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అన్ని వాదనలు ఈరోజు వినిపించాలని ఒక దశలో బెంచ్‌ అనడంతో కౌంటర్‌ వాదనలు ఈరోజే వినిపించడంతో ఇరువైపుల వాదనలు ముగిశాయి. దీంతో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

* రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధాలను తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. సైకో రెడ్డి పాలనలో దేవుడిని చూసే భాగ్యం కూడా లేదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డీ.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేవని గుర్తుంచుకో అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన చంద్రబాబుపై జగన్‌ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వారు ఏం తప్పు చేశారని గృహ నిర్బంధాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు నిలదీశారు.

* జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు మధ్య ఏడురోజులుగా జరుగుతోన్న ఎన్‌కౌంటర్ కొలిక్కి వచ్చింది. లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్‌ ఖాన్‌(Lashkar commander Uzair Khan)ను హతమార్చడంతో ఈ ఎన్‌కౌంటర్‌ ముగిసింది. అతడిని మట్టుపెట్టిన విషయాన్ని ఏడీజీపీ పోలీస్ విజయ్‌ కుమార్ ధ్రువీకరించారు. (Anantnag encounter) కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది రెండు మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

* దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను అధికారులు, పాలక మండలి సభ్యులు సమీక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇతర దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తామని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. అంతేకాకుండా ఉత్సవాలు జరిగే 10 రోజల్లో విధులు నిర్వర్తించేందుకు ఒప్పంద ప్రాతిపదికన మరికొంత మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. అన్నదాన భవనాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.

* లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును (women reservation bill) కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న బిల్లుకు.. విపక్షపార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తుండటంతో చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉభయసభల ఆమోదం పొందినప్పటికీ.. 2027 తర్వాతే ఇవి అమల్లోకి వస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

* చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు (Women’s Reservation Bill)కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ఈ బిల్లు ఎంపీలకు అగ్నిపరీక్షే’ అని మోదీ అభివర్ణించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు పూర్తయిన తర్వాత 2027 నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

* పాకిస్థాన్‌ (Pakistan) ఐఎంఎఫ్‌ ప్యాకేజీ పొందేందుకు ఏకంగా ఉక్రెయిన్‌ (Ukraine)కు ఆయుధాలను సరఫరా చేస్తోందనే నివేదికలు వెలువడుతున్నాయి. అయితే.. ఈ నివేదికలను పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయం తోసిపుచ్చింది. ఈ మేరకు కార్యాలయ ప్రతినిధి ముంతాజ్‌ జారా బలోచ్‌ మాట్లాడుతూ.. అటువంటి ఆరోపణలు పూర్తిగా ఆధార రహితమని, అభూత కల్పనలని ఖండించారు. ‘ఇంటర్‌సెప్ట్‌’ అనే ఇన్వెస్టిగేటివ్‌ వెబ్‌సైట్‌ ఆదివారం ఓ నివేదికను ప్రచురించింది. దీనిలో అమెరికా సాయంతో ఐఎంఎఫ్‌ బెయిలౌట్‌ ప్యాకేజీ పొందేందుకు పాకిస్థాన్‌ రహస్యంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు విక్రయిస్తోందని పేర్కొంది.

* భారత్‌ విషయంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన ప్రకటన.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది! భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం.. ఇటు భారత్‌ సైతం దీటుగా స్పందిస్తూ ఆ దేశ (Canada) రాయబారిపై వేటు వేయడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ తాజా పరిణామాలు ఇరు దేశాల పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలతో పాటు విద్యపై ఎలాంటి ప్రభావం చూపవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు అనేవి వాణిజ్య అంశాలపై ఆధారపడి ఉంటాయని.. అందుకే వాటిపై (Diplomatic relations) ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

* రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం(Election Commission of India) అధికారులు అక్టోబ‌ర్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈసీఐకి చెందిన సీనియ‌ర్ అధికారులు సుమారు మూడు రోజులు పాటు తెలంగాణ‌లో ఎన్నిక‌ల సంసిద్ధ‌త‌పై అంచ‌నాలు చేయ‌నున్నారు. రాజ‌కీయ పార్టీలు, సెక్యూర్టీ ద‌ళాలు, స్థానికుల‌తో పాటు ఇత‌ర స్టేక్‌హోల్డ‌ర్స్‌తో ఎన్నిక‌ల సంఘం అధికారులు చ‌ర్చించ‌నున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో.. ఇక్క‌డ ఉన్న పరిస్థితుల్ని ఈసీఐ అంచ‌నా వేయ‌నున్న‌ది.

* కాంగ్రెస్ నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని.. కాంగ్రెస్‌ ఓ జూటాపార్టీ అంటూ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బార్డర్ బార్డర్‌ వరకు రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ మాట మార్చిందని.. గెలిస్తే మహిళలకు ఉచిత బస్ అని చెప్పి.. బంద్‌ చేశారన్నారు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు.

* బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్‌ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని కొడకండ్ల మండలం ఎంసీ తండాకు చెందిన పలువురు యువకులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.

* కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును (Womens Reservation Bill) ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్‌ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్‌’గా నామకరణం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేన్ల అమలు ఉంటుందని వెల్లడించారు. ఈ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ బిల్లుపై ఎగువ సభలో గురువారం చర్చ జరగనుంది.