Politics

అసెంబ్లీలో మీసం మెలేసిన బాలయ్య-తాజావార్తలు

అసెంబ్లీలో మీసం మెలేసిన బాలయ్య-తాజావార్తలు

* ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. కూలీ నెం.1లో వెంకటేశ్‌లా కనిపించారు. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఎర్రని చొక్కా ధరించి నెత్తిన లగేజ్ పెట్టుకుని మోశారు. రైల్వే కూలీలు ధరించి బ్యాడ్జీ ధరించి అచ్చం కూలీలాగే కనిపించి అభిమానులను అలరించారు. రాహుల్ చిరునవ్వులు చిందుతూ రైల్వే కూలీలా మూటలు మోస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ నేడు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న రైల్వే కూలీలను కలిసి వారితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కూలీలు చేసే పనిని స్వయంగా చూసి తాను కూడా మూటలు మోశారు. రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ అక్కడ ఉన్న కూలీలు నినాదాలు చేశారు. ఈ వీడియోను ఎక్స్‌లో పంచుకున్న కాంగ్రెస్ పార్టీ.. భారత్ జోడో యాత్ర నడుస్తుందని స్పష్టం చేసింది.

* ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఈరోజు(గురువారం) ప్రారంభం కాగా, టీడీపీ సభ్యులు ఓవరాక్షన్‌ చేసి సభలో హంగామా సృష్టించారు. టీడీపీ సభ్యులు అతి చేయడంతో అసెంబ్లీ ప్రారంభం కాగానే వాయిదా పడింది. వాయిదా తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభమైనప్పటికీ టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టిముట్టి ఫైళ్లు విసిరేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన సరికాదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పదే పదే విజ్ఞప్తి చేసినా వారు తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ సభ్యులు సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్‌ కాగా, కొంతమందిపై ఒకరోజు సస్పెన్షన్‌ పడింది. సభలో బాలకృష్ణ మీసాలు తిప్పి రెచ్చగొట్టే చర్యలకు శ్రీకారం చుట్టాడు. దాంతో అసెంబ్లీ రెండోసారి వాయిదా పడింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద సాక్షి టీవీతో మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. ‘పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారు. సభాపతిపై టీడీపీ నేతలు ఫైల్స్‌ విసిరేసి, బాటిల్స్‌ పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉంది.

* చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై అసెంబ్లీలో ఇవాళ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును వైఎస్సార్‌సీపీ తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నాడంటూ ఏపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు స్కిల్ స్కామ్ అవినీతిలో కూరుకుపోయారు. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో యువతను చంద్రబాబు దోచుకున్నారు. అవినీతి చేయలేదని సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు అని అన్నారామె.

* మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా (IND vs AUS) ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. వరల్డ్ కప్‌ టోర్నీకి (ODI World Cup 2023) ముందు ఇరు జట్లకు ఇది గొప్ప సాధన కానుంది. భారత్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) విలేకరులతో మాట్లాడాడు. తొలి వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదని.. తన మణికట్టుకు అయిన గాయం పూర్తిగా నయమైనట్లేనని కమిన్స్‌ తెలిపాడు. తన జట్టు ఆటగాళ్ల ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పుడు నేను చాలా ఫిట్‌గా ఉన్నా. నా మణికట్టు గాయం పూర్తిగా నయమైంది. వంద శాతం మ్యాచ్‌ కోసం సిద్ధంగా ఉన్నా. మూడు మ్యాచుల్లోనూ ఆడతానని భావిస్తున్నా. అయితే, మా జట్టులో కొందరు తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండరు. మిచెల్‌ స్టార్క్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ఆడటం లేదు. వరల్డ్‌ కప్‌ నాటికి ప్రతి ఒక్కరికీ మ్యాచ్ ఆడే అవకాశం కల్పించడమే మా లక్ష్యం. స్టీవ్‌ స్మిత్ కూడా సిద్ధంగా ఉన్నాడు. తప్పకుండా శుక్రవారం మ్యాచ్‌ ఆడతాడు. కామెరూన్ గ్రీన్‌, స్టొయినిస్‌, మిచెల్ మార్ష్ పేస్‌ ఆల్‌రౌండర్లు ఉండటం వరల్డ్‌ కప్‌లోనూ మాకు కలిసొస్తుంది.

* ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30గంటలకు నిర్ణయం వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉన్న దృష్ట్యా తీర్పు వాయిదా వేసినట్టు సమాచారం. శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్‌ అయితే తీర్పు వాయిదా వేస్తామని, క్వాష్‌ పిటిషన్‌ లిస్ట్‌ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును విచారించేందుకు ‘పోలీసు కస్టడీ’కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాదులు బుధవారం వాదించారు. అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోరారు. పోలీసు కస్టడీ పేరుతో విచారణ చేసి, ఆ వివరాలను ఎంపిక చేసుకున్న ఛానళ్ల ద్వారా ప్రచారం చేసి ప్రజల్లో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలనే లక్ష్యంతో దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తోందన్నారు.

* తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. గురువారం పార్లమెంట్‌ వద్ద తెదేపా ఎంపీ కేశినేని నానితో మాట్లాడిన గడ్కరీ.. చంద్రబాబు యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ‘‘చంద్రబాబు మచ్చలేని ప్రజా సేవకుడు. భగవంతుని ఆశీస్సులతో కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారు’’ అని గడ్కరీ చెప్పినట్టు కేశినేని నాని ట్వీట్‌ చేశారు.

* ‘ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు’ అని గతంలో పెద్దలు అనేవారని, కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ మాత్రం.. ‘ఇల్లు నేనే కట్టిస్తా…పెళ్లి నేనే చేయిస్తా’ అంటున్నారని మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో రూ.50వేల కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తోందని తెలిపారు. నగర శివారులోని దుండిగల్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేశారు. ఇవాళ నగర వ్యాప్తంగా 9 ప్రాంతాల్లో మేయర్‌ ఆధ్వర్యంలో మంత్రులు రెండో విడతగా 13,300 ఇళ్లను పంపిణీ చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.

* ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలుస్తోంది. నిర్వహణ కారణాలతో కెనడాలో వీసా సర్వీసుల (Visa Services)ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసినట్లు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొన్నాయి.

* చైనా (China) నుంచి ఎదురవుతున్న సరిహద్దు సవాళ్లపై పార్లమెంటులో చర్చకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరాకరిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతోన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో (Parliament Special Session) ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతరిక్ష రంగంలో భారత విజయాలపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) లోక్‌సభలో చర్చను ప్రారంభించగా.. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌదరి కల్పించుకుని చైనాతో సరిహద్దు ప్రతిష్టంభనను ప్రస్తావించారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించే ధైర్యం తమకు ఉందని వ్యాఖ్యానించారు.

* చైనా-జర్మనీ మధ్య మరోసారి విబేధాలు తలెత్తాయి. జర్మనీ (Germany) విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్‌ (Annalena Baerbock) చైనా (China) అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను నియంతగా అభివర్ణించడంతో వివాదం తలెత్తింది. గత వారం అమెరికాలో పర్యటించిన జర్మనీ విదేశాంగ మంత్రి.. మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జిన్‌పింగ్‌ను నియంతగా అభివర్ణించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై స్పందిస్తూ.. ‘‘ఈ యుద్ధంలో పుతిన్‌ విజయం సాధిస్తే.. ఇతర నియంతలకు ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌కు’’ అని అన్నాలెనా వ్యాఖ్యానించారు.

* దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు సమీపంలో ఉన్న అమెరికా సైనిక (US military)స్థావరం క్యాంప్‌ హంఫ్రీస్‌లో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారు. ఈ స్థావరంలో దక్షిణ కొరియా (South Korea)పోలీసులు, అమెరికా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. సైనిక మెయిల్‌, ఇతర సౌకర్యాలను వినియోగించుకుని సింథటిక్‌ గంజాయి (synthetic marijuana) వినియోగం, రవాణాకు పాల్పడుతున్నట్లు కొందరు సైనికులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాడి నిర్వహించినట్లు దక్షిణ కొరియాలోని సీనియర్ డిటెక్టివ్ చా మిన్ సియోక్‌ మీడియాకు తెలిపారు.

* అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా డిఫరెంట్‌గా ఉంటుంది. తాజాగా ఐవాలో (Iowa) అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మద్దతుదారులకు పిజ్జాలు పంచారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 2024 అమెరికా (America) అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2024 అమెరికా అధ్యక్ష పదవి కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే.. అయితే ఆయన బుధవారం ఐవాలోని బెటెన్‌ డార్ప్‌లోని ఓ బార్‌లో తన మద్దతుదారులకు పిజ్జాలు (pizzas) పంచారు.

* దసరాకు సొంతూళ్లుకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముందస్తు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. అక్టోబర్‌ 15 నుంచి 29వ తేదీల మధ్యలో ప్రయాణానికి గానూ రానూపోనూ ఒకేసారి టికెట్లు బుక్‌ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని తెలిపింది. ఈ నెల 30వ తేదీలోపు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న వారికే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రూ.300కోట్లకుపైగా అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు కాగా.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయనను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల బుధవారం వాదనలు వినిపించాయి. దాదాపు మూడుగంటలకుపైగా వాడీవేడీగా వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌ వాదనలు వినిపించారు. అరెస్టు కక్ష్య సాధింపేనని బాబు తరఫున న్యాయవాదులు వాదించారు. అయితే, ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేశారు. గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెల్లడిస్తామని ప్రకటించారు. మళ్లీ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసిన న్యాయమూర్తి.. మరోసారి తీర్పును శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేశారు. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉన్న దృష్ట్యా తీర్పును వాయిదా వేశారు. రేపు హైకోర్టులో క్యాష్‌ పిటిషన్‌ లిస్ట్‌ అయితే తీర్పు వాయిదా వేస్తానన్నారు. పిటిషన్‌ లిస్ట్‌కాకపోతే తీర్పును వెలువరించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

* కర్నాటక సర్కారు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇటీవల కర్నాటకను ఆదేశించింది. ఈ నెల 28లోగా తమిళనాడుకు నీరివ్వాలని అథారిటీ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కరువు పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర్వులపై కర్నాటక సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా ప్రతి 15రోజులకోసారి సమావేశం నిర్వహించాలని కావేరి వాటర్‌ బోర్డు అథారిటీని ఆదేశించింది. కర్నాటక నుంచి రోజుకు 24వేల క్యూసెక్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ సారి తక్కువ వర్షాపాతం కారణంగా రాష్ట్రం కరువు పరిస్థితులను ఎదుర్కొంటుందని, నీటిని విడుదల చేయలేమని పేర్కొంటున్నది.