* భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (MS Swaminathan) మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగంలో స్వామినాథన్ వినూత్న పద్ధతులు చేర్చారని కొనియాడారు. ఆయన కృషి వల్లే ఆహార ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందన్నారు.
* తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 3న స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు లోకేశ్‌ని కోరారు.
* జీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు విజయనగరం కలెక్టరేట్ వద్ద జీపీఎస్ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. సీఎం జగన్‌కు ఓటేసి తప్పు చేశామంటూడ ఉద్యోగులు మోకాళ్లపై కూర్చుని చెప్పులతో చెంపలను కొట్టుకున్నారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు.
* ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించి వైకాపాకు తొత్తుగా సీఐడీ చీఫ్ పనిచేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ లేఖ రాశారు. సంజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత ఆధారాలను జతచేశారు.
* అగ్రరాజ్యం అమెరికాను మ్యాథ్స్ (Mathematics) సబ్జెక్ట్ కలవరపెడుతోంది. అవును.. మీరు చదివింది నిజమే. అమెరికాలో గణితంలో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్శిటీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. రాబోయే రోజుల్లో ఇదే తీరు కొనసాగితే.. అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించడంతోపాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోటీపడలేదని కంపెనీల యాజమాన్యాలు, విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* రాజస్థాన్(Rajasthan)లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు (Kota Suicides) కలవరపెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ.. తాజాగా మరో మరణం వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
* ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. వ్యక్తిగత డ్రెస్సేజ్ విభాగంలో అనుష్ గార్వాలా కాంస్య పతకంతో చరిత్ర సృష్టించాడు. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత డ్రస్సేజ్ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఈక్వెస్ట్రియన్‌లో ఇప్పటికే భారత్ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో గెలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు.
* రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy) ఇటీవల కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గత శుక్రవారం పార్లమెంట్‌కు వచ్చారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ఆంటోనీ రోటా ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్ రోటా స్వయంగా అతడిని పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడిగా కీర్తించారు. దీంతో అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్‌స్కీ సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు. పార్లమెంట్ గౌరవించిన హంకా రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పక్షాన పోరాడిన ‘14వ వాఫన్ గ్రనేడియర్ డివిజన్’కు చెందిన వ్యక్తి అని ఆ తర్వాత తేలింది. దాంతో ఈ ఘటనపై ట్రూడో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దాంతో మంగళవారం స్పీకర్ రోటా పదవికి రాజీనామా చేశారు. అయినా ఈ వివాదం చల్లారకపోవడంతో ట్రూడో(Justin Trudeau) తాజాగా బహిరంగ క్షమాపణలు చెప్పారు.
* భారత్ మీదకు ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడంలో పాకిస్థాన్ (Pakistan) కేంద్రంగా ఉన్నట్లు అనేక అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఇక కొన్నేళ్లుగా చైనాకు గాడిదలను సరఫరా చేస్తున్న ఘనత కూడా దాయాది దేశానిదే. తాజాగా ప్రపంచ దేశాలకు బిచ్చగాళ్లను (Beggars) ఎగుమతి చేస్తోన్న దేశంగా పాకిస్థాన్ నిలిచింది. విదేశాల్లో అరెస్టవుతోన్న యాచకుల్లో 90శాతం పాకిస్థానీలే ఉంటున్నట్లు తేలింది. అంతేకాదు, జేబు దొంగల్లో (Pickpockets) అత్యధికంగా పాక్ జాతీయులే ఉంటున్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది. విదేశాల్లో పాకిస్థానీలకు సంబంధించి అక్కడి సెనెట్‌లో చర్చ జరిగింది. విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీనిపై చర్చించింది. పాకిస్థాన్‌కు చెందిన బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నట్లు విదేశాంగశాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ కమిటీకి వెల్లడించారు. విదేశాల్లో అరెస్టవుతోన్న బిచ్చగాళ్లలో 90శాతం మంది తమ దేశానికి చెందినవారే ఉన్నట్లు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లేందుకు ‘యాత్రికుల వీసా’ను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అంతేకాకుండా పవిత్ర స్థలాల్లో అరెస్టవుతోన్న జేబుదొంగళ్లోనూ (Pickpockets) మెజార్టీ సంఖ్య పాక్ జాతీయులదేనని అన్నారు. పాక్ జేబు దొంగలకు ఇప్పటివరకు పశ్చిమాసియా దేశాలే గమ్యంగా ఉండగా.. అటువంటి వారికి ఇప్పుడు జపాన్ కొత్త గమ్యస్థానంగా మారుతోందని వివరించారు.
* సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో విజయవాడకు చెందిన వరప్రసాద్‌కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. వరప్రసాద్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ పై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వరప్రసాద్‌ను అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి.. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
* సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ పాలనలో సర్వమత సమానత్వాన్ని అమలు చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని క్రైస్తవ చర్చీల అభివృద్ధికి మంజూరైన రూ.2.25 కోట్ల నిధుల ప్రోసిడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం అయా చర్చీల ఫాదర్‌లకు అందజేశారు. వేల్పూర్ మండలం లక్కోరా వద్ద గలలేఎన్‌జీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 2 వేల మందికి పైగా హాజరయ్యారు.
* అక్టోబర్ ఒకటో తేదీ నుంచి విదేశాల్లో ఇంటర్నేషనల్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడకం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. విదేశాల్లో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి చేసే ఖర్చులపై 20 శాతం టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్.. టీసీఎస్ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రతిపాదించిన 2023-24 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారత్ ఆవల ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల వాడకంపై టీసీఎస్ వసూళ్లు ఐదు శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు ప్రపతిపాదించారు. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
* ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అన్ని ఆధారాలతో దొరికేసిన చంద్రబాబు నాయుడు.. తాను నిప్పును అని చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం నిజంగా సిగ్గు చేటన్నారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి. ఈరోజు(గురువారం) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి.. క్విడ్ ప్రోకో కింద రాష్ట్ర నిధుల్ని దోచేసి నిప్పు అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో చేసిన స్కాములు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయని ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ‘అసెంబ్లీలో స్కిల్ స్కామ్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. మరి ఆ సమావేశాల్ని నుంచి టీడీపీ సభ్యులు పారిపోయారు. టీడీపీ సభ్యులు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో చెప్పాలి. టీడీపీ సభ్యుల ప్రవర్తనను ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు చేసిన స్కామ్‌లను సంబంధిత అధికారులు బయటపెడితే అదేదో రాజకీయ కక్ష సాధింపు అంటూ మాట్లాడటం సరికాదు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తించింది. చంద్రబాబు తప్పు చేయకపోతే కోట్లు పెట్టి లాయర్లను ఎందుకు పెట్టుకుంటాడు. అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారు’ అని తెలిపారు.