DailyDose

ప్రసాదంపాడులో మహిళ దాష్టీకం-నేరవార్తలు

ప్రసాదంపాడులో మహిళ దాష్టీకం-నేరవార్తలు

* ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ పరిధిలోని ప్రసాదంపాడులో గురువారం దారుణం జరిగింది. వివాహిత మహిళ నాలుగేళ్ల కుమార్తెను కేబుల్‌ వైరుతో ఉరేసి హతమార్చింది. అనంతరం కత్తితో పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త అనిల్‌ కుమార్‌ ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడ పటమట పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం అదృశ్యమైన బాలిక ఇంటి సమీపంలోని పొదల్లో శవమై కనిపించింది. పోలీసుల కథనం ప్రకారం… భీమవరంలోని ఓ కాలనీలో ఏడో తరగతి విద్యార్థిని నిన్న సాయంత్రం పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. సమీపంలో గాలించినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు భీమవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం వారి ఇంటి సమీపంలోని పొదల్లో బాలిక మృత దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

* కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి పేలుడు సంభవించింది. గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శ్రావణి (14) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నబాబు(25) తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు భారీగా జరగడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసం కాగా, ఇల్లు పూర్తిగా దెబ్బతింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

* భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో నిర్వ‌హించిన గ‌ణేశ్ నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో అప‌శృతి చోటు చేసుకుంది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి న‌దిలో నిమ‌జ్జ‌నానికి వెళ్లిన ఓ ముగ్గురు యువ‌కులు నీట మునిగారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఇద్ద‌రు యువ‌కుల‌ను ప్రాణాలతో ఒడ్డుకు చేరారు. గ‌ల్లంతైన మ‌రో యువ‌కుడి కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. యువకులను భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపుడికి చెందిన లకావత్ గణేష్, తేజ‌గా గుర్తించారు.

* మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని సిటీలో ఓ 12 ఏండ్ల బాలిక‌పై లైంగిక‌దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఓ ఆటో డ్రైవ‌ర్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవ‌ర్‌ను రాకేశ్‌(38)గా పోలీసులు గుర్తించారు. అయితే ఆటోలో ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉండ‌టంతో అత‌న్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. బాధిత బాలిక అర్ధనగ్నంగా, తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధుల్లో ఇంటింటికీ తిరిగినా, స్థానికులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆ వీధుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డు అయ్యాయి. 8 కిలోమీట‌ర్ల మేర బాలిక వీధుల్లో తిరిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో డ్రైవ‌ర్‌ను అరెస్టు చేశారు. సోమవారం బాలికపై లైంగిక దాడి జరిగినట్టు తెలుస్తున్నది.