ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్ మాట్లాడుతూ.. భారాస, భాజపాపై విమర్శలు గుప్పించారు.
‘‘కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15వేలు అందిస్తాం. ఉపాధి హామీ కూలీలకు కూడా రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటాం. దిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక అనారోగ్యం దృష్ట్యా నేను ఈ పర్యటనకు వచ్చా. మనది రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం. కొల్లాపూర్ సభకు తప్పక వస్తానని ప్రియాంక హామీ ఇచ్చారు. అందుకే, టికెట్ల విషయంలో దిల్లీలో సీఈసీ భేటీ ఉన్నా సభకు హాజరయ్యా. ఓవైపు సీఎం కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం.. నిరుద్యోగులు, మహిళలున్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. భారాస, భాజపా కలిసి తెలంగాణ ప్రజల సొమ్ము దోపిడీ చేశాయి’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు తదితరులు సభలో పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –