పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయలాండ్ (Thailand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, తైవాన్ దేశాల నుంచి వచ్చేవారు వీసా అవసరంలేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు థాయ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ ఏడాది నవంబరు 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఈ సడలింపు అమల్లో ఉంటుందని వెల్లడించారు. దీంతో ఈ మధ్యకాలంలో భారతీయులు వీసా లేకుండా థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో థాయ్‌లాండ్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్ ప్రధాని శ్రేత్తా తవిసిన్ (Srettha Thavisin) తెలిపారు. ‘‘భారత్, తైవాన్ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులపాటు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చు’’ అని థాయ్ అధికార ప్రతినిధి చాయ్ వచరొంకే (Chai Wacharonke) తెలిపారు.గత నెలలో చైనా నుంచి వచ్చే పర్యాటకులకు థాయ్‌లాండ్ వీసా మినహాయింపును ఇచ్చింది. మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌కు వెళుతుంటారు. థాయ్ పర్యాటకశాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు సుమారు 22 మిలియన్ల మంది థాయ్‌లో పర్యటించారు. వీరి వల్ల సుమారు 25.67 బిలియన్ డాలర్ల ఆదాయం లభించిందని తెలిపాయి. థాయ్‌లాండ్‌లో చూడదగ్గ ప్రదేశాల్లో బ్యాంకాక్, క్రబి, ఫుకెట్, ఫిఫీ దీవులు ముందువరుసలో ఉంటాయి. రకరకాల ఆహార పదార్థాలు, నైట్‌క్లబ్‌లు ఇక్కడి ప్రత్యేకత. కొద్దిరోజుల క్రితం శ్రీలంక కూడా భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయిచింది. చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాలూ ఇందులో ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నుంచి ఈ సడలింపు అమలులో ఉంటుందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
👉 – Please join our whatsapp channel here –