DailyDose

తెలంగాణలో ఐటీ దాడుల కలకలం-నేర వార్తలు

తెలంగాణలో ఐటీ దాడుల కలకలం-నేర వార్తలు

* తెలంగాణలో ఐటీ దాడుల కలకలం

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నాయకురాలు, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి. అటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. కోకాపేటలోని ఈడెన్‌ గార్డెన్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గిరిధర్ రెడ్డి రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌లో ఉన్నారు. ఉదయం నుంచి కేఎల్‌ఆర్‌, అతని బంధువుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగాయి. సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలో బ్యాంక్‌ అధికారుల సమక్షంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నగదు, కీలక డాక్యుమెంట్లు సీజ్‌ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఐటీ అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఐటీ దాడులు కుట్రపూరితమని పారిజాత టీవీ9తో అన్నారు. మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ బీఫాం కోసం చూస్తున్నామని తెలిపారు. ఐటీ దాడుల వెనుక మంత్రి సబితా రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఓటమి భయంతో సబిత దాడులు చేయిస్తున్నారన్నారు. అయితే ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. రాజకీయంగా ఇలాంటి దాడులను ఎన్నైనా ఎదుర్కొంటామన్నారు.కాగా తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులతో బీజేపీకి సంబంధం లేదన్నారు..కిషన్‌రెడ్డి. ఐటీ అధికారులకు ఉన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తారని.. అందులో ఎవరి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.

* కేరళ సీఎంకు బెదిరింపు ఫోన్‌ కాల్‌

కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan)కు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. సీఎం విజయన్‌ను చంపేస్తానని బుధవారం సాయంత్రం రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఫోన్‌ చేసింది మైనర్‌ బాలుడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసులు మాత్రం ఈ ఫోన్‌ కాల్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.కొద్దిరోజుల క్రితం కేరళలోని కలమస్సేరిలో ఓ ప్రార్థనా సమావేశంలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 52 మంది గాయపడ్డారు. బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొంటూ త్రిశూర్‌కు చెందిన డొమినిక్‌ మార్టిన్‌ అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ క్రమంలో సీఎంకు బెదిరింపులు రావడంతో పోలీసుశాఖ ఉలిక్కిపడింది. గతంలో కూడా పలుమార్లు విజయన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

* అర్థరాత్రి అంతర్రాష్ట్ర దొంగల హల్చల్

రాష్ట్రంలో దొంగల భయం రోజురోజుకి ఎక్కువైపోతోంది. రాష్ట్రంలో ఉండే దొంగల ముఠాలు సరిపోనట్లు ప్రస్తుతం అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు పుట్టుకు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉండే దొంగల పోరే పడలేకుంటే ఇపుడు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన దొంగలు రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో దొంగతనాల కేసులు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో మరోసారి అంతర్రాష్ట్ర దొంగలు చేతివాటం చూపేందుకు ప్రయత్నించారు. పట్టుకోవాలి అని ప్రత్నించిన పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. నంద్యాల లోని రైల్వే స్టేషన్ రోడ్ గూడ్స్ షెడ్ ప్రాంతంలో అర్ధరాత్రి అంతర్రాష్ట్ర దొంగలు రెచ్చిపోయారు.ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు ఓ ఇంట్లో ప్రవేశించి.. చేతివాటం చూపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన స్థానికులు, ఇంటి యజమాని దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు దొంగలు పరారైయ్యారు. అయితే మరో దొంగ మాత్రం తప్పించుకునేందుకు ఇంటి పైకప్పు పైకి ఎక్కారు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా దొంగ ఇనుప రాడ్డుతో బెదిరించారు. దీనితో ఇంటి యజమాని, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి వచ్చారు. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు, ఫైర్ సిబ్బందికి దొంగ చుక్కలు చూపించారు . చివరకు పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకున్నారు. అనంతరం పట్టుకున్న దొంగను 3 టౌన్ పీఎస్ కు తరలించారు.

* ఢిల్లీ మంత్రిపై మనీలాండరింగ్‌ కేసు

ఢిల్లీ అధికార పార్టీ ఆప్‌ నేతలు, మంత్రుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్‌ (CM Arvind Kejriwal) విచారణకు ముందు ఆయన కేబినెట్‌లోని మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ (Minister Raaj Kumar Anand) ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ (ED) సోదాలు నిర్వహిస్తున్నది. మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీలోని 12 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది.దిగుమతులపై రూ.7 కోట్లకుపైగా కస్టమ్స్‌ ఎగవేత, హవాలా లావాదేవీలకు సంబంధించి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) ఫిర్యాదు ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. పటేల్‌ నగర్‌ ఎమ్మెల్యే అయిన ఆనంద్ ప్రస్తుతం ఢిల్లీ సాంఘిక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తురన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో సీఎం కేజ్రీవాల్‌ గురువారం ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే.

* ఫిల్మ్‌మేకర్‌కు రోడ్డు ప్రమాదం

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ఘోరం చోటు చేసుకొంది. ఓ రోడ్డు ప్రమాదంలో యువ ఫిల్మ్‌మేకర్‌ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం కల్కాజీలో నివాసముంటున్న పీయూష్‌ పాల్‌ (30) అనే వ్యక్తి గురుగ్రామ్‌లో ఫ్రీలాన్స్‌ ఫిల్మ్‌ మేకర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో అతివేగంతో వస్తున్న మరో ద్విచక్రవాహనం అతడి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పాల్‌ సమీపంలోని చెట్టును ఢీకొని గాయపడ్డాడు. అతడికి తీవ్ర స్థాయిలో రక్తస్రావమైంది.ఈ ప్రమాదాన్ని చూసి చుట్టుపక్కల వారు అక్కడికి చేరి వీడియోలు తీసుకుంటున్నారేగానీ సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఓ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తించారు. అప్పటికే ఆలస్యం కావడంతో.. తక్షణమే క్షతగ్రాతుడిని వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పాల్‌ ప్రాణాలు కోల్పోయిన్నట్లు వైద్యులు ప్రకటించారు.ప్రమాదం జరిగిన అనంతరం పాల్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులతో పాటు కెమెరా, ఫోన్‌ చోరీకి గురైనట్లు అతడి స్నేహితుడు ఆరోపించాడు. ప్రమాదం విషయం తెలుసుకొన్న పాల్‌ తల్లిదండ్రులు అతడికి ఫోన్‌ చేయగా.. ఆ కాల్‌ను ఎవరో కట్‌ చేశారు. ఆ తర్వాత ఫోన్‌ పూర్తిగా స్విచ్ఛాఫ్‌ అయిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిని బంటీగా గుర్తించామని తెలిపారు.

* మహిళా వాలంటీర్‌కు మరో వాలంటీర్‌ వేధింపులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్‌ వ్యవస్థపై అనేక ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇదే సమయంలో.. కొందరు వాలంటీర్ల వెకిలిచేష్టలు మొత్తం వాలంటీర్‌ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా తయారవుతున్నాయి.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాలంటీచర్ల అఘాయిత్యాలు వెలుగు చూశాయి.. వెంటనే వారిపై ప్రభుత్వం చర్యలకు కూడా పూనుకుంది.. కొందరు మర్డర్లు, అత్యాచార కేసుల్లోనూ దొరికిపోయారు.. తాజాగా.. ఓ వాలంటీర్‌కు మరో వాలంటీర్‌ నుంచి వేధింపులు ఎదురయ్యాయి.. ఈ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఓ వాలంటీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళా వాలంటీర్‌.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట మండలం పలివెలలో మహిళా వాలంటీర్‌కు మరో వాలంటీర్‌ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.. మౌనంగా కొన్ని రోజుల పాటు వేధింపులను భరించిన సదరు మహిళా వాలంటీర్‌.. ఇంకా వేధింపులు పెరగడంతో.. పోలీసులను ఆశ్రయించింది.. మహిళ వాలంటీర్‌ను తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధించ సాగాడు సుబ్రహ్మణ్యం అనే మరో వాలంటీర్‌.. మొదట్లో సున్నితంగా మందలించినా అతడి బుద్ది మారలేదు సరికదా.. రోజురోజుకూ వేధింపులు ఎక్కువయ్యాయి.. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సదరు మహిళా వాలంటీర్‌ పేర్కొన్నారు. బాధిత వాలంటీర్‌ ఫిర్యాదుతో సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేశారు కొత్తపేట పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

* వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి

తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు నివాసం పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గూడూరు పట్టణ సొసైటీలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు నివశిస్తున్నారు. అయితే బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని ఆగంతకులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి ఆవరణలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అంతేకాదు ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను చించివేశాడు. అంతేకాదు వరండాలోని టేబుల్, ఫ్యాన్‌ పగలగొడుతున్న శబ్ధం రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళన వ్యక్తం చేశారు. అయితే ఇంట్లో పనిచేసే మహిళా గట్టిగా కేకలు వేసింది. దీంతో గుర్తు తెలియని ఆగంతకులు పరారయ్యారు. అయితే ఆ మహిళ ఒక ఆగంతకుడిని చూసినట్లు తెలిపింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అయితే దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఘటనకు పార్టీలో గ్రూపు రాజకీయాలే కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా గూడూరు వైసీపీలో తీవ్ర విభేధాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు ఒక వర్గం మిగిలిన వారు వేరే వర్గంగా ఉంటూ ఒకరంటే ఒకరికి పడకుండా రాజకీయం చేస్తున్నారు. ఈ వర్గపోరు నేపథ్యంలోనే వెలగపల్లి వరప్రసాద్ రావు నివాసంపై దాడి జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కేసు పెట్టలేదని తెలుస్తోంది.

* సీఐపై కానిస్టేబుల్‌ దాడి

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్‌, సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం.మహబూబ్‌ నగర్‌ జిల్లా సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్) సీఐ ఇఫ్తేకార్ హమ్మద్‌పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలో పని చేసే కానిస్టేబుల్ జగదీష్‌, సీఐకి దాడికి పాల్పడ్డాడు. కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. సీఐ పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణతోనే జగదీష్‌ ఈ దాడికి తెగబడినట్లు సమాచారం. ఘటనాస్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. సాయంత్రంకల్లా పూర్తి వివరాలు తెలియజేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

* ఐఐటీ- ఢిల్లీలో మరో విద్యార్ధి బలవన్మరణం

న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన మరో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. షహదారాలోని తన ఇంటికి వెళ్లిన విద్యార్ధి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఏడాది ఐఐటీ-ఢిల్లీలో చోటుచేసుకున్న విద్యార్ధుల ఆత్మహత్యల్లో ఇది మూడోది. ఐఐటీ-ఢిల్లీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ ఢిల్లీలో మృతుడు (20) టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ బీటెక్ చదువుతున్నాడు. విద్యార్థికి తల్లిదండ్రులతోపాటు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. విద్యార్ధి వింధ్యాచల్ హాస్టల్‌లో నివసిస్తున్నాడు.గత ఏడాది హాస్టల్ బాస్కెట్‌బాల్ జట్టుకు సాంస్కృతిక కార్యదర్శి, వైస్ కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. ఏం జరిగిందో తెలియదుగానీ మంగళవారం అర్థరాత్రి అందరూ నిద్రపోయాక విద్యార్థి తన ఇంట్లోని గదిలో శవమై కనిపించాడు. దీనిపై కేసునమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రక్రియను ప్రారంభించారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు ఇంకా స్వాధీనం చేసుకోలేదని సమాచారం. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబరులో తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకుని మరణించినప్పటి నుంచి విద్యార్థి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. విద్యార్ధి పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యులకు కూడా తెలుసని తెలిపారు.ఈ ఏడాది సెప్టెంబర్‌లో అనిల్‌కుమార్‌ (20) అనే విద్యార్ధి ఢిల్లీలోని ఐఐటీలోని హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్ మ్యాథమ్యాటిక్స్‌, కంప్యూటింగ్‌లో టీటెక్ చదువుతున్నాడు. బ్యాక్స్‌ ఉన్నందున్న బీటెక్‌ డిగ్రీని సకాలంలో పూర్తి చేయలేక ఒత్తిడికి లోనయ్యాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు కుమార్‌కు గడువు పొడిగించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు. అయినప్పటికీ కుమార్‌ సూసైడ్‌ చేసుకుని తనువు చాలించాడు. ఇక ఇదే ఏడాది జూలైలో ఐఐటి-ఢిల్లీలో మ్యాథమ్యాటిక్స్‌, కంప్యూటింగ్‌లో బిటెక్ చదువుతున్న ఆయుష్ అష్నా అనే మరో విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మృతి చెందిన కుమార్, అష్నా ఇద్దరూ షెడ్యూల్డ్ కులాల (SC) కమ్యూనిటీకి చెందినవారు.కాగా 2018 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఐఐటీల్లో 33 మంది, వివిధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీలు) నుంచి 24 మంది, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో నలుగురు విద్యార్థులు సూసైడ్‌ చేసుకుని మరణించినట్లు విద్యాశాఖ సహాయ మంత్రి (MoS) సుభాస్ సర్కార్ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంట్‌కు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z