Editorials

తన కోపమే తన శత్రువు

తన కోపమే తన శత్రువు

పూర్వం విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు పూర్తయ్యాక లేచాడు. అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. మాటామాటా వచ్చింది. ఇంద్రుడి స్వర్గాన్ని తలదన్నే స్వర్గం సృష్టించాడు విశ్వామిత్రుడు. అదే త్రిశంఖు స్వర్గం!

అయితే పుణ్యాత్ములంతా ఇంద్రుడు ఉన్న స్వర్గానికే వెళతారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తిని ధారబోసి సృష్టించిన స్వర్గంలోకి వెళ్ళరు.

కొన్నాళ్ళకి ఆవేశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు ‘అయ్యయ్యో తపశ్శక్తిని అంతా కోపం, ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే!’ అని మళ్ళి తపస్సు చేశాడు.

మళ్ళి 1000 సం.లు పూర్తయ్యాయి. ఈసారి ఇంద్రుడు తాను వెళితే సామరస్యంగా ఉంటుందని, పెద్దగా స్పందించడని భావించి ఊర్వశిని పంపాడు.

తప్పస్సు నుండి లేచేసరికి ఊర్వశి ఎదురుగా వయ్యారాలు పోతూ నిలబడి ఉంది. ఊర్వశిని చూసిన విశ్వామిత్రుడు మోహితుడై 1000 సంవత్సరాల పాటు ఊర్వశితో ఉన్నాడు.

అనంతరం మోహం, పరవశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు తన తపోశక్తి వృథా అయినందుకు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళి తపస్సు చేశాడు.

ఈసారి కూడా వేయి సంవత్సరాలు తపస్సు పూర్తయ్యే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు. నేను వెళ్ళినా, ఊర్వశిని పంపినా ఉపయోగం ఉండదు.

అందుకని వశిష్టుడిని ఎదురుపడేలా చేద్దాం అనుకుని తపస్సు పూర్తయ్యేసరికి వశిష్ఠుడు ఎదురుపడేలా చేశాడు. విశ్వామిత్రుడు వశిష్టుడిని చూసేసరికి అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు.

తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు. అంతే వెయ్యేళ్ళ తపశ్శక్తి అంతా క్షణకాలంలో పోయింది.

తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు ‘అయ్యయ్యో ఎంత పొరబాటు చేశాను. తపశ్శక్తిని క్షణకాలంలో వృథా చేసేశాను,’ అని బాధపడ్డాడు.

ఇంద్రుడు ఎదురుపడినప్పుడు ఆవేశాపడినా తపశ్శక్తి పోవడానికి చాలాకాలం పట్టింది. ఊర్వశి ఎదురుపడినప్పుడు మోహించినా కూడా తపశ్శక్తి పోవడానికి చాలాకాలం పట్టింది. కాని కోపం రావడం వల్ల తపశ్శక్తి పోవడానికి కేవలం క్షణకాలంలో హరించుకు పోయింది. కోపం అంత బలమైనది.

ఒకరిని తిట్టి తెగ సంబరపడిపోతూ ఉంటారు చాలామంది. కాని అలా తిట్టడం వల్ల వారి దోషాలు తొలగిపోతాయి. మీరు ఎంతోకాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం క్షణకాలంలో హరించుకొని పోతుంది.

వేయి సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపస్సే క్షణకాలంలో పోయినప్పుడు, యే సాధనలు లేని సామాన్య జీవితం గడిపే సామాన్యుడికి కోపం మహాపెద్ద శత్రువు.

మంచి హరించుకుపోతే మిగిలేది చెడే. చెడు సంస్కారాలు ప్రబలమైతే మిగిలేది బాధలు, దుఃఖం, అనారోగ్యం! మీరు ఎందులో వీక్ గా ఉంటే దాన్ని దెబ్బతీస్తుంది.

కోపమే మహా శత్రువు. దీనిని దృష్టిలో పెట్టుకొని కోపం తగ్గించుకోండి!అందున సాధనలో వున్న వారు మరింత జాగ్రత్తగా వుండాలి సుమీ.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z