* టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో అరెస్ట్
TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నగర సీసీఎస్, సిట్ పోలీసులు న్యూజిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 100 మందికి పైగా అరెస్టయ్యారు. కమిషన్ కార్యాలయంలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి… న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిది సాన ప్రశాంత్‌కు కూడా గ్రూప్-1 ప్రశ్నాపత్రం చేరవేసి పరీక్ష రాయించాడు. లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను కీలక నిందితులుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థులు, దళారులను గుర్తించి అరెస్ట్ చేశారు.
* బెంగుళూరులో దారుణం
బెంగూరులో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రభుత్వ అధికారిని హత్య చేశారు. వివరాలలోకి వెళ్తే.. ప్రతిమ(37) అనే మహిళ బెంగళూరులో మైన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆమె బెంగళూరు లోని సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని దొడ్కకలసంద్ర లోని గోకుల అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. కాగా శనివారం రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో కార్ డ్రైవర్ ప్రతిమను కార్యాలయం నుండి ఇంటికి తీసుకు వచ్చి దింపాడు. అనంతరం డ్రైవర్ కూడా వెళ్లిపోయారు. ప్రతిమ ఒక్కరే ఇంట్లో ఉండగా అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ప్రతిమను హత్య చేశారు.ప్రతిమ సోదరుడు ఎన్ని సార్లు ఫోన్ చేసిన ప్రతిమ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రతిమ సోదరుడు ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా ప్రతిమ రక్తం మడుగులో విగతజీవిగా పడివుంది. దీనితో ఈ ఘటన వెలుగు చూసింది. కాగా సౌత్ డివిజన్ డీసీపీ రాహుల్ కుమార్ షాపూర్వాడ్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎలాంటి ఆధారాలు కనిపించ లేదు. దీనితో తెలిసిన వారే పగడ్బందీగా హత్య చేసి ఉంటారని అనుమానం రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రతిమ కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్నారు. భర్త, కొడుకు భర్త, కొడుకు తీర్థహళ్లిలో నివాసముంటున్నట్లు సమాచారం.
* పొరుగింటి మహిళపైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పిన యువకుడు
‘మీ కుక్క రోజూ మా ఇంటి ముందు మల విసర్జన చేస్తున్నది’ అంటూ గొడవకు దిగిన పొరుగింటి మహిళపైకి ఓ యువకుడు తన పెంపుడు కుక్కను వదిలి దాడి చేయించాడు. అంతటితో ఆగక ఆ యువకుడు కూడా సదరు మహిళపై దాడి చేశాడు. ఒక వైపు కుక్క ఆ మహిళపై ఎగబడుతుండగానే ఆ యువకుడు కూడా ఆమెను నేలపై పడేలా బలంగా నెట్టేశాడు. ఢిల్లీలోని స్వరూప్ నగర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. స్వరూప్ నగర్‌కు చెందిన రియా దేవి అనే మహిళ ఇంటి ముందు ఆమె పొరుగింటి వాళ్లు పెంచుకునే కుక్క రోజూ మల విసర్జన చేస్తున్నది. అలా జరగకుండా చూసుకోవాలని సదరు మహిళ ఎన్నిసార్లు చెప్పినా కుక్క యజమాని కుంటుంబం పట్టించుకోవడం లేదు. దాంతో శుక్రవారం ఆ మహిళకు కుక్క యజమాని ఇంటి ముందు గొడవకు దిగింది. ఆగ్రహించిన కుక్క ఓనర్ దాన్ని ఆమె పైకి ఉసిగొల్పాడు.ఒక వైపు పెంపుడు కుక్క ఆమెపై ఎగబడుతుండగానే ఆ కుక్క యజమాని కూడా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. వచ్చీరావడంతోనే ఆమెను బలంగా నెట్టేయడంతో కింద పడిపోయింది. ఈ ఘటనలో మహిళకు ఒళ్లంతా గాయాలయ్యాయి. కాళ్లు, చేతులు, ముఖంపై కుక్క పంటి గాళ్లు పడ్డాయి. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా బెయిల్‌పై బయటికి వచ్చాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసుల తెలిపారు.
* సబిత గన్‌మెన్ ఆత్మహత్య
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్‌తో కాల్చుకుని ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని మంత్రి సబితా పరిశీలించారు.ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ, ఫాజిల్ ఉదయం ఆరుగంటలకు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. కూతురితో మాట్లాడిన తర్వాత పిస్తోల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.
* మావోయిస్టుల చేతిలో బీజేపీ నేత దారుణ హత్య
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు భాజపా నేతను శనివారం (నవంబర్ 4) దారుణంగా హత్యచేశారు. ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేస్తుండగా ఝరాఘటి పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌశల్‌నగర్ గ్రామంలోని మార్కెట్‌లో సాయంత్రం 5:30 గంటలకు ఈ దాడి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నారాయణపూర్ జిల్లా ఉపాధ్యక్షుడు రతన్ దూబే (57) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోసల్‌నార్ గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రచారం ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి కారులో వస్తుండగా గ్రామశివారులో కాపుకాసిన కొందరు మావోయిస్టులు ఆయనపై కాల్పులు జరిపారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో కిందపడ్డాడు. మావోయిస్టులు వెంటనే అతడిని పట్టుకుని పదునైన మారణాయుధాలతో నరికి దారుణంగా హత్యచేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ మావోయిస్టులు రాజకీయ నాయకులపై దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ హేమసాగర్ సిదర్ మాట్లాడుతూ..
నారాయణపూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రతన్ దూబేను మావోయిస్టులు పదునైన ఆయుధంతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ దాడిలో సంఘటన స్థలంలోనే అతను చనిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. వారి జాడ కోసం భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తగిన భద్రత కల్పించామని, అయితే దూబే పర్యటన గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని’ ఆయన అన్నారు.ఎన్నికలకు ముందు నక్సలైట్లు బీజేపీ నేతను హత్య చేయడంతో ప్రజల్లో భయాందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఇలాంటి హత్యలు జరిగాయి. దీనికి కొద్ది రోజుల ముందు నక్సలైట్లు మోహ్లా-మన్పూర్-అంబాగఢ్ చౌకీ జిల్లాలోని ఔంధీలో బీజేపీ నాయకుడు బిర్జురామ్‌ను కాల్చి చంపారు. సాయుధ నక్సలైట్లు ఈ ఘటనకు పాల్పడ్డారు. 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా నక్సలైట్లు బీజేపీ అభ్యర్థి దర్బార్ సింగ్‌ను ఇదే రీతిలో హత్య చేసిన సంగతి విధితమే.
* తల్లి చేసిన పనికి కొడుకు ఏం చేశాడంటే?
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఇంట్లో గొడవలతో తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకు తనకు ఇష్టమైన కూర వండలేదని తల్లితో గొడవ పెట్టుకున్నాడు. తల్లీ కొడుకుల మృతి ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తల్లీ కొడుకుల మృతదేహాలను స్వాధీనంలోకి తీసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.ఒరై కొత్వాలి ప్రాంతానికి చెందిన సుశీల్ నగర్లో నివాసముండే దిగ్విజయ్ సింగ్ (28) పరీక్ష రాసి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతని తల్లి బేబీ చౌహాన్ (55) ఇంట్లో ఉంది. దిగ్విజయ్ తన తల్లిని తనకు ఇష్టమైన కూరగాయను వండమని అడిగాడు. అప్పటికే తల్లి కూర వండేసింది. ఇంట్లో ఇద్దరు మాత్రమే తినే వాళ్లు ఉండడంతో తయారు చేసేందుకు నిరాకరించింది. అవసరం అయితే ఉదయం తనకు ఇష్టమైన కూర వండుతానని చెప్పింది. ఈ విషయమై తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది.వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీని తర్వాత కొడుకు ఇంట్లో ఉంచిన వస్తువులను విసిరేయడం ప్రారంభించాడు. ఇది చూసి ఆగ్రహించిన తల్లి ఇంట్లో ఉన్న విషం తాగింది. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో పాటు స్పృహ కోల్పోయింది. దీంతో కొడుకు దిగ్విజయ్ భయపడిపోయాడు. తర్వాత ఏమీ ఆలోచించకుండా బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను, కొడుకు ఉరిలో వేలాడుతూ ఉండటాన్ని చూసిన ప్రజలు వెంటనే కుమారుడిని ఉచ్చులోంచి కిందకు దించి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. తల్లీకొడుకుల మధ్య వంట విషయంలో గొడవ జరిగిందని, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని ఒరై కొత్వాలి ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర సింగ్ పటేల్ తెలిపారు. మహిళ ఓరై కాలువ విభాగంలో పనిచేస్తోంది.
* ప్రియురాలిని కలిసేందుకు వచ్చాడు
ప్రియురాలిని కలిసేందుకు ఒక వ్యక్తి రాత్రి వేళ ఆమె ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు గదిలోకి రావడాన్ని గమనించి కూలర్‌లో దాక్కున్నాడు. (Lover Hides Inside Air Cooler ) అయితే చివరకు మహిళ కుటుంబ సభ్యులకు అతడు దొరికిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి అర్ధరాత్రి వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెను కలిశాడు. అయితే గది నుంచి ఏదో శబ్దం వినిపించడంతో ఇంట్లోకి దొంగ వచ్చి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఆ గదిలోకి వెళ్లి చూశారు. గదంతా వెతికారు. అయితే కూలర్ లోపల ఎవరో దాక్కుని ఉండటాన్ని గమనించారు. ఆ కూలర్‌ను తిప్పి చూశారు. అందులో ఉన్న వ్యక్తిని బయటకు రప్పించారు. వారి వ్యవహారంపై మహిళను, ఆ వ్యక్తిని ఆమె కుటుంబ సభ్యులు మందలించారు.కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు. మహిళ కుటుంబానికి అతడి గురించి తెలిసిందా లేదా కూలర్‌లో దాక్కున్న అతడ్ని అనుకోకుండా గుర్తించారా? అని ఒకరు సందేహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి కూలర్‌లో దాక్కున్న తీరు చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బ్యాడ్ లక్, ప్రియురాలి కుటుంబ సభ్యులకు దొరికిపోయాడంటూ మరికొందరు విచారం వ్యక్తం చేశారు.
* కొమరం భీమ్ వర్ధంతి ఉత్సవాల్లో అపశృతి
కొమరం భీమ్ వర్ధంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన వర్ధంతి ఉత్సవాల్లో పొల్గొన్న ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్‌కు మృతి చెందారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో కొమరం భీమ్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ క్రమంలో కొమురం భీమ్ జెండాను ఎత్తే సమయంలో విద్యుత్ వైర్లకు జెండా కట్టిన పైపు కరెంట్ వైర్లకు తగలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఖానాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఒకరు మృతిచెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, మృతులు భీమ్రావు (25), మోహన్ (26)గా గుర్తించారు.
👉 – Please join our whatsapp channel here –