Business

భోగాపురం విమానాశ్రయ కాంట్రాక్టు దక్కించుకున్న ఎల్‌అండ్‌టీ

భోగాపురం విమానాశ్రయ కాంట్రాక్టు దక్కించుకున్న ఎల్‌అండ్‌టీ

ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి భారీ ఆర్డరు దక్కించుకున్నట్లు లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. జీఎంఆర్‌ విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానాశ్రయ ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ (ఈపీసీ) కాంట్రాక్టు తమ అనుబంధ సంస్థ ఎల్‌అండ్‌టీ కన్‌స్ట్రక్షన్‌కి లభించినట్లు వివరించింది.

అయితే, కాంట్రాక్టు విలువ మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా రూ. 2,500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల శ్రేణిలోని కాంట్రాక్టులను కంపెనీ భారీ ఆర్డర్లుగా పరిగణిస్తుంది. ప్రాథమికంగా ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల (ఎంపీఏ) హ్యాండ్లింగ్‌ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని, తర్వాత ఇది 12 ఎంపీఏకి పెరుగుతుందని సంస్థ తెలిపింది. కాంట్రాక్టు ప్రకారం ఏటీసీ టవర్, ఎయిర్‌ఫీల్డ్‌ అభివృద్ధి (3,800 మీటర్ల దక్షిణ రన్‌వే, ట్యాక్సీవే, యాప్రాన్, ఎయిర్‌ఫీల్డ్‌ గ్రౌండ్‌ లైటింగ్‌) మొదలైన పనులు చేయాల్సి ఉంటుందని ఎల్‌అండ్‌టీ పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో భారీ విమానాశ్రయాల్లో నిర్మాణ పనులను నిర్వహిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z