Food

పెరుగుతో కూర

పెరుగుతో కూర

పెరుగుతో కూర ఏంటి? అని అనుకుంటున్నారా.. దీన్ని చట్నీ అని కూడా పిలుస్తారు. ఇంట్లో కూరగాయాలు ఏమీ లేనప్పుడు.. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఇలా పెరుగుతో కర్రీ చేసుకుని తినవచ్చు. ఇది అన్నంలోకి, టిఫిన్స్ లోకి, పలావ్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా దేనిలోకైనా తినవచ్చు. ఏదైనా కర్రీస్ వాటిల్లోకి గ్రేవీ కింద కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. తినడానికి టేస్టీగా ఉంటుంది. వంట రాని వారు సైతం దీన్ని ఎంతో ఈజీగా చేసేస్తారు. మరి ఈ పెరుగు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు కర్రీకి కావాల్సిన పదార్థాలు:

పెరుగు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివే పాకు, కొత్తి మీర, ఇంగువ, నూనె, ఉల్లి పాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు.

పెరుగు కర్రీ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలోకి మీకు సరిపడినంతగా పెరుగును తీసుకోవాలి. పెరుగును ముందు చిలికి తీసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలక్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. అవసరం అయితే కొద్దిగా వాటర్ వేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. అందులో నూనె వేసి వేడెక్కాక.. కరి వేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరి వేపాకు వేగాక.. ఇంగువ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రగా వేయించు కోవాలి. నెక్ట్స్ ఉల్లి పాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత.. అన్నీ కలిపి పెట్టుకున్న పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి.. మంటను మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ పెరుగు మిశ్రమం.. దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తి మీర చల్లుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు కర్రీ సిద్ధం. దీన్ని ఏ ఐటెమ్ లోకి అయినా వేసుకుని తినవచ్చు. ఈ సారి అన్నంలోకి మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి చూడండి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z