Business

ప్రొద్దుటూరు ఎస్‌బీఐలో నకిలీ బంగారం స్కామ్

ప్రొద్దుటూరు ఎస్‌బీఐలో నకిలీ బంగారం స్కామ్

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఖాతాదారులతో కుమ్మకైన గోల్డ్ అప్రైజర్‌ చంద్రమోహన్ ఎస్‌బీఐ బ్యాంకునే బురిడీ కొట్టించాడు. 39 మంది ఖాతాదారులతో బంగారు ఆభరణాలను బ్యాంకులో తనఖా పెట్టించి రూ.3.17 కోట్ల రుణాలు ఇప్పించాడు. అవి నాణ్యతలేని బంగారం ఆభరణాలని తేలడంతో కడప ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ ప్రొద్దుటూరు పోలీసులకు పిర్యాదు చేశారు. ప్రొద్దుటూరు పట్టణం ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన చంద్రమోహన్ స్థానిక ఆరవేటి థియేటర్ సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంకులో గోల్డ్ అప్రైజరుగా పనిచేస్తున్నాడు. ఖాతాదారులు రుణాల కోసం బ్యాంకులో తనఖా పెట్టే బంగారు ఆభరణాల నాణ్యతను అతను నిర్ధారించిన తరువాత అధికారులు రుణాలు మంజూరు చేస్తారు. ఈ క్రమంలోనే కొంతకాలం క్రితం 39 మంది ఖాతాదారులు బంగారం ఆభరణాలు తనఖా పెట్టి రూ.3.17 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ ఆభరణాలను చంద్రమోహన్ స్వయంగా పరిశీలించారు. కొన్నిరోజుల తరువాత లాకర్లో ఉన్న ఆభరణాలను పరీక్షించిన బ్యాంకు అధికారులు అవి నాణ్యత లేనివని గుర్తించారు. కొన్ని ఆభరాణాలకు బంగారం పూత పూసి వాటితో రుణం తీసుకున్నట్లు తేలింది. బ్యాంకు గోల్డ్ అప్రెజర్ చంద్రమోహన్‌కు తెలిసే ఈ వ్యవహారం జరిగిందని నిర్ధారించుకున్న బ్యాంకు అధికారులు ప్రొద్దుటూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గోల్డ్ అప్రైజర్ చంద్రమోహన్‌, మరో 39 మంది ఖాతాదారులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు చంద్రమోహన్ ప్రస్తుతం పరారీ ఉన్నాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z