DailyDose

టీ- బీజేపీకి మరో బిగ్ షాక్- తాజా వార్తలు

టీ- బీజేపీకి మరో బిగ్ షాక్- తాజా వార్తలు

* 100 కోట్లు ఆస్తిని పోగొట్టుకున్న చంద్రమోహన్

ఈ ఉదయం టాలీవుడ్ సీనియర్ సినీ నటుడు మచ్చలేని చంద్రమోహన్ మరణించారు. ఈయన స్టార్ నటుడిగా ప్రజల మన్ననలు అందుకున్నప్పటికీ తన చివరి రోజుల్లో మాత్రం చాలా సాధారణమైన జీవితాన్ని గడిపి ఈలోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన చంద్రమోహన్, తన జీవితంలో రూ. 100 కోట్లు ఆస్తని పోగొట్టుకున్నానని చెప్పడం అందరికీ తెలిసిందే. సంపాదించిన దాని కంటే కూడా పోగొట్టుకున్నవే ఎక్కువంటూ తెలియచేశారు చంద్రమోహన్. తెలంగాణలోని కొంపల్లి లో 35 ఎకరాల ద్రాక్ష తోటను కొన్నాడట, కానీ దీనిని దగ్గరుండి చూసుకునే వారు లేకపోవడంతో చాలా తక్కువకే అమ్మేశాడట. అదే విధంగా మద్రాస్ లోనూ 15 ఎకరాలు ఉంటే అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఆస్తులు ఆంటి విలువను చూస్తే రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని అప్పుడు ఇంటర్వ్యూ లో చంద్రమోహన్ చెప్పుకుని బాధపడ్డారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది.ఇక అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు మనిషే చనిపోయాక ఇక ఆస్తులు పెట్టుకుని ఏమి చేసుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

* టీ- బీజేపీకి మరో బిగ్ షాక్

బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విజయశాంతి పార్టీలో చేరికను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి శనివారం ధృవీకరించారు. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో చర్చలు పూర్తి చేసిన విజయశాంతి అతి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. కాగా గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విజయశాంతికి కమలం పెద్దలు షాకిచ్చారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో ఆమె పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్‌లోనే చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

* మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) నియోజకవర్గంలో కాంగ్రెస్‌ (Congress) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వకపోగా, ప్రస్తుత అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.శుక్రవారం జరిగిన రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సైతం ఆమె దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపించారు. నేడో రేపో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

* ఢిల్లీలో భూకంపం

ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. శనివారం ఢిల్లీలో 2.6 తీవ్రతతో మధ్యామ్నం 3.36 గంటలకు భూకంపం సంభవించింది. నార్త్ డిస్ట్రిక్ట్ లో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు.ఇటీవల కాలంలో దేశరాజధాని ఢిల్లీలో పలుమార్లు భూమి కంపించింది. హిమాలయాలు, ముఖ్యంగా నేపాల్ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడల్లా ఢిల్లీలో ప్రకంపనలు ఏర్పడ్డాయి. కొద్ది రోజుల క్రితం నేపాల్ లోని పశ్చిమ ప్రాంతంలో 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ సమయంలో ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు వచ్చాయి.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సీస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం అధిక భూకంప ప్రమాద జోన్‌గా పరిగణించబడే జోన్ IVలో ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) వస్తాయి. జోన్ IV అనేది మోస్తరు నుండి అధిక స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించే అధిక సంభావ్యత గల ప్రాంతాన్ని సూచిస్తుంది.ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ క్రమంగా ఉత్తరంగా కదులుతూ, ఆసియన్ టెక్టానిక్ ప్లేట్‌ని ముందుకు నెడుతుండటంతో దీని నుంచి విడుదలయ్యే శక్తి భూకంపాలుగా బయటకు వస్తోంది. గతంలో ఈ పరిణామాల వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎప్పుడో రోజు హిమాలయాలు, ఉత్తర భారతదేశం, నేపాల్ ప్రాంతాల్లో భారీ భూకంపాలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* 15న పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన

ఈనెల 15న పలనాడు జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటించనున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వరికపూడిసెల ప్రాజెక్టు పనులకు ఈ పర్యటన లో శ్రీకారం చుట్టనున్నారు ఏపీ సీఎం జగన్.ఈ తరుణంలో మాచర్లలోని రాయవరం జంక్షన్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.ఇక అటు ఆంధ్రప్రదేశ్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కరువు మండలాల ప్రకటనకు… పంటల బీమాకు ఎలాంటి సంబంధం లేదని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడంపై రైతులు మరియు ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే.అయితే ఈ అంశంపై సీఎం జగన్ తాజాగా స్పందించారు. అర్హులైన రైతులందరికీ పంటల బీమా వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

* భార్యను చూసేందుకు జైలు నుంచి ఇంటికి వెళ్లిన సిసోడియా

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో ( liquor policy case) అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీష్‌ సిసోడియా (Manish Sisodia) శనివారం జైలు నుంచి బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు మధురా రోడ్డులోని నివాసానికి వెళ్లారు. మనీలాండరింగ్‌ కేసులో తీహార్ జైలు (Tihar Jail)లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియా కోర్టు అనుమతితో శనివారం ఉదయం 10 గంటలకు ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఆయన తన భార్యతోనే ఉండనున్నారు.కాగా, భార్య అనారోగ్యంతో ఉందని తనను కలుసుకునేందుకు అనుమతించాలంటూ సిసోడియా గతంలో కోర్టుకు విన్నవించుకున్న విషయం తెలిసిందే. తన భార్యను కలుసుకునేందుకు 5 రోజులపాటు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు సిసోడియాకు అనుమతి ఇచ్చింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇంట్లో తన భార్యను కలిసేందుకు అనుమతిచ్చింది. అయితే, ఎలాంటి రాజకీయ సమావేశాలు, ప్రసంగాలు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం సిసోడియా జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం తిరిగి జైలుకు వెళ్లిపోనున్నారు.

* రేవంత్ రెడ్డి గులాబీ బాస్ పై ఫైర్

సీఎం కేసీఆర్‌కు ఆకలి ఎక్కువ ఆలోచన తక్కువ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇన్నాళ్లుగా దోపిడే లక్ష్యంగా ఆయన పాలన సాగిందని దుయ్యబట్టారు. శనివారం బెల్లంపల్లి, రామగుండంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని మాట్లాడిన రేవంత్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునాదులే సరిగా లేవని అందువల్లే మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలిందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ ఇసుక మీద కట్టారని.. ఎవరైనా ఇసుక మీద కడుతారా? అలా కట్టడానికి ఇదేమైనా పేక మేడనా? అద్దాల మేడనా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని కర్ఫ్యూలు ఉంటాయని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లోనే 9 గంటల విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రౌతులను ఆదుకుని 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. వేలాది మంది రైతులమీద క్రిమినల్ కేసులు, రైతు రుణ మాఫీలను మొదటి సంతకంతోటే రద్దు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసితీరుతామన్నారు.

* తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్‌గా ఉన్న ప్రజాశాంతి పార్టీని యాక్టివ్‌గా లేదని అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు వస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయని కేఏ పాల్‌ పేర్కొన్నారు. సీఈవో వికాస్ రాజ్, డిప్యూటీ సీఈవో సత్యవాణి తమ ఉద్యోగాలు పోయినా పర్లేదు అని నిజాలు చెప్పారని ఆయన అన్నారు.ఒక చిన్న పార్టీకి సింబల్ ఇవ్వలేదని లద్ధాఖ్ ఎన్నికలు రద్దు చేశారని.. ఈ క్రమంలోనే తన పార్టీకి సింబల్ అండ్ ఇనాక్టివ్ చేసినందుకు కోర్టులో పిటిషన్ వేస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. డోంట్ ఓట్ లేదా ఓట్ నోటా ట్యాగ్‌తో ప్రజల్లోకి వెళ్తామన్నారు. అంబేడ్కర్‌ అండ్ గద్దర్ ఆశయాలను నెరవేర్చుకుందామని ప్రజలకు సూచించారు. ప్రజాశాంతి పార్టీ పోటీలో లేదు కాబట్టి ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని కోరారు. మంద కృష్ణ మాదిగకు మోడీ కోట్లు ఇచ్చి సభ పెట్టించారని ఈ సందర్భంగా ఆరోపణ చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.

* 15న బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 14వ తేదీ నుంచి ఈశాన్య, తూర్పు గాలులు బలోపేతం అవుతాయని వివరించింది. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉత్తర కోస్తా తీరంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఆ ద్రోనీ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నట్లు ఐఎండి తెలిపింది. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండనున్నట్లు పేర్కొంది. సీజన్స్ లేట్ అక్టోబర్ లో పడాల్సిన వర్షం నవంబర్ లో పడుతోందని వాతావరణశాఖ చెప్పింది. నవంబర్ మూడోవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరగనున్నట్లు హెచ్చరించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z