గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగేవారు కొందరైతే… ఉనికి చాటేందుకు పోటీ చేసే వారు మరికొందరు. ఈ రెండూ కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంతో… తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరుకు చెందిన కె.పద్మరాజన్(60) ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా కేవలం అతిరథులపైనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడం విశేషం. వీటి నామినేషన్ల కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. మెట్టూరులో టైర్ల దుకాణం నిర్వహిస్తున్న పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకుని, ప్రస్తుతం అన్నామలై ఓపెన్ వర్సిటీ నుంచి ఎంఏ(హిస్టరీ) చేస్తున్నారు. ఇప్పటివరకు లోక్‌సభ, శాసనసభల ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ప్రధాని, ముఖ్యమంత్రి అభ్యర్థులు, రాష్ట్రపతి ఎన్నికల్లో కలిపి 237 నామినేషన్లు వేశారు. వివిధ కారణాలతో వాటిలో ఎక్కువ శాతం తిరస్కరణకు గురయ్యాయి. సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఈ నెల 4న నామినేషన్ వేశారు. సోమవారం స్క్రూటినీ అనంతరం అది తిరస్కరణకు గురైంది. ఆయన పోటీ చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు, ఏపీ, కేరళ, కర్ణాటక, దిల్లీ ఉండగా, పోటీ పడిన ప్రముఖుల్లో వాజ్‌పేయీ, కరుణానిధి, జయలలిత, రాహుల్‌గాంధీ, వైఎస్ తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్‌లపై బరిలోకి దిగారు. 1991లో నంద్యాల ఉప ఎన్నికలో ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీకి నామినేషన్ వేశారు.
పీవీ నుండి కెసిఆర్ వరకు…ఎన్నికల్లో అందరిపై పోటీ
