DailyDose

చిన్నారి రేప్ కేసులో నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌-నేర వార్తలు

చిన్నారి రేప్ కేసులో నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌-నేర వార్తలు

*  చిన్నారి రేప్ కేసులో నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌

కేర‌ళ‌లోని అలువ‌లో జ‌రిగిన చిన్నారి కిడ్నాప్‌, రేప్ కేసులో నిందితుడు అష్‌ఫ‌క్ ఆల‌మ్‌‌కు ఎర్నాకుళం పోక్సో కోర్టు మ‌ర‌ణ‌శిక్షను విధించింది. ఆ కేసులో జ‌డ్జి కే సోమ‌న్ త‌న తీర్పును ఇవాళ వెలువ‌రించారు. ఇది అత్యంత అరుదైన కేసు అని, నిందితుడికి ఎటువంటి క్షమాభిక్ష అవ‌స‌రం లేద‌ని, స‌మాజానికి అత‌నో స‌మ‌స్య అని కోర్టు తెలిపింది. మైన‌ర్‌కు డ్రగ్స్ ఇచ్చినందుకు మూడేళ్ల శిక్ష, మైన‌ర్‌ను రేప్ చేసినందుకు జీవిత‌కాలం జైలు, మ‌ర్డర్ చేసినందుకు మ‌ర‌ణ‌శిక్షను విధిస్తున్నట్లు కోర్టు చెప్పింది. 110 రోజుల పాటు ఈ కేసులో సుదీర్ఘ వాద‌న‌లు జరిగిన త్వరాత ఇవాళ చిల్డ్రన్స్ డే సంద‌ర్భంగా కోర్టు తీర్పును వెల్లడించింది.

 ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ముజఫర్‌నగర్‌ (Muzaffarnagar) జాతీయ రహదారి -58 పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.ఢిల్లీ నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కారు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో (car collides with truck) ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు. బాధితులంతా ఢిల్లీలోని షహదారా వాసులుగా గుర్తించినట్లు చెప్పారు. ప్రమాద సమాచారాన్ని మృతుల కుటుంబాలకు అందించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

*   ప్రియుడితో కలసి భర్తను అతికిరాతకంగా చంపిన భార్య

అక్రమ సంబంధాల మోజులో పచ్చటి సంసారాలను చేతులారా నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న భార్య లేదా భర్తలను అతి దారుణంగా చంపేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణాలో మరో దారుణం చోటు చేసుకుంది.. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్నభర్తనే కడతేర్చింది భార్య.. పోలీసుల ఎంట్రీ తో అసలు విషయం బయటకు వచ్చింది..వివరాల్లోకి వెళితే.. జిల్లాలో రామేశ్వరంపల్లి కి చెందిన మైలి నవీన్ కుమార్ అతని భార్య ఉదయరాణి గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. నవీన్ కుమార్ ఇద్దరు కుమార్తెలు మెదక్ జిల్లాలోని అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు.. నవీన్ కుమార్ ఇంటి పక్కనే నివసిస్తున్న తరుణ్ అనే యువకుడితో అతని భార్య ఉదయరాణికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఉదయరాణి భర్తకు తెలియడంతో కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.సోమవారం కూడా గొడవ జరిగింది.. ఇక ప్రియుడితో సుఖం కావాలంటే భర్తను అడ్డు లేకుండా చెయ్యాలని కోరింది. నవీన్ ను, మద్యం తాగుదామని తరుణ్ బయటికి తీసుకొని వెళ్ళాడు. నవీన్ కు ఎక్కువగా మద్యం తాగించిన తర్వాత,తరుణ్ అతనిని ఇంటికి తీసుకొస్తుండగా మధ్యలో నవీన్ కింద పడిపోయాడు.. అలానే ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు.. ఆ తర్వాత ఇంటి సంపులో ముంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. నవీన్ కింద పడడంతో తలకు బాగా దెబ్బ తగలడంతో మృతి చెందాడని సమాచారం అందించింది. వెంటనే అతని తల్లి, అన్నలు అక్కడికి చేరుకున్నారు. నవీన్ తలకు, మెడపై గాయాలు ఉండడం గమనించి, ఉదయరాణిని గట్టిగా నిలదీశారు. దీంతో ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకుంది.. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహన్ని పోస్ట్ మార్టం కు తరలించి, ఉదయారాణి తరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

*  తాత కారుకింద పడి రెండేళ్ల మనవడు మృతి

ప్రమాదవశాత్తు తాత కారు కిందపడి మనవడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంట్లో విషాదం నింపింది. కేరళలో జరిగిన ఈ ఘటనలో రెండేళ్లు బాలుడు శరీరం కారు టైరు కిందపడి నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. తాత కారు ఇంట్లోకి ప్రవేశించగానే త్వరగా అతడిని చేరుకునేందుకు ఇద్దరు మనవళ్లు పరుగెత్తుకుంటూ వచ్చారు.. పెద్ద మనవడు దూరంగా నిలబడగా.. చిన్న మనవడు కారుకు అడ్డంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందుకు ఉన్న చిన్నారి కనిపించకపోవడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సీసీఫుటేజీలో తెలుస్తోంది. ఏడుపు విని కారు కిందికి చూడగా రక్తపు మడుగులో చిన్నారు పడివుండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రెండేళ్లు బాలుడు మృతి చెందాడు.. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

బీహార్‌లో ఇసుక మాఫియా కిరాతకం

బీహార్‌లో ఇసుక మాఫియా దారుణానికి పాల్పడింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపట్ల కిరాతకంగా వ్యవహరించింది. ఇసుక ట్రాక్టర్‌తో పోలీస్‌ వాహనాన్ని మళ్లీమళ్లీ ఢీకొట్టింది. పోలీస్‌ వ్యాన్‌ దిగిన ఎస్‌ఐని ట్రాక్టర్‌తో తొక్కించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఒక హోంగార్డు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక డీఎస్పీ అభిషేక్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు.ఘటనకు సంబంధించి డీఎస్పీ అభిషేక్‌ కుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జాముయ్‌ జిల్లాలోని గర్హి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోగల మహులియా తాండ్‌ గ్రామం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో గర్హి ఎస్‌ఐ ప్రభాత్‌ రంజన్‌ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లాడు. ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్న ట్రాక్టర్‌కు పోలీస్‌ వాహనాన్ని అడ్డుపెట్టించాడు. అయినా ట్రాక్టర్‌ డ్రైవర్‌ ట్రాక్టర్‌ను ఆపకుండా పోలీస్‌ వాహనాన్ని మార్చిమార్చి ఢీకొట్టాడు. దాంతో ఎస్ఐ కిందకు దిగి అడ్డుకోబోగా.. ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆయనను ట్రాక్టర్‌తో తొక్కించాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.ఈ ఘటనలో ఎస్‌ఐ ప్రభాత్‌ రంజన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ హోంగార్డుకు కూడా గాయలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగానే ఎస్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పారిపోయిన ఇసుక ట్రాక్టర్‌ డ్రైవర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిని నవడా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, ట్రాక్టర్‌ను సీజ్‌ చేశామని, త్వరలోనే నిందితుడిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ప్రమిదలే వారిపాలిట చితి మంటలయ్యాయి

దీపావళి పండుగ కాంతులు అందరి ఇళ్లల్లో వెలుగులు విరజిమ్మితే ఆ ఇంట్లో మాత్రం అంతులేని విషాదాన్ని నింపాయి. బాల్కనీలో వెలిగించిన ప్రమిదలకు వృద్ధ దంపతులు సజీవంగా ఆహుతయ్యారు. భర్త ఇంటి వద్దనే అగ్నికి ఆహుతై దుర్మరణం పాలయ్యాడు. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన మల్కాజిగిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని మల్కాజిగిరి సమీపంలోని ప్రేంవిజయ్‌నగర్‌ కాలనీలో వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు రాఘవమ్మ (79), రాఘవరావు (82) నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. దీంతో బంధువులున్న అపార్ట్‌మెంట్‌లోనే ఫ్లాట్‌ కొనుక్కొని ఉంటున్నారు. దీపావళి సందర్భంగా ఆదివారం సాయంత్రం బాల్కనీలో ప్రమిదలు వెలిగిస్తుండగా రాఘవమ్మ చీరకు నిప్పంటుకుంది. ఆమె భయంతో బాల్కనీకి ఆనుకుని ఉన్న పడకగదిలోకి పరుగు తీసింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న భర్త గదిలోనే సేద తీరుతున్నారు. ఈ క్రమంలో రాఘవమ్మకు అంటుకున్న మంటలు భర్త రాఘవరావుకు అంటుకున్నాయి. దీంతో ఆయన మంచంపై నుంచి లేచేలోపే క్షణాల్లో ఒళ్లంతా మంటలు వ్యాపించి అక్కడికక్కడే మృతి చెందాడు. రాఘవమ్మ భయంతో బయటకు పరుగులు తీసింది. ఇంటి చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి పరీక్షించి రాఘవరావు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన రాఘవమ్మను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మరణించారు. వృద్ధులైన ఆ దంపతులు ఇరువురు ఇలా అగ్నిప్రమాదంలో చనిపోవడం స్థానికులను కలచివేసింది.

కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి (Chhattisgarh CM) భూపేష్ బాఘెల్ (Bhupesh Baghe) కొరడా దెబ్బలు (whip lashed) తిన్నారు. అదేంటి? ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తినడమేంటి.. అని షాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజమే. ఆచారంలో భాగంగా ఆయన కొరడా దెబ్బలు తిన్నారు.ఛత్తీస్‌గఢ్‌లో దీపావళి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం దుర్గ్‌ జిల్లా (Durg district) లోని జజంగిరి గ్రామం (Janjgiri village)లో గోవర్ధన్‌ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన సీఎం.. ఆలయంలో గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తుల లాగానే కొరడా దెబ్బలు తిన్నారు. తన చేతిపై ఐదు కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోయి, శుభం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.అక్కడి ఆలయంలో జరిగిన పూజలో కొరడా దెబ్బలు సాధారణమే. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని ముఖ్యమంత్రి బాఘెల్ కూడా పాటిస్తారు. ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటారు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు

కుటుంబ పరంగా రావాల్సిన డబ్బులు ఇవ్వ కుండా తాత్సారం చేస్తున్నాడనే కోపంతో ఓ కసాయి తనయుడు తండ్రిని చున్నీతో ఉరిబిగించి హత్య చేసిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ జయేశ్‌రెడ్డి, ఎస్సై నీరేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జవహార్‌నగర్‌ కాలనీకి చెందిన నక్క చిన్న పోశెట్టి(56) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.శనివారం రాత్రి తాగిన మైకంలో కుమారుడు సాయిలు తండ్రి చిన్న పోశెట్టిల మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాడనే కోపంతో ఇంట్లో ఒక్కడే నిద్రిస్తున్న తండ్రిని చున్నీతో ఉరిబిగించి హత్య చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి స్థానికంగా ఉన్న వారికి హత్య చేసినట్లు తెలుపగా మద్యం మత్తులో చెబుతున్నాడని వారు పట్టించుకోలేదు. సాయిలు పోలీసుల ఎదుట తన తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకొని ఆదివారం లొంగిపోయాడు.సీఐ జయేశ్‌రెడ్డి, ఎస్సై నీరేశ్‌ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విచారణలో సాయిలు మద్యానికి బానిసయ్యాడని తెలిపారు. కుటుంబ, పొలం పరంగా రావాల్సిన డబ్బుల విషయమై పలుమార్లు తండ్రీకుమారుడిల మధ్య గొడవలు జరిగాయని చెప్పారు. సాయిలు మద్యానికి బానిస కావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z