Business

చాలాకాలం తర్వాత టాటా నుంచి ఐపీఓ-వాణిజ్య వార్తలు

చాలాకాలం తర్వాత టాటా నుంచి ఐపీఓ-వాణిజ్య వార్తలు

చాలాకాలం తర్వాత టాటా నుంచి ఐపీఓ

టాటా గ్రూప్‌ (Tata group) నుంచి చాలా రోజుల తర్వాత ఐపీఓ వస్తోంది. మదుపరులు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ (Tata Technologies IPO) నవంబర్‌ 22న ప్రారంభం కాబోతోంది. నవంబర్‌ 24తో సబ్‌స్క్రిప్షన్‌ ముగియనుంది. టాటా గ్రూప్‌ నుంచి చివరిగా టీసీఎస్‌ ఐపీఓకు వచ్చింది. మళ్లీ దాదాపు 2 దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న ఐపీఓ ఇదే కావడం గమనార్హం. దీంతో మదుపరుల్లో ఆసక్తి నెలకొంది.టాటా మోటార్స్‌కు చెందిన టాటా టెక్నాలజీస్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సర్వీసెస్‌ సంస్థ. టాటా మోటార్స్‌, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఐపీఓలో భాగంగా టాటా మోటార్స్‌ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించనుంది. అలాగే ఇతర ప్రైవేటు ఈక్విటీ సంస్థలైన ఆల్ఫా టీసీ హోల్డింగ్‌ 2.4 శాతం, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌ 1.2 శాతం చొప్పున తమ వాటాలను విక్రయించనున్నాయి. ఐపీఓలో భాగంగా టాటా టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌ ఉద్యోగులకు 10 శాతం షేర్లను రిజర్వ్‌ చేశారు.టాటా టెక్నాలజీస్‌ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, బోఫా సెక్యూరిటీస్‌ ఇండియా లిమిటెడ్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. అయితే, ఐపీఓ సైజ్‌, ధరల శ్రేణి వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఐపీఓ కోసం ఈ ఏడాది మార్చి 9న సెబీకి దరఖాస్తు చేసుకోగా.. ఆమోదం లభించింది. అయితే, కంపెనీ ముందుగా అనుకున్న దాని కంటే ఈ ఐపీఓ పరిమాణం తగ్గనుంది. త్వరలో ఆ వివరాలు వెల్లడి కానున్నాయి.

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్

ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్ రంగంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. గతేడాది నుంచి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ లేఫ్స్ పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా అమెజాన్ తన గేమింగ్ డివిజన్ నుంచి 180 మంది ఉద్యోగును తొలగించిందని నివేదికలు చెబుతున్నాయి. అమెజాన్ గత వారం తన స్ట్రీమింగ్ మ్యూజిక్ మరియు పోడ్‌కాస్ట్ విభాగంలో ఉద్యోగాలను తగ్గించడం ప్రారంభించింది. వారంలోనే రెండోసారి ఉద్యోగులను తీసేసింది. దీనికి ముందు అమెజాన్ గేమ్స్ ఏప్రిల్ నెలలో 100 మందిని తొలగించింది.అమెజాన్ ఈ త్రైమాసికంలో మంచి వృద్ధిరేటు కనబరిచినప్పటికీ.. ఉద్యోగుల కోతలను కొనసాగిస్తోంది. గతేడాది అమెజాన్ 27000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. గత వారం అమెజాన్ మ్యూజిక్‌లో కొంత మందిని తొలగిస్తూ ఈ మెయిల్స్ పంపింది. సంస్థాగత అవసరాలు పున:పరిశీలనలో భాగంగా కస్టమర్ల సంతృప్తి, దీర్ఘకాలిక వ్యాపార అవసరాల ప్రాధాన్యత కారణంగా తాజా తొలగింపులు జరుగుతున్నట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు. అమెజాన్ మాత్రమే కాదు.. టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా వేలల్లో తమ ఉద్యోగులను తొలగించాయి. లాభాలు తగ్గడంతో ఖర్చులను అదుపులో పెట్టుకునేందుకే అని కంపెనీలు ప్రకటించాయి.

వోడాఫోన్‌ ఐడియా 5G సేవలను

దేశీయ మూడో టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా త్వరలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించనుంది. పుణె, ఢిల్లీలోని ఎంపిక చేసిన ప్రదేశాల్లో 5G సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రభుత్వం కేటాయించిన స్పెక్ట్రమ్‌పై హై-స్పీడ్ మిల్లీమీటర్-వేవ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌పై 3.7Gbps కంటే ఎక్కువ గరిష్ట వేగాన్ని VI సాధించిందని, వేగంగా దేశవ్యాప్తంగా 5G కనెక్టివిటీని విస్తరిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఈ నగరాల్లో 5G కనెక్టివిటీ ఏ రోజున లాంచ్ అవుతుందని ఇంకా ప్రకటించలేదు. కంపెనీ సైట్ ప్రకారం, 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ కావడానికి కస్టమర్‌లకు 5G SIM అవసరం ఉంటుంది. Vi స్టోర్లలో 5G SIM కార్డ్‌లను అందిస్తామని టెలికాం సంస్థ పేర్కొంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 5G ని అందిస్తున్నాయి. త్వరలో ఈ జాబితాలో VI కూడా చేరనుంది.

బెట్టింగ్ యాప్ ద్వారా 15వేలకు కోట్లకు పైగా మోసం 

ఎంతటి వారైనా.. ఎంత పెద్దోళ్లు అయినా.. ఎన్ని లక్షల కోట్లు ఉన్నా.. మజా.. కిక్కు అనేది ఉండాలి కదా.. అది లేకపోతే ఎంత సంపాదించి ఏం లాభం.. అందుకే చాలా పెద్దపెద్దోళ్లు.. డబ్బున్నోళ్లు అందరూ కిక్కు కోసం బెట్టింగ్స్, గేమ్స్.. ఇతర వ్యవహారాల్లోనూ ఉంటారు.. అలాంటిదే ఇప్పుడు వెలుగు చూసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో.. డాబర్ గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ పేర్లు బయటకు రావటం.. వ్యాపార ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది.మహాదేవ్ యాప్ బెట్టింగ్ కుంభకోణంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల తర్వాత పారిశ్రామికవేత్తలు – డాబర్ గ్రూప్ ఛైర్మన్ మోహిత్ వి. బర్మన్, డైరెక్టర్ గౌరవ్ వి. బర్మన్ పేర్లు కూడా ముంబై పోలీసుల విచారణలో ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. నవంబర్ 7న ముంబై పోలీసులు నమోదు చేసిన బెట్టింగ్ యాప్ ఎఫ్‌ఐఆర్‌లో ప్రముఖ ఆయుర్వేద దిగ్గజం డాబర్ గ్రూప్‌కు చెందిన బర్మన్ ల పేర్లు చేర్చబడ్డాయి. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌తో పాటు ఇతర వ్యక్తులతో సహా మొత్తం 31 మంది నిందితులలో వీరూ ఉన్నారు. డాబర్ గ్రూప్ దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అధికారులెవరూ దీనిపై మాట్లాడేందుకు అందుబాటులో లేరు.బెట్టింగ్ యాప్ ద్వారా వేలాది మందిని రూ. 15వేలకు కోట్లకు పైగా మోసం చేశారని సామాజిక కార్యకర్త ప్రకాష్ బంకర్ మాతుంగా పోలీసులకు మొదటి ఫిర్యాదు చేశారు. గ్యాంబ్లింగ్ చట్టం, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్‌ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నప్పటికీ.. ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

21న మరో ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ

ప్రభుత్వ రంగ ‘ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ’ ఐపీఓ (IREDA IPO) నవంబర్‌ 21న ప్రారంభం కానుంది. నవంబర్‌ 23న ముగుస్తుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.30- 32గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.2,150 కోట్లు సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు నవంబర్‌ 20న ఐపీఓ ప్రారంభమవుతుంది.గత ఏడాది మే నెలలో ఎల్‌ఐసీ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పబ్లిక్‌ ఇష్యూ (IREDA IPO)కు వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌ఈడీఏనే. కొత్తగా 40.31 కోట్ల షేర్లను జారీ చేస్తోంది. దీంతో రూ.1,290 కోట్ల సమీకరణ జరగనుంది. మరో రూ.860 కోట్లు విలువ చేసే 26.88 కోట్ల షేర్లను ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద అందుబాటులో ఉంచనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ భవిష్యత్‌ మూలధన అవసరాలు, రుణ మంజూరుకు వినియోగించనుంది. ఇష్యూలో అందుబాటులో ఉన్న షేర్లలో దాదాపు సగం ‘అర్హతగల సంస్థాగత మదుపర్ల’కు కేటాయించారు. మరో 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు, 15 శాతం ‘సంస్థాగతయేతర మదుపర్ల’కు రిజర్వ్‌ చేశారు. ఇన్వెస్టర్లు కనీసం 460 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.14,720 పెట్టుబడిగా పెట్టాలి.ఐఆర్‌ఈడీఏ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న మినీరత్న కంపెనీ. వివిధ దశల్లో ఉన్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఈ సంస్థ ఆర్థిక సహకారం అందజేస్తుంటుంది. ఈ క్రమంలో అనేక ఫండ్‌, నాన్‌-ఫండ్‌ ఆధారిత ఫైనాన్షియల్‌ ప్రోడక్ట్‌లను అందిస్తోంది. బీఓబీ క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ కానున్నాయి.

బిలియనీర్‌ జాబితాలో కొత్త ఎంట్రీ

మంచి బిజినెస్‌ ఐడియా ఉంటే కోటీశ్వరులు కావడం సులువేనని చాలా మంది నిరూపిస్తున్నారు. స్టార్టప్‌ కంపెనీ స్థాపించి లాభాలు పొందుతున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఐపీఓ ద్వారా  స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ అయి కోట్లు గడిస్తున్నారు. దాంతో ఏళ్లుగా మార్కెట్‌లో ఉంటున్న సంపన్నుల సరసన కొత్త బిలియనీర్లు చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా భారత బిలియనీర్ల జాబితాలో కొత్తగా ప్రదీప్ రాథోడ్ స్థానం సంపాదించారు. అసలు ఈయన ఎవరు? ఏ వ్యాపారం చేస్తుంటారు.. వంటి అంశాల గురించి తెలుసుకుందాం.వంట గదుల్లో ఉపయోగించే వస్తువులు, థర్మోవేర్‌ ఉత్పత్తులను తయారుచేసే కంపెనీ సెల్లో వరల్డ్  ఛైర్మన్‌గా ప్రదీప్ రాథోడ్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయింది. మార్కెట్‌లోని డిమాండ్‌ వల్ల పెట్టుబడిదారులు, రిటైల్‌ ఇన్వెస్టర్లు కంపెనీ స్టాక్‌ను కొనుగోలు చేయడంతో స్టాక్‌ ధర అమాంతం పెరిగింది. దాంతో తన సంపద కూడా పెరిగి బిలియనీర్‌గా మారిపోయారు. ఆయనకు కంపెనీలో 44 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ప్రదీప్ రాథోడ్ వద్ద రూ.8,300 కోట్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. ఆయన బడామియా చారిటబుల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా కొనసాగుతున్నారు. జేఐటీఓ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.సెల్లోవరల్డ్‌ కంపెనీ కిచెన్ వేర్, థర్మోవేర్, పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. 2017లో గాజు ఉత్పత్తుల తయారీలోకి కంపెనీ ప్రవేశించింది. 1974లో ఈ కంపెనీని స్థాపించారు. కంపెనీ తయరుచేస్తున్న ఉత్పత్తులు, కంపెనీ రాబడులు, వ్యాపార విస్తరణ వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల మార్కెట్‌లో లిస్ట్‌ చేశారు. ప్రస్తుతం కంపెనీ డామన్, హరిద్వార్,  చెన్నై, కలకత్తాల్లో కలిపి 13 తయారీ కేంద్రాలు కలిగి ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 30 శాతం పెరిగి రూ.285 కోట్లుగా నమోదైంది.ప్రస్తుతం ప్రదీప్ రాథోడ్ కుమారుడు గౌరవ్, తమ్ముడు పంకజ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. రాథోడ్ కుటుంబం విమ్‌ప్లాస్ట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది సెల్లో బ్రాండ్‌కు అనుబంధంగా ఉంటూ అనేక ప్లాస్టిక్ ఫర్నిచర్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇది గతంలోనే బీఎస్ఈలో లిస్ట్‌ అయింది. ఈ కంపెనీ రూ.700 కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌ను కలిగి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z