NRI-NRT

సింగపూర్ తెలుగు సంఘం 49వ ఆవిర్భావ దినోత్సవం

సింగపూర్ తెలుగు సంఘం 49వ ఆవిర్భావ దినోత్సవం

సింగపూర్‌ తెలుగు సమాజం 49వ ఆవిర్భావ వేడుకలను నవంబర్‌ 11న ఘనంగా నిర్వహించారు. ఆ సంస్థ ప్రతినిధులు సింగపుర్‌లోని SASCO వృద్ధాశ్రమాన్ని సందర్శించి సీనియర్‌ సిటిజన్లతో సరదాగా గడిపారు. వారందరితో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకొనే ప్రయత్నం చేశారు. వాళ్లకు భోజనం, తాజా పండ్లను అందించి ఆనందంగా గడిపారు. కొత్త దుస్తులు పంపిణీ చేశారు. భోజనాల అనంతరం కమిటీ సభ్యులు ఆ ప్రాంగణంలోని పరిశుభ్రతలో భాగస్వాములై వృద్ధాశ్రమం సిబ్బంది హృదయాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధుల ముఖాల్లో చిరునవ్వును చూశాక తమ ప్రయత్నం సఫలమైందని కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. ఏకకాలంలో ఔట్రం పార్క్‌, పుంగోల్‌లో రక్తదాన శిబిరాలతో ఈ వేడుకల్ని చిరస్మరణీయంగా నిలిచేలా చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో సింగపుర్‌లోని తెలుగు వారు పాల్గొని జయప్రదం చేశారు. భార్యాభర్తలు బండారు యశోద, మాసారపు రాజు తమ తనయుడితో కలిసి రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అందరికీ స్ఫూర్తిని కలిగించింది.

ఈ సందర్భంగా బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తెలుగు సమాజం ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులను, పూర్వ అధ్యక్షుల సేవల్ని కొనియాడారు. తెలుగు సమాజం ఎన్నో ఏళ్లుగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ రక్తదానంపై అవగాహన కల్పిస్తోందని చెప్పారు. గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ సేవా కార్యక్రమాల విశిష్టత, ఆవశ్యకతను వివరిస్తూ అందరికీ సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో వాలంటీర్లుగా వ్యవహరించిన ఆరేపల్లి విజయ్ బాబు, ఢీకొండ సంపత్ రావు, రక్తదాతలకు, వృద్ధాశ్రమం నిర్వాహుకులకు సహాయ కోశాధికారి జూనెబోయిన అర్జునరావు ధన్యవాదాలు తెలిపారు. సమాజానికి సేవచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా కార్యానిర్వాహక సభ్యులు తమకు వృద్ధాశ్రమంలో గడిపిన సమయంలో కలిగిన విశాల భావాల్ని పంచుకున్నారు. భవిష్యత్తులో తమకు రాబోయే వృద్ధాప్యం కళ్ళముందు కదలాడిందని, పరుగులమయ జీవితాన్ని కాసేపు ఆపేలా చేసిందని, మనలోని అహంకారాన్ని సంపూర్ణంగా తీసేస్తేనే ఆనందమైన జీవితం సాధ్యమవుతుందని.. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైతే స్వార్థం తగ్గి ఆనందమయ జీవితం వైపు వెళ్లడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల శ్రీలక్ష్మి, పాలెపు మల్లిక్, కొత్తా సుప్రియ, బచ్చు ప్రసాద్, పుల్లన్నగారి శ్రీనివాస రెడ్డి, టేకూరి నగేష్, రాపేటి జనార్దన్‌, వైదా మహేష్, బద్దం జితేందర్, స్వామి గోపి కిషోర్, రొడ్డ సతీష్, ఉద్ధగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z