వారికి సరైన అర్హతలు లేకున్నా.. ఓ క్లినిక్‌ను ఏర్పాటు చేసుకుని ఏకంగా ఆపరేషన్లు చేశారు. ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఏడుగురి మృతికి కారణమయ్యారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆ ఫేక్ డాక్టర్ల బండారం బయటపడింది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ఏరియాలో ఆ నలుగురు ఫేక్ సర్జన్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఇద్దరు పేషెంట్ల మృతి కేసులో డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతడి భార్య పూజా అగర్వాల్, డాక్టర్ జస్ప్రీత్ సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ మహేందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఫేక్ డాక్యుమెంట్లు చూపించి..
‘అగర్వాల్ మెడికల్ సెంటర్’ పేరుతో ఓ క్లినిక్‌ను నీరజ్ అగర్వాల్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. తన భార్యకు ఎలాంటి అర్హత లేకున్నా సర్జన్ అని చెప్పేవాడు. తానూ సర్జన్ అని చెప్పుకునేవాడు. ఇందుకోసం ఫేక్ డాక్యుమెంట్లను చూపేవాడు. ‘‘2022లో గాల్ బ్లాడర్ ట్రీట్‌మెంట్ కోసం అస్గర్ అలీ అనే వ్యక్తి అగర్వాల్ క్లినిక్‌లో చేరాడు. డాక్టర్ జస్ప్రీత్ సింగ్ సర్జరీ చేస్తారని అలీకి చెప్పారు. కానీ పూజ, మహేంద్ర వచ్చి ఆపరేషన్ చేశారు.
ఆపరేషన్ రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తీవ్ర నొప్పితో అలీ విలవిల్లాడాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. కానీ అలీ చనిపోయాడు” అని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాధితులు అగర్వాల్‌పై ఫిర్యాదు చేశారు. అగర్వాల్ ఫిజీషియన్ అని, ఫేక్ డాక్యుమెంట్లు చూపి సర్జరీలు చేస్తున్నాడని పేర్కొన్నారు.
2016 నుంచి 9 ఫిర్యాదులు
అగర్వాల్ క్లినిక్ పై2016 నుంచి 9 ఫిర్యాదులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. మెడికల్ నెగ్లిజెన్స్ కారణంగా ఏడుగురు పేషెంట్లు చనిపోయినట్లు వెల్లడైందని తెలిపారు. ‘‘నవంబర్ 1న నలుగురు డాక్టర్లతో కూడిన మెడికల్ బోర్డు.. అగర్వాల్ క్లినిక్‌ను ఎగ్జామిన్ చేసింది. ట్రీట్‌మెంట్లు, సర్జరీలకు సంబంధించిన తప్పుడు డాక్యుమెంట్లు దొరికాయి” అని పోలీసులు చెప్పారు. డాక్టర్ల సంతకాలు తప్ప.. ఏమీ రాయని 414 ప్రిస్క్రిప్షన్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు.
మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ)కి సంబంధించిన పేషెంట్ల వివరాలున్న రిజిస్టర్లను, నిషేధిత మందులు, ఇంజక్షన్లను కూడా సీజ్ చేశారు. సర్జికల్ బ్లేడ్లు, పేషెంట్లకు చెందిన ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ స్లిప్పులు, 47 బ్యాంకులకు చెందిన చెక్ బుక్కులు, 54 ఏటీఎం కార్డులు, పోస్ట్ ఆఫీసు పాస్‌బుక్కులు, ఆరు క్రెడిట్ కార్డు మెషీన్లను అగర్వాల్ ఇల్లు, క్లినిక్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –