* గృహ నిర్మాణశాఖపై జగన్ సమీక్ష
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గృహ నిర్మాణశాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ సమీక్ష చేపట్టారు.ఈ సమీక్షా సమావేశానికి గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ దీవాన్ మైదీన్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
* జమ్మూ కశ్మీర్‌లో స్వల్ప భూకంపం
జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం 9:34 గంటల ప్రాంతంలో దోడా (Doda) జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.మరోవైపు ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలో (Uttarkashi) స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 2.02 గంటలకు ఉత్తరకాశీలో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. భూకంప కేంద్రం రాజధాని డెహ్రూడూన్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. కాగా, అర్ధరాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ రాలేదని అధికారులు వెల్లడించారు. ఉత్తరకాశీలో గత 15 రోజుల్లో భూకంపం రావడం ఇది మూడో సారి.
* రేపు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కాగా, మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అమ్మహస్తం పేరుతో తొమ్మిది రకాల నిత్యవసర వస్తువుల పంపిణీని మేనిఫెస్టోలో పొందుపరచినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. తెలంగాణలో ప్రజలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్దమైనట్టు తెలుస్తోంది. మేనిఫెస్టోలో కీలక హామీలను ఇచ్చినట్టు సమాచారం. తెలంగాణ మేనిఫెస్టోను రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు.
* బీజేపీకి సంగారెడ్డి జిల్లాలో బిగ్ షాక్
ఎన్నికల వేళ బీజేపీకి సంగారెడ్డి జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి గురువారం పంపించారు. అనంతరం దేశ్ పాండే మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో బీజేపీకి ప్రాణం పోసిన తననే మోసం చేశారని ఆరోపించారు. పార్టీ అధ్యక్ష పదవికి కిషన్ రెడ్డి అనర్హుడని విమర్శించారు. బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా ఈటల రాజేందర్ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నంత వరకు బీజేపీ బాగుపడదని సీరియస్ కామెంట్స్ చేశారు.
* బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు
పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. ఆయనకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. పైసలిచ్చి మహిపాల్ రెడ్డి పార్టీ టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు విస్తరిస్తామన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన డబ్బులతోనే తెలంగాణలో ఆస్పత్రులు, డబుల్ బెడ్ రూం ఇళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ , కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలగాణ మరో శ్రీలంకగా మారుతుందన్నారు. మైనార్టీలను కేసీఆర్ మోసం చేశారని .. వారిని బీఆర్ఎస్ నేతలు కేవలం ఓటు బ్యా్ంక్ గానే చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
* పురంధేశ్వరికి విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. చంద్రబాబు విషయంలో మీరు చేస్తున్న పనికి.. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అని ప్రశ్నించారు. మీ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఎన్ని విన్యాసాలు చేస్తారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని…మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా?’.ఇదే సమయంలో..‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా టీడీపీ పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా పురందేశ్వరి గారూ. మీ అందరి ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటున్నారట. ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! బిజెపి గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
* మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి సీరియస్
గడిచిన పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిందే కాకుండా మళ్లీ మూడోసారి అధికారం ఇవ్వాలని కేసీఆర్ వస్తున్నాడని వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో మాట్లాడిన ఆయన.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, సీఎం కేసీఆర్ భూములు కబ్జాచేశారని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డికి ప్రైవేటు కాలేజీలు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చారు కానీ మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎందుకు తీసుకురాలేక పోయారని దుయ్యబట్టారు. తెలంగాణలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిందే కాకుండా కాంగ్రెస్ పార్టీపై అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ దుయ్యబట్టారు. హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, విమానాశ్రయం తెచ్చింది కాంగ్రెస్ కాదా? తెలంగాణ ఇచ్చింది, హైదరాబాద్‌కు కృష్ణ జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో దొరలకు ప్రజలకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజల తెంగాణ రావాలంటే దొరల తెలంగాణ కూలిపోవాలన్నారు. తాము అధికారంలోకి రాగానే మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తేవడంతో పాటు పేదలకు రూ.500 లేక సిలిండర్, ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేదల ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి రూ. లక్ష నగదు, తులం బంగారం ఇవ్వబోతుననట్లు హామీ ఇచ్చారు. ముదిరాజులను ఒక్క టికెట్ ఇవ్వని కేసీఆర్‌కు వారి ఓట్లు అక్కర్లేదా అని నిలదీశారు. రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్‌ను పొలిమేర వరకు తరమాల్సిన అవసరం వచ్చిందన్నారు. బొడుప్పల్‌లో వక్ఫ్ భూముల పేరుతో పేదలకు అన్యాయం చేస్తున్నారని తమ ప్రభుత్వంలో వారికి న్యాయం చేస్తామన్నారు.
* కాంగ్రెస్‌లోకి విజయశాంతి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొలిటికల్ పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ప్రక్రియ, ఉప సంహరణ అన్నీ ముగిసిపోయినప్పటికీ జంపింగ్‌లు మాత్రం ఆగడం లేదు. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి కొందరు నేతలు క్యూ కట్టగా.. సీనియర్ నేత విజయశాంతి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. వివరాల ప్రకారం.. బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె.. హస్తం పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. ఇక, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున ఖర్గే.. రేపు(శుక్రవారం) హైదరాబాద్‌కు రానున్నారు. కాంగ్రెస్ తలపెట్టిన కుత్బుల్లాపూర్ సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ సభలోనే విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి రాములమ్మ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది.
👉 – Please join our whatsapp channel here –